పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:07 AM
Derailed Nagavali Express మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి సంబల్‌పూర్‌కు వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబరు 20810) రైలు విజయనగరం రైల్వేస్టేషన్‌కి దగ్గరలో బుధవారం పట్టాలు తప్పింది.

పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్
విజయనగరంలో ఘటన
ప్రయాణికులు క్షేమం
విజయనగరం క్రైం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి సంబల్‌పూర్‌కు వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబరు 20810) రైలు విజయనగరం రైల్వేస్టేషన్‌కి దగ్గరలో బుధవారం పట్టాలు తప్పింది. ఆ సమయంలో భారీగా కుదుపు రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. కొందరు భయంతో కేకలు వేశారు. రైల్వే డ్రైవర్, గార్డ్ అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. రెండు బోగీలు తప్పిన వెంటనే రైలును నిలిపివేశారు. ఉదయం 11.50 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అనంతరం రైల్వే అధికారులు వచ్చి పట్టాలు తప్పిన బోగీలను పూర్తిగా పక్కకు తప్పించే పనులు చేపట్టారు. రైల్వే డీఆర్‌ఎం లలిత్ బోరా ఘటనపై తొలుత ఆరా తీశారు. సాయంత్రం 4.30 గంటలకు విజయనగరం చేరుకున్నారు. విశాఖ నుంచి రైల్వే సాంకేతిక నిపుణులు కూడా వచ్చి ట్రాక్‌ను, రైలు బోగీలను పరిశీలించారు. పట్టాలు తప్పడానికి గల సాంకేతిక కారణాలను తెలుసుకుంటున్నారు.
- ఘటనపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆరా తీశారు. రైల్వే డీఆర్‌ఎం లలిత్‌బోరాతో ఫోన్లో మాట్లాడి సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం తీరును తెలుసుకున్నారు. రైల్వే అధికారులతోనూ మాట్లాడారు.