Share News

ప్రభుత్వ భూమికి ఎసరు

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:03 AM

ఆనందపురం మండలం ముచ్చెర్ల గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆ ప్రాంతానికి చెందిన ఒకరు బేరం పెట్టడం కలకలం రేపుతోంది.

ప్రభుత్వ భూమికి ఎసరు

  • ఆనందపురం మండలం ముచ్చెర్లలో 87.6 ఎకరాలను అమ్మకానికి పెట్టిన వైనం

  • పలువురి నుంచి అడ్వాన్స్‌లు

  • ప్రభుత్వం దృష్టికి వ్యవహారం

  • ముచ్చెర్ల అన్‌సెటిల్‌ గ్రామంగా పేర్కొంటున్న తహసీల్దార్‌

విశాఖపట్నం/ఆనందపురం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం మండలం ముచ్చెర్ల గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆ ప్రాంతానికి చెందిన ఒకరు బేరం పెట్టడం కలకలం రేపుతోంది. విజయనగరం సంస్థానం నుంచి తమకు వారసత్వంగా వచ్చిన భూమిగా పేర్కొంటూ పలువురి నుంచి అడ్వాన్స్‌లు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

రెవెన్యూ అధికారుల సమాచారం ప్రకారం ముచ్చెర్ల అన్‌సెటిల్‌ గ్రామం. పూర్వం విజయనగరం సంస్థానాన్ని పాలించిన పూసపాటి వంశీయుల ఆధీనంలో ఈ గ్రామం ఉండేది. అప్పట్లో తమ భూములు సర్వే చేయాల్సిందిగా మద్రాస్‌ ప్రెసిడెన్సీలో సర్వేయర్‌గా ఉన్న హెచ్‌జే గిల్‌మన్‌ను పూసపాటి వంశీయులు కోరారు. 1901 నుంచి 1903 వరకు గిల్‌మెన్‌ ఈ ప్రాంతంలో సర్వే చేసి విజయనగరం పూసపాటి వంశీయుల భూములపై రికార్డు రూపొందించారు. గిల్‌మన్‌ సర్వే చేసిన గ్రామాల్లో ముచ్చెర్ల కూడా ఉంది. అయితే అప్పట్లో విజయనగరం రాజుల నుంచి భూములను కొందరు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకునేవారు. మరికొందరికి రాజులే భూములు దానం చేశారు. రానురాను గ్రామంలో చాలావరకూ భూములు రైతుల ఆధీనంలో ఉండగా, మరికొన్ని ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో నమోదయ్యాయి. కొందరు రైతుల ఆధీనంలో ఉన్న భూములను ఒక మాజీ ప్రజా ప్రతినిధి అనధికారికంగా కొనుగోలు చేసి తన ఆధీనంలో ఉంచుకున్నారు. మరికొంత భూమిని రైతులు సాగు చేస్తూ జీడి, మామిడి తోటలు పెంచుకున్నారు. అయితే పూసపాటి వంశీయుల నుంచి దఖలు పడినట్టు కొందరు డాక్యుమెంట్లు సృష్టించి భూముల స్వాధీనానికి యత్నించడం, రైతులు ప్రతిఘటించడం, తదితర కారణాలతో గ్రామాన్ని అన్‌సెటిల్‌గా రెవెన్యూ శాఖ గుర్తించింది. గ్రామంలోని సర్వే నంబరు 2 నుంచి 36 వరకు మొత్తం 125 ఎకరాలను 2017లో జిల్లా యంత్రాంగం ప్రభుత్వ నిషేధ భూముల జాబితా (22-ఎ)లో చేర్చింది. ఈ మేరకు ఆనందపురం తహసీల్దార్‌ ఒక సర్య్కులర్‌ జారీచేశారు. అలాగే సర్వేనంబర్‌ 13లో 87.6 ఎకరాల బంజరు ఉండగా, అందులో సుమారు 41.89 ఎకరాలకు గ్రామంలో భూమి లేని పేదలకు చాలాకాలం క్రితమే ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఇంకా 45.71 ఎకరాల భూమి బంజరుగా ఉంది. కొందరు రైతులు ఈ భూమిలో జీడి, మామిడి తోటలు పెంచుకుని జీవనం సాగిస్తున్నారు. ఇదిలావుండగా నగరానికి ఆనుకుని ఉన్న ఆనందపురం మండలంలో భూములకు విలువ పెరగడంతో అదే ప్రాంతానికి చెందిన ఒకరు రంగంలోకి దిగి 22-ఎలో ప్రభుత్వ బంజరుగా ఉన్న 45.71 ఎకరాలు, పేదలకు పట్టాలు ఇచ్చిన భూమి సుమారు 41.89 ఎకరాలు మొత్తం...87.6 ఎకరాలు విజయనగరం సంస్థానం నుంచి తమకు దఖలు పడిందని పేర్కొంటూ, వాటిని విక్రయించేందుకు కొద్దికాలంగా అడ్వాన్స్‌లు తీసుకున్నారు. అడ్వాన్స్‌లు ఇచ్చిన పలువురు ఆ తరువాత ఆనందపురం మండల తహసీల్దారు కార్యాలయం అధికారులను సంప్రతించగా అసలు విషయం తెలిసింది. ముచ్చెర్ల గ్రామంలో సర్వే నంబర్‌ 13లో మొత్తం బంజరుగా ఉందని, గతంలో 40 ఎకరాలకుపైగా పేదలకు పట్టాలు ఇచ్చామని వివరించారు. అయినా తాజాగా సదరు దళారి మరికొందరిని మోసంచేసి అడ్వాన్స్‌లు తీసుకున్నట్టు గుర్తించిన కొందరు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆనందపురం తహసీల్దార్‌ శ్యామ్‌ప్రసాద్‌ వద్ద ప్రస్తావించగా ముచ్చెర్ల అన్‌ సెటిల్‌ గ్రామం అని పేర్కొన్నారు. అటువంటప్పుడు భూములు కొనుగోలు చేసేవారంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. సర్వే నంబర్‌ 13లో ఉన్న 45.71 ఎకరాలను 2017లో 22-ఎలో చేర్చామని, అది ప్రభుత్వ బంజరు అని స్పష్టంచేశారు.

Updated Date - Mar 25 , 2025 | 02:03 AM