Share News

Freehold tension ఫ్రీహోల్డ్‌ గుబులు

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:52 PM

Freehold tension వైసీపీ హయాంలో జరిగిన భూ అవకతవకలపై ప్రభుత్వానికి స్పష్టత రావడంతో చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. అవినీతిపై రెవెన్యూ ఉన్నతాధికారులు నివేదిక తయారుచేశారు. రెండు రోజుల కిందటే సీఎం చంద్రబాబుకు అందజేశారు.

Freehold tension ఫ్రీహోల్డ్‌ గుబులు

ఫ్రీహోల్డ్‌ గుబులు

ప్రభుత్వానికి అందిన భూ అక్రమాల నివేదిక

కొందరు అధికారులూ భాగస్వామ్యం

వైసీపీ హయాంలో జిల్లాలో ఫ్రీహోల్డ్‌లోకి 5,618 ఎకరాలు

వాటిలో అనేక చోట్ల అక్రమాలు

ఇప్పుడు ఆ నేతల్లో టెన్షన్‌

వైసీపీ హయాంలో జరిగిన భూ అవకతవకలపై ప్రభుత్వానికి స్పష్టత రావడంతో చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. అవినీతిపై రెవెన్యూ ఉన్నతాధికారులు నివేదిక తయారుచేశారు. రెండు రోజుల కిందటే సీఎం చంద్రబాబుకు అందజేశారు. దీంతో భూ అక్రమాలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఫ్రీహోల్డ్‌ భూముల వ్యవహారం వెలుగుచూసింది. ఫ్రీహోల్డ్‌ చేసిన తీరుపైనా.. వెంటవెంటనే రిజిస్ట్రేషన్లు జరిగిన ప్రక్రియపైనా అనేక అనుమానాలు ఉన్నాయి. నివేదిక వెళ్లడంతో అప్పట్లో ఈ భూ వ్యవహారాల్లో పాత్రదారులుగా ఉన్న నేతలు, అధికారులు టెన్షన్‌ పడుతున్నారు.

విజయనగరం, మార్చి31(ఆంధ్రజ్యోతి):

వైసీపీ హయాంలో ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ భూముల విషయంలో ఒక జీవో జారీచేసింది. ఆ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాల భూమిని ఫ్రీహోల్డ్‌ చేశారు. అందులో 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా నిషేధిత జాబితా నుంచి బయటకు తీశారు. ఆపై 55 వేల ఎకరాలకు రిజిస్ర్టేషన్లు జరిపారు. వీటిలో 8483 ఎకరాల విషయంలో అక్రమాలు జరిగినట్టు అధికారులు తేల్చారు. భూ అక్రమాలను సీరియస్‌గా తీసుకున్న కూటమి ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్లను నిలిపివేసింది. క్రయ విక్రయాలను నిషేధించింది. రెండుసార్లు విచారణ గడువు పరిమితిని కూడా పెంచింది. ఎట్టకేలకు దీనిపై స్పష్టత రావడంతో చర్యలకు దిగనుంది. ముందుగా భూ వ్యవహారంలో సూత్రదారులుగా ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు అందనున్నాయి. బాధ్యులైన అధికారులపైనా శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించ నుంది. జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు అధికారులకు నోటీసులిచ్చింది.

జిల్లాలో వైసీపీ ప్రభుత్వం 7,490.62 ఎకరాలపై నిషేధం తొలగించింది. ఆ తర్వాత వెంటవెంటనే 179.41 ఎకరాలను విక్రయిస్తూ రిజిస్ర్టేషన్లు జరిగాయి. దీంతో అనేక రకాలుగా అనుమానాలు వచ్చాయి. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహసీల్దార్లకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే అధికారులు కేవలం పాత్రదారులు కాగా సూత్రదారులంతా అప్పటి వైసీపీ నేతలే. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని భూదందాకు తెరలేపారన్న విమర్శలున్నాయి.

ఈ మండలాల్లో అధికం..

జిల్లాలో కొన్ని మండలాల్లోనే అత్యధికంగా ఫ్రీహోల్డ్‌ భూముల్లో తక్కువ వ్యవధిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. భోగాపురంలో 19.6 ఎకరాలు, డెంకాడలో 5.1 ఎకరాలు, విజయనగరం 11.56 ఎకరాలు, గంట్యాడ 1.25, రామభద్రపురం 33.88 ఎకరాలు, దత్తిరాజేరు 36 సెంట్లు, గజపతినగరం 6.11 ఎకరాలు, మెరకముడిదాంలో ఎకరాతో పాటు వేపాడ మండలం కొండగంగుబూడి గ్రామానికి చెందిన 100.55 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయి. పెద్ద ఎత్తున అసైన్డ్‌ భూముల రిజిస్ర్టేషన్లు జరిగినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో ఫ్రీహోల్డ్‌లోకి వచ్చిన భూములు, రిజిస్ర్టేషన్లపై లోతుగా దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు విచారణ పూర్తికాగా అప్పటి నేతల్లో టెన్షన్‌ మొదలైంది.

=======

Updated Date - Mar 31 , 2025 | 11:52 PM