శిథిలావస్థకు రెవెన్యూ కార్యాలయం
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:30 PM
మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయ భవనం మేడి పండు చందాన తయారైంది. భవనం పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ బయటకు మంచిగా ఉన్నట్టు కనిపిస్తోంది. వర్షం వస్తే కారిపోతోంది. ఇరుకైన గదుల్లో అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి వస్తోంది.

కారిపోతున్న భవనంలో ఉద్యోగులు విధుల నిర్వహణ
టీడీపీ ప్రభుత్వ హయాంలో నూతన భవనం
నిర్మాణానికి రూ.70లక్షలు మంజూరు
రూ.8 లక్షలతో పునాదుల వరకు పనులు
బిల్లులు మంజూరు చేయని వైసీపీ ప్రభుత్వం
పనులు నిలుపుదల చేసిన కాంట్రాక్టర్
చింతపల్లి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి రెవెన్యూ కార్యాలయ భవనం దుస్థితి, ఇరుకు గదుల నేపథ్యంలో నూతన భవన నిర్మాణానికి 2018లో టీడీపీ ప్రభుత్వం రూ.70లక్షలను మంజూరు చేసింది. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను హౌసింగ్ శాఖ(ప్రాజెక్టు)కి అప్పగించింది. అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనం జీ-ప్లస్ వన్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో అదే ఏడాది పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ రూ.ఎనిమిది లక్షలతో పునాదులు నిర్మించి పిల్లర్ల నిర్మాణానికి ఐరన్ సిద్ధం చేశాడు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పునాదుల బిల్లు చెల్లించాలని కాంట్రాక్టర్ పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పైసా విడుదల చేయలేదు. దీంతో పనులను సంబంధిత కాంట్రాక్టర్ నిలిపివేశారు.
నిర్మాణాలను రద్దుచేసిన వైసీపీ ప్రభుత్వం
చింతపల్లి రెవెన్యూ కార్యాలయ నూతన భవన నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం రద్దుచేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనుల్లో 25 శాతం లోపు నిర్మాణాలను రద్దు చేయాలని వివిధ శాఖల అధికారులకు వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో చింతపల్లి రెవెన్యూ కార్యాలయ నిర్మాణాల టెండర్‌ని ప్రభుత్వం రద్దుచేసింది.
బిల్లు కోసం పలుమార్లు కాంట్రాక్టర్ వినతి
రెవెన్యూ కార్యాలయ నిర్మాణాలను ప్రభుత్వం రద్దు చేయడంతో అంతవరకు వ్యయం చేసిన రూ.ఎనిమిది లక్షల బిల్లును చెల్లించాలని కాంట్రాక్టర్ శెట్టి తిరుమలేశ్వరరావు అలియాస్ రాజ పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నిర్మాణాలకు సంబంధించి పైసా కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. అయితే కాంట్రాక్టర్ 2021లో కరోనా బారిన పడి చికిత్సకు డబ్బులు లేని దయనీయ స్థితిలో మరణించాడు.
ఇబ్బందులు పడుతున్న రెవెన్యూ ఉద్యోగులు
స్థానిక రెవెన్యూ అధికారులు కార్యాలయంలో వసతి సమస్యతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పాత భవనం కావడంతో వర్షం కురిస్తే చాలు పలు చోట్ల కారిపోతోంది. అలాగే ఇరుకైన గదిలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆర్‌ఐ, డీటీ, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు కూర్చునేందుకు ప్రత్యేక గదులు లేవు. కేవలం నాలుగు గదుల్లోనే ఉద్యోగులు సర్దుకుని సేవలందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నిలిచిపోయిన రెవెన్యూ కార్యాలయం నిర్మాణాల పునఃప్రారంభానికి కదలిక కనిపించకపోవడంతో ప్రాంతీయ ప్రజలు నిరాశ చెందుతున్నారు.