Share News

Flowride effect villiages ఆ రెండు గ్రామాలపై ఫ్లో‘రైడ్‌’

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:50 PM

Flowride on those two villages అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే నీళ్లు ఆ రెండు గ్రామాల ప్రజలకు అనారోగ్యాన్ని తెస్తున్నాయి. దాహం తీర్చే జలం వారికి గరళం అవుతోంది. సాధారణంగా నీరు బాగా తాగకుంటే సమస్యలు వస్తాయి. వారికి మాత్రం నీరు తాగినా సమస్యలొస్తున్నాయి. దాహం వేసినా.. గొంతు పొడిగా మారినా తనివితీరా నీరు తాగులేని దుస్థితిలో ఉన్నారు.

Flowride effect villiages ఆ రెండు గ్రామాలపై ఫ్లో‘రైడ్‌’
మోదుగులపేలోని ఫ్లోరైడ్‌ బాధితులు

ఆ రెండు గ్రామాలపై ఫ్లో‘రైడ్‌’

సంవత్సరాలుగా ప్రజలు విలవిల

వ్యాధులతో వందలాది మంది సతమతం

చేతిపంపుల నీటిలో అధికంగా ఫ్లోరిన్‌

విషయం గుర్తించినా చర్యలు శూన్యం

మోదుగులపేట, చినముకుందపురం ప్రజల పరిస్థితి దయనీయం

అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే నీళ్లు ఆ రెండు గ్రామాల ప్రజలకు అనారోగ్యాన్ని తెస్తున్నాయి. దాహం తీర్చే జలం వారికి గరళం అవుతోంది. సాధారణంగా నీరు బాగా తాగకుంటే సమస్యలు వస్తాయి. వారికి మాత్రం నీరు తాగినా సమస్యలొస్తున్నాయి. దాహం వేసినా.. గొంతు పొడిగా మారినా తనివితీరా నీరు తాగులేని దుస్థితిలో ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఫ్లోరైడ్‌ సమస్యను ఎదుర్కొంటున్న మోదుగులపేట, చినముకుందపురం ప్రజల దుస్థితిదీ. వారు పడుతున్న అవస్థలు.. ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను అధికారులు గుర్తించినా పరిష్కారం చూపడం లేదు. ఈ రెండు గ్రామాల్లో వందలాది మంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు.

రాజాం/ సంతకవిటి, మార్చి 19(ఆంధ్రజ్యోతి):

భూగర్భ జలాలను కలుషితం చేసి మనిషి గొంతుకలో గరళంగా మారుతోంది అక్కడి నీరు. కొంతకాలంగా ఫ్లోరైడ్‌ నీటితో ఆ రెండు గ్రామాల ప్రజలు సతసతమవుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. వందలమంది వివిధ రోగాలతో బాధ పడుతున్నారు. సంతకవిటి మండలం మోదుగులపేట పంచాయతీ, చినముకుందపురం గ్రామాల్లో సుమారు 300 గృహాలు ఉంటాయి. చాలా కాలంగా అక్కడి చేతిపంపుల నుంచి వచ్చే నీటిలో ఫ్లోరిన్‌ శాతం ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా నీటిలో ఫ్లోరిన్‌ 0.5 పీపీఎం (పార్ట్స్‌ పెర్‌ మిలియన్‌) ఉండాలి. కానీ 2 నుంచి 4 శాతం ఉన్నట్టు అధికారులు ఇది వరకూ ప్రాథమికంగా గుర్తించారు. దీనికి పరిష్కారంగా శుద్ధ జలాల ప్లాంట్‌ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ ఆచరణలో పెట్టలేదు. స్థానికులు ఎన్నో విన్నపాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడంలేదు.

- ఈ గ్రామాల్లో చిన్న వయసు నుంచే రుగ్మతల బారినపడుతున్నారు. ముఖ్యంగా దంత సంబంధిత ఫ్లోరోసిస్‌తో ఎక్కువ మంది బాధపడుతున్నారు. గతంలో కేవలం విటమిన్‌ మాత్రలు ఇచ్చి వైద్య ఆరోగ్యశాఖ చేతులు దులుపుకుంది. అటు గ్రామీణ రక్షిత నీటి విభాగం సైతం పెద్దగా స్పందించడం లేదు. సమగ్ర నీటి పథకం నుంచి కుళాయిల ద్వారా నీరు అందిస్తున్నా లీకులతో ఈ నీరు కూడా కాలుష్యమవుతోంది.

యువకుల్లోనూ అధికం..

ఎక్కువ మంది యువకులు కూడా రోగాల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు గ్రామాల్లో వందలాది మంది బాధితులున్నారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ కానీ.. అనుబంధ శాఖలు కానీ గణాంకాలు బయటపెట్టడం లేదు. నరాల బలహీనత, కీళ్లు వంగిపోవడం, వంకర్లు తిరగడం, దంతాలు రంగు మారడం, కీళ్ల నొప్పులు అధికంగా ఉండడం, కండరాల క్షీణత, కిడ్నీ సంబంధిత వ్యాధులతోనూ ప్రజలు బాధపడుతున్నారు. ప్రధానంగా నడుము వంగిపోవడం, కాళ్లు వంకర్లు తిరిగిపోవడం ఎక్కవగా కనిపిస్తోంది. కేవలం ఫ్లోరైడ్‌ నీటిని తాగడం వల్లే ఈ రుగ్మతులు వస్తున్నాయని గుర్తించినా అధికారులు ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం ఈ రెండు గ్రామాల గురించి పట్టించుకునేవారు లేకపోయారు. సమగ్ర నీటి పథకానికి సంబంధించిన పైపులైన్లు బాగుచేయాలని, రక్షిత నీటి పథకానికి సంబంధించి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేయాలని కోరినా ఫలితం లేకపోయింది. రోగాలతో సతమతమవుతున్న వీరు అతి కష్టమ్మీద వైద్యసేవలు పొందుతున్నారు. 20 లీటర్ల క్యాన్‌ నీటిని రూ.20 లెక్కన కొనుగోలు చేస్తున్నారు.

భయపడాల్సిన అవసరం లేదు

ఆ రెండు గ్రామాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ అధికంగా ఉంది కానీ ఆ ప్రభావంతోనే ఎక్కువగా ఇబ్బందులు ఉండవు. నోటి పళ్లు రంగుమారొచ్చు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. గ్రామాన్ని సందర్శించి ప్రజలకు అవసరమైన వైద్యం అందించేలా చర్యలు చేపడతాం. సీజనల్‌ వారీగా శిబిరాలు నిర్వహిస్తున్నాం. విటమిన్‌ మాత్రలను కూడా అందించాం.

ప్రశాంత్‌, వైద్యాధికారి, పీహెచ్‌సీ, మండాకురిటి

నిత్యం భయమే..

మా గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎవరు ఏ రోగం బారిన పడతారో తెలియదు. ముఖ్యంగా దంతాల రంగు మారుతున్నాయి. కాళ్లు వంకర్లు తిరుగుతున్నాయి. విపరీతంగా కాళ్లు పీకుతుంటాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రులను ఎక్కువగా ఆశ్రయిస్తుంటాం. నేను సుమారు 12 ఏళ్ల నుంచి కాళ్ల వంకర్లతో బాధ పడుతున్నాను. ప్రభుత్వ వైద్యులు ఒక్కరోజు కూడా మా గ్రామాన్ని సందర్శించడం చూడలేదు. ఫ్లోరైడ్‌ సమస్యపై పలుమార్లు ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులకు వివరించాం. అయినా చర్యలు తీసుకోలేదు.

మజ్జి రాములు, గ్రామస్థుడు, మోదుగులపేట

ఆర్వో ప్లాంట్లు ఎక్కడ?

మా గ్రామంలో ఫ్లోరైడ్‌ సమస్య ఉంది. బోరు పంపుల వల్లేనని ప్రైవేటు వైద్యులు గతంలో నిర్ధారించారు. నేను ఆరేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాను. కాళ్లు వాపులతో పూర్తిగా నడవలేని పరిస్థితి. మందులు వాడినా నయం కావడం లేదు. మా గ్రామంలో ఆర్వో ప్లాంట్‌లు ఏర్పాటుచేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఉన్న చేతిపంపుల నుంచి ఫ్లోరైడ్‌ నీరు వస్తోంది.

జడ్డు వెంకన్న, గ్రామస్థుడు, చినముకుందపురం

Updated Date - Mar 19 , 2025 | 11:50 PM