దళారుల గుప్పెట్లో మిరియాల మార్కెటింగ్
ABN , Publish Date - Mar 25 , 2025 | 02:09 AM
ఆదివాసీ రైతులు పండించిన మిరియాలకు అంతర్జాతీయ ధరలు అందడంలేదు.

ఆదివాసీలకు అందని అంతర్జాతీయ ధరలు
కొచ్చిన్ మార్కెట్‌లో కిలో రూ.688-708
ఏజెన్సీలో వర్తకులు కిలో రూ.580-590కి కొనుగోలు
కాఫీ తరహాలో జీసీసీ మార్కెటింగ్ చేయాలని రైతులు వినతి
గూడెంకొత్తవీధి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):
ఆదివాసీ రైతులు పండించిన మిరియాలకు అంతర్జాతీయ ధరలు అందడంలేదు. ఇక్కడ ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సదుపాయంలేకపోవడం వల్ల ప్రైవేటు వర్తకులు నిర్ణయించిన ధరకే రైతులు విక్రయించుకోవాల్సి వస్తున్నది. కొచ్చిన్ మార్కెట్‌లో మిరియాలు విక్రయిస్తున్న రైతులకు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణమైన ధరలు లభిస్తుండగా, ఏజెన్సీ రైతులకు కిలోకు వంద రూపాయలకుపైగా తక్కువ ధర లభిస్తున్నది. కాఫీ తరహాలో మిరియాలకు కూడా గిరిజన సహకార సంస్థ మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లాలో గిరిజన రైతులు కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలను సాగు చేస్తున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 98 వేల ఎకరాల్లో మిరియాల తోటలు వున్నాయి. గిరిజన రైతుల కోసం ఏర్పాటైన గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మిరియాలు కొనుగోలు చేయకపోవడంతో పండించిన పంటను అమ్ముకోవడానికి ప్రైవేటు వర్తకులపై ఆధారపడాల్సి వస్తున్నది. దీంతో వారు చెప్పిన ధరకే మిరియాలు విక్రయిస్తున్నారు. దేశంలో మిరియాలు సాగు చేసే ప్రాంతాల్లో ధరలు ఎలా వున్నాయో తెలుసుకునే పరిజ్ఞానం ఇక్కడ రైతులకు లేకపోయింది. మిరియాల ప్రధాన మార్కెట్ కొచ్చిన్‌లో వుంది. ఇక్కడి ధరల ప్రకారం దేశంలోని ఇతర ప్రాంతాల్లో మిరియాల ధరలను నిర్ణయిస్తుంటారు. కొచ్చిన్ మార్కెట్ ధరలు ఇక్కడ రైతులకు తెలిసే అవకాశంలేదు. ప్రైవేటు వ్యాపారులు ఎప్పటికప్పుడు కొచ్చిన్‌లో ధరలను తెలుసుకుంటూ అక్కడ కన్నా 10-20 శాతం రేటు తగ్గించి ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. ఇదిలావుండగా కాఫీ ధరలను రైతులకు తెలియజేసేందుకు చింతపల్లి, పాడేరులో కేంద్ర కాఫీ బోర్డు విస్తరణ కార్యాలయాలు వున్నాయి. ఇదే తరహాలో మిరియాల రైతులను ప్రోత్సహించేందుకు, మార్కెటింగ్ సమాచారం అందించేందుకు ప్రభుత్వ సంస్థలు ఏర్పాట్లు చేయలేదు.
కిలోకు రూ.100కుపైగా తేడా
కొచ్చిన్ మార్కెట్ ధరలతో పోలిస్తే ఏజెన్సీలో ప్రైవేటు వర్తకులు కొనుగోలు చేస్తున్న ధరలు చాలా తక్కువగా వుంటున్నాయి. నవంబరులో మిరియాల మార్కెటింగ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కొచ్చిన్ మార్కెట్‌లో మొదటి రకం మిరియాలు కిలో రూ.708, రెండోవ రకం రూ.688 ధర పలుకుతున్నాయి. కానీ ఏజెన్సీలో వర్తకులు కిలో రూ.580-590కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కిలోకి రూ.100 వరకు ఇక్కడి రైతులు నషప్టపోతున్నారు.
జీసీసీ మార్కెటింగ్ చేయాలి
మామిడి బాలయ్య, జీకేవీధి
ప్రైవేటు వర్తకులు అడిగిన రేటుకు మిరియాలు విక్రయించుకోవాల్సివస్తున్నది. కాఫీ మాదిరిగా మిరియాలకు కూడా జీసీసీ మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే అంతర్జాతీయ ధరలు లభిస్తాయి. జీసీసీ ధరలు ప్రకటిస్తే ప్రైవేటు వర్తకులు సైతం అవే ధరలకు కొనుగోలు చేస్తారు. కలెక్టర్, జీసీసీ ఎండీ స్పందించి మిరియాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి.