Strict action for misbehavior అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:55 PM
Strict action for misbehavior బాలికల పట్ల ఎవరైనా అసభ్యకరంగా, అనుచితంగా ప్రవర్తిస్తే, వెంటనే తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని... అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా న్యాయాధికారి బి.సాయికల్యాణ చక్రవర్తి అన్నారు.

అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు
పోక్సో చట్టం గురించి తెలుసుకోవాలి
జిల్లా న్యాయాధికారి సాయికల్యాణ చక్రవర్తి
విజయనగరం క్రైం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): బాలికల పట్ల ఎవరైనా అసభ్యకరంగా, అనుచితంగా ప్రవర్తిస్తే, వెంటనే తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని... అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా న్యాయాధికారి బి.సాయికల్యాణ చక్రవర్తి అన్నారు. విజయనగరంలోని ఏపీ మోడల్ స్కూల్ (పూల్‌బాగ్)లో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన న్యాయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2012లో వచ్చిన పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ చట్టంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఈ చట్టం కింద కేసు నమోదైతే తీర్పులు కూడా వెనువెంటనే వస్తాయని, సంబంధిత వ్యక్తులకు శిక్షలు పడుతున్నాయని చెప్పారు. బాలబాలికలకు న్యాయ వ్యవస్థ ఎప్పుడు అండగా ఉంటుందని, ఏ సమయంలోనైనా ఫిర్యాదు చేయవచ్చునని బాలల హక్కులు కాపాడటానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముందుంటుందన్నారు. 18 ఏళ్ల లోపు బాలబాలికలు చదువుపైనే దృష్టి పెట్టాలని, బాల్య దశ నుంచే రాజ్యాంగం, చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవంతో మెలగాలని... నైతిక విలువులు నేర్చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌సీ, ఎస్‌టీ కోర్టు న్యాయాధికారి అప్పలస్వామి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్‌కుమార్, ఎంఈఓ సత్యవతి, ప్రిన్సిపాల్ డాక్టరు ఫర్వీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.