అకాల వర్షం
ABN , Publish Date - Mar 25 , 2025 | 02:06 AM
జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది.

పలుచోట్ల వడగండ్ల వాన
ఈదురు గాలులతో లేచిపోయిన ఇళ్ల పైకప్పులు
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్)
జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. చోడవరంలో వడగండ్లు పడ్డాయి. కొన్నిచోట్ల ఈదురు గాలులు వీచడంతో పూరిళ్లు, రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వర్షం కారణంగా వాతావరణం చల్లబడడంతో పక్షం రోజుల నుంచి ఎండ తీవ్రతతో ఇబ్బంది పడిన ప్రజలు ఉపశమనం చెందారు. అనకాపల్లి పట్టణంలో సోమవారం మధ్యాహ్నం సుమారు 20 నిమిషాలపాటు ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. 12.5 ఎం.ఎం.ల వర్షపాతనం నమోదైనట్టు ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు తెలిపారు. వర్షం కారణంగా పట్టణంలోని డ్రైనేజీ కాలువలు పొంగి మురుగునీరు రోడ్లపై ప్రవహించింది. చోడవరంలో సుమారు అరగంటపాటు వడగండ్లతో భారీ వర్షం కురిసింది. అనకాపల్లి మండలంలో రేబాక పంచాయతీ శివారు కాపుశెట్టివానిపాలెంలో ఈదురుగాలుల కారణంగా కరణం రమణకు చెందిన ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. వర్షం పడడంతో ఇంటిలోని సామాన్లన్నీ తడిసిపోయాయి. మునగపాక మండలంలో ఈదురు గాలులు వీచడంతో పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. మూలపేటలోు కొబ్బరి చెట్టు విరిగి, విద్యుత్ లైన్‌పై పడడంతో నాలుగు స్తంభాలు నేలకొరిగాయి. చీడికాడ, గొలుగొండ, సబ్బవరం, బుచ్చెయ్యపేట, కశింకోట మండలాల్లో జల్లులు పడ్డాయి. నర్సీపట్నం, రావికమతం, కోటవురట్ల, అచ్యుతాపురం, ఎలమంచిలి, కె.కోటపాడు, పాయకరావుపేట, రాంబిల్లి, మాకవరపాలెం, ఎస్.రాయవరం మండలాల్లో ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లగా వుంది.