విద్యార్థులకు తగ్గనున్న మోత బరువు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:29 AM
విద్యార్థులకు మోతభారం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సగానికి సగం పుస్తకాలు తగ్గింపు
ప్రభుత్వ నిర్ణయం
వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా డిపోకు చేరుతున్న పాఠ్యపుస్తకాలు
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు 38 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరంం
ప్రస్తుతం 4 లక్షల వరకూ రాక
గాజువాక, మార్చి 27 (ఆంధ్రజ్యోతి):
విద్యార్థులకు మోతభారం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెమ్-1కు సంబంధించి ఒకటి, రెండు తరగతులకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ కలిపి ఒక పాఠ్యపుస్తకం, ఒక వర్క్ బుక్ ఉంటాయి. గతంలో ఆరు పుస్తకాలు ఉండేవి. అటువంటిది రెండు పుస్తకాలకే పరిమితం చేశారు. అదేవిధంగా మూడు నుంచి ఐదో తరగతి వరకూ సెమ్-1కు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ కలిపి ఒక పుస్తకం, మ్యాథ్స్, ఈవీఎస్ కలిపి ఒక పుస్తకం, రెండు వర్క్ బుక్స్ అందుబాటులోకి రానున్నాయి. గతంలో 8 పుస్తకాల వరకూ ఉండేవి. ఆరు, ఏడు తరగతులకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ కలిపి ఒక పుస్తకం, సైన్స్, సోషల్, మ్యాథ్స్ కలిపి ఒక పుస్తకం, రెండు వర్క్ బుక్స్ ఉంటాయి. ఎనిమిది, తొమ్మిది తరగతులకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ కలిపి ఒక పుస్తకం, పీఎస్, ఎన్‌ఎస్ కలిపి మరో పుస్తకం, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటిక్స్ కలిపి ఒక పుస్తకంగా, మూడు వర్క్ బుక్స్ అందజేస్తారు. గతంలో 15 పుస్తకాల వరకూ ఉండేవి. అటువంటిది ఆరు పుస్తకాలకు తగ్గించడంతో విద్యార్థులకు మోతభారం తగ్గనున్నది. సిలబస్ విషయంలో కూడా కొంత వెసులుబాటు కలగనున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏటా మే నెలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తుంటారు. అయితే కొత్త ప్రభుత్వం ఈ ప్రక్రియను మార్చి నుంచే ప్రారంభించింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో ఉన్న 46 మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే ఏడాది సుమారు 38 లక్షలకు పైబడి పుస్తకాలు అవసరమవుతాయని అధికారులు లెక్కించారు. ప్రస్తుతం వివిధ తరగతులకు సంబంధించి 3,99,153 పుస్తకాలు గాజువాకలోని జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విక్రయ కేంద్రానికి చేరుకున్నాయి. దఫదఫాలుగా ఏప్రిల్ నెలాఖరులోగా మొత్తం పుస్తకాలు డిపోకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.