Share News

ఆక్రమణదారుల వీరంగం

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:00 AM

సబ్బవరంలో ఆక్రమణదారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై దాడి చేశారు. కులం పేరుతో దూషించారు. రెవెన్యూ సిబ్బంది విధులకు అడ్డుపడి నానా యాగీ చేశారు. ఆక్రమణలు తొలగిస్తున్న ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌, సహాయకులపై కూడా దాడి చేశారు. ఇటుకలతో ఎక్స్‌కవేటర్‌ అద్దాలు పగులగొట్టి భయానక వాతావరణం సృష్టిం చారు. దీనిపై స్థానిక పోలీసులకు తహసీల్దార్‌ బి.చిన్నికృష్ణ ఫిర్యాదు చేశారు.

ఆక్రమణదారుల వీరంగం
వీఆర్‌ఏ ముదపాక అప్పారావుపై దాడి చేస్తున్న ఆక్రమణదారులు

- ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై దాడి

- ఎక్స్‌కవేటర్‌ అద్దాలు పగులగొట్టిన వైనం

- రెవెన్యూ సిబ్బందిపై దుర్భాషలు

- భయభ్రాంతులకు గురైన సిబ్బంది

- పోలీసులకు తహసీల్దార్‌ ఫిర్యాదు

సబ్బవరం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): సబ్బవరంలో ఆక్రమణదారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై దాడి చేశారు. కులం పేరుతో దూషించారు. రెవెన్యూ సిబ్బంది విధులకు అడ్డుపడి నానా యాగీ చేశారు. ఆక్రమణలు తొలగిస్తున్న ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌, సహాయకులపై కూడా దాడి చేశారు. ఇటుకలతో ఎక్స్‌కవేటర్‌ అద్దాలు పగులగొట్టి భయానక వాతావరణం సృష్టిం చారు. దీనిపై స్థానిక పోలీసులకు తహసీల్దార్‌ బి.చిన్నికృష్ణ ఫిర్యాదు చేశారు.

దీనికి సంబంధించి తహసీల్దార్‌ బి.చిన్నికృష్ణ, ఆర్‌ఐ వీరయ్య, వీఆర్‌ఏ ముదపాక అప్పారావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. సబ్బవరం సర్వే నంబర్లు 255 గెడ్డవాగు, 271 ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించేందుకు తహసీల్దార్‌ బి.చిన్నికృష్ణ ఆదేశాల మేరకు ఆర్‌ఐ బి.వీరయ్య, వీఆర్వోలు వినోద్‌, నూకరత్నం శుక్రవారం మధ్యాహ్నం ఎక్స్‌కవేటర్‌తో సహా వెళ్లారు. సర్వే నంబరు 255లో ఆక్రమణలను తొలగించినప్పుడు ఆక్రమణదారులు దాడులకు తెగబడ్డారు. అయితే రెవెన్యూ సిబ్బంది అతి కష్టమ్మీద గెడ్డవాగులో వేసిన పైపులు, మట్టి రోడ్డును ధ్వంసం చేశారు. అనంతరం సబ్బవరం మండలం రావలమ్మపాలెం గ్రామానికి చెందిన గొంప ముత్యాలనాయుడు తన జిరాయితీ(279) భూమికి ఆనుకొని సర్వే నంబరు 271లోని ప్రభుత్వ భూమిలో సుమారు 20 సెంట్లు ఆక్రమించి, నిర్మించిన ప్రహరీ గోడను తొలగించేందుకు రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. ఎక్స్‌కవేటర్‌తో ఆక్రమణలను తొలగిస్తుండగా ఆక్రమణదారుడు గొంప ముత్యాలనాయుడు, సబ్బవరం శివారు గొర్లివానిపాలేనికి చెందిన గొర్లి కుమార్‌స్వామి, లగుడు సత్యనారాయణ, గొర్లి శ్రీనివాసరావు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. వీఆర్వో వినోద్‌, వీఆర్‌ఏ ముదపాక అప్పారావుపై దాడి చేసి కొట్టారు. దుర్భాషలాడారు. విధులను అడ్డుకున్నారు. ఎక్స్‌కవేటర్‌ సిబ్బందిపై కూడా దాడి చేశారు. రాళ్లతో ఎక్స్‌కవేటర్‌ అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించారు. ఈ విషయాన్ని తహసీల్దార్‌కు తెలియజేయడంతో ఆయన ఆదేశాల మేరకు వీఆర్‌ఏ, ఆర్‌ఐ శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ ఆక్రమణదారుల దౌర్జన్యంపై పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఆక్రమణదారుల దాష్టీకంపై సీఐ పిన్నింటి రమణకు తాను కూడా నేరుగా ఫిర్యాదు చేశానన్నారు.

రెవెన్యూ సిబ్బందిపై దౌర్జన్యాన్ని ఖండించిన ఎంఆర్‌పీఎస్‌

రెవెన్యూ సిబ్బందిపై ఆక్రమణదారుల దౌర్జన్యాన్ని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు జి.సామ్రాట్‌కుమార్‌ ఖండించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వీఆర్‌ఏ, వీఆర్వోలు విఽధులు నిర్వహిస్తారని, అటువంటి వారిపై వ్యక్తిగతంగా దాడి చేయడం, దుర్భాషలాడడం దారుణమన్నారు. వీఆర్‌ఏ అప్పారావు మాట్లాడుతూ గతంలో కూడా ఇటువంటి దాడులకు గురయ్యామని, తక్షణమే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

గతంలో సీసీఎల్‌ఏకు ఫిర్యాదు

సబ్బవరం 271లో ఆక్రమణపై వైసీపీ ప్రభుత్వ హయాంలో (2022-23) ఓ వ్యక్తి స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పట్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రెండోసారి నేరుగా సీసీఎల్‌ఏ(చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌)కు ఫిర్యాదు చేశారు. అయితే సీసీఎల్‌ఏ ఆదేశాలతో అప్పటి రెవెన్యూ అధికారులు మొక్కుబడి చర్యలతో నివేదికను పంపించారు. అప్పటి నుంచి ఈ కేసు సీసీఎల్‌ఏలో పెండింగ్‌లో ఉంది. కూటమి ప్రభుత్వంలో పెండింగ్‌ ఫిర్యాదులు క్లియర్‌ చేయడంలో భాగంగా సర్వే నంబరు 271లో ఆక్రమణలు తొలగించాలని మరోసారి సీసీఎల్‌ఏ నుంచి తహసీల్దార్‌కు ఆదేశాలు వచ్చాయి. దీంతో సిబ్బంది శుక్రవారం ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

Updated Date - Mar 23 , 2025 | 01:00 AM

News Hub