రబీకి కష్టకాలం
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:36 AM
వంగర మండలం కొప్పర కొత్తవలసకు చెందిన తవిటనాయుడు తన పొలంలో మొక్కజొన్న సాగుచేసే వాడు. రబీ పంటగా వేసి మంచి ఆదాయం పొందేవాడు. కానీ గత రెండేళ్లలో సకాలంలో నీరందక, చీడపీడలు, తెగుళ్లు పెరిగి తీవ్రంగా నష్టపోయాడు. దీంతో రబీలో సాగు చేయకుండా ఉండడమే మేలన్న నిర్ణయానికి వచ్చాడు.

-వంగర మండలం కొప్పర కొత్తవలసకు చెందిన తవిటనాయుడు తన పొలంలో మొక్కజొన్న సాగుచేసే వాడు. రబీ పంటగా వేసి మంచి ఆదాయం పొందేవాడు. కానీ గత రెండేళ్లలో సకాలంలో నీరందక, చీడపీడలు, తెగుళ్లు పెరిగి తీవ్రంగా నష్టపోయాడు. దీంతో రబీలో సాగు చేయకుండా ఉండడమే మేలన్న నిర్ణయానికి వచ్చాడు.
-రేగిడి మండలం శిర్లాం గ్రామానికి చెందిన అసిరి నాయుడు తన పొలంలో చెరకు సాగుచేసేవాడు. ఖరీఫ్‌లో వరితో పాటు రబీలో చెరకు వేసేవాడు. క్రమేపీ చెరకు సాగుతో నష్టాలు ప్రారంభమయ్యాయి. పెట్టుబడులు పెరిగాయి. మద్దతు ధర కూడా తగ్గింది. దీంతో రబీలో చెరకు సాగు మానేశాడు.
-రాజాం నియోజకవర్గం మడ్డువలస రిజర్వాయర్ పరిధిలో రబీ సీజన్ కింద రైతులు ఆరుతడి పంటలు అధికంగా వేసేవారు. కాలువ పరిధిలోని వంగర, రేగిడి, సంతకవిటి మండలాల్లో వేలాది ఎకరాల్లో పెసర, మినుము, వేరుశెనగ వంటివి పండేవి. కానీ రిజర్వాయర్ నీరు ఖరీఫ్‌నకే పరిమితం అవుతోంది. సంక్రాంతి తరువాత చుక్కనీరు రాని దుస్థితి. గతంలో వేల ఎకరాల్లో పండిన పంటలు ఇప్పుడు వందల ఎకరాలకు పడిపోయాయి.
రాజాం, మార్చి 21(ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రబీలో పంటల సాగు తగ్గుముఖం పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఖరీఫ్ కింద వరి పండించేవారు. రబీలో మొక్కజొన్న, వేరుశెనగ, చెరకు, నువ్వు, పెసర, మినుము, ఉలవలు వంటి ఆరుతడి పంటల సాగు ఉండేది. కానీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగింది. వర్షాకాలంలో మాత్రమే ప్రాజెక్టులకు నీరందే పరిస్థితి. మడ్డువలస, నారాయణపురం, తోటపల్లి ప్రాజెక్టుల వద్ద నీటి లభ్యత లేకుండా పోయింది. వర్షాకాల సమయంలో నీటినిల్వ చేసుకునే ప్రయత్నాలు జరగలేదు. ప్రాజెక్టులకు మరమ్మతులు లేకపోవడంతో నిల్వ చేసినా నీరు ఉండని పరిస్థితి. సంక్రాంతి తరువాత భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. దీంతో మోటార్లకు సైతం నీరు అందని దుస్థితి. ఈ కారణాలతో రబీ సాగంటేనే రైతు విముఖత చూపుతున్నారు.
వరితో పాటు ఇతర పంటలతోనే..
రైతులకు వరితో పాటు ఇతర పంటలు పండితేనే స్వాంతన చేకూరేది. జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఏడాదికేడాది రబీ సాగు తగ్గుముఖం పడుతోంది. రబీ సాగు సాధారణ విస్తీర్ణం 65,809 హెక్టార్లు. కానీ ఈ ఏడాది 45,137 హెక్టార్లు సాగు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇంత సాగు అన్నది అనుమానమే. అధికారులు మాత్రం ఫర్వాలేదని చెబుతున్నారు. జిల్లాలో వరి తరువాత ఎక్కువగా సాగుచేసే పంటల జాబితాలో మొక్కజొన్న, చెరకు, నువ్వు, వేరుశెనగ ఉన్నాయి. రబీ పంటలకు మద్దతు ధర, గిట్టుబాటు ధర కల్పించడం లేదు. దీంతో దళారులు, వ్యాపారులు రైతుల శ్రమను దోచుకుంటున్నారు. ఈ కారణాలన్నీ రబీలో సాగు తగ్గుముఖం పట్టడానికి కారణాలుగా తెలుస్తోంది.
వాస్తవమే..
జిల్లాలో రబీలో సాగు విస్తీర్ణం తగ్గిన మాట వాస్తవమే. కానీ గత ఏడాదితో పోలిస్తే మాత్రం పెరిగింది. ప్రధానంగా సాగునీటి కొరత కారణంగానే రైతులు రబీలో పంటల సాగును తగ్గిస్తున్నారు. అందుకే ప్రభుత్వం సాగునీటి వనరులపై దృష్టిపెట్టింది. వ్యవసాయ శాఖపరంగా సలహాలు, సూచనలు అందిస్తున్నాం.
-వీటి రామారావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, విజయనగరం