షోకాజ్ నోటీసులు జారీ చేయండి
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:44 AM
పట్టణ పరిధిలోని కుమ్మరివీధి, వంతరాం రోడ్డులో గల సచివాలయాలను మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

బొబ్బిలి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలోని కుమ్మరివీధి, వంతరాం రోడ్డులో గల సచివాలయాలను మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సిబ్బంది పనితీరు సక్రమంగా లేనట్టు ఆమె గుర్తించారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకే సచివాలయాలకు హాజరు కావాలని ఆదేశించినప్పటి కీ సిబ్బంది బేఖాతరు చేశారు. వార్డులో మంచి నీటి సరఫరా జరిగిన సమయంలో పర్యవేక్షించాలని ఆదేశించినా ఎవరూ పట్టించుకోలేదు. నెలాఖరులోగా ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో ఆస్తి పన్ను, కుళాయి పన్నులు వసూళ్ల లక్ష్యాలను నెరవేర్చడంలో సిబ్బంది పూర్తిగా విఫలం కావడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులలో నిర్లక్ష్యం వహించి తగిన సేవలందించడంతో అలక్ష్యం ప్రదర్శించిన ఉద్యోగు లందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు.