Share News

అల్లూరిపై సినిమా

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:04 AM

అల్లూరి చరిత్రకు సంబంధించిన మరిన్ని అంశాలతో సినిమా తీయాలనే ఆలోచన ఉన్నట్టు దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు.

అల్లూరిపై సినిమా

  • దర్శకుడు కృష్ణవంశీ వెల్లడి

  • రచయిత ‘యండమూరి’తో కలిసి అల్లూరి స్మారక ప్రదేశాల సందర్శన

కృష్ణాదేవిపేట/, కొయ్యూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):

అల్లూరి చరిత్రకు సంబంధించిన మరిన్ని అంశాలతో సినిమా తీయాలనే ఆలోచన ఉన్నట్టు దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. ఆయన సోమవారం ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌తో కలిసి గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో గల అల్లూరి స్మారక పార్కును సందర్శించారు. అల్లూరి, గంటందొరల సమాధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి జీవిత చరిత్రకు సంబంధించి పార్కులో ఉన్న శిలాఫలకాలను పరిశీలించారు. అక్కడ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బట్టపణుకుల పంచాయతీ లంకవీధి వెళ్లి అల్లూరి అనుచరులైన గాం గంటం దొర, మల్లుదొర వారసులను పరామర్శించారు. వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. గంటందొర జీవిత విషయాల గురించి ఆరా తీశారు. ‘నేను సైతం’ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ కె.శివప్రసాద్‌ సమకూర్చిన చీరలు, దుప్పట్లను గంటందొర కుటుంబీకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ అల్లూరిపై కొత్తపంథాలో సినిమా తీయాలనుకుంటున్నట్టు చెప్పారు. గంటందొర, మల్లుదొరలకు చెందిన జీవిత విశేషాలను, స్వాతంత్య్రం సాధించడంతో వారి పాత్రను భావితరాలకు తెలిసేలా సినిమాకు రూపకల్పన చేస్తామన్నారు. అల్లూరి చరిత్రపై 20 సంవత్సరాలు పైబడి రీసెర్చ్‌ చేసిన గోకరాజు నారాయణరావు రచనను ఆధారంగా చేసుకుని సినిమా తీయాలనుకుంటున్నట్టు చెప్పారు. రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ మాట్లాడుతూ అల్లూరి చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన స్మారక ప్రాంతాలను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 02:04 AM