growth center: రూ.2 కోట్లే ఇచ్చారు
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:13 AM
growth center: బొబ్బిలిలోని ఏపీ ఐఐసీ గ్రోత్‌సెంటర్‌లో మౌలిక వసతుల కల్పన కోసం ఎట్టకేలకు రూ.2కోట్లు మంజూరయ్యాయి.

- గ్రోత్ సెంటర్‌లో మౌలిక వసతుల కోసం కేటాయింపు
- ఈ నిధులు ఏ మూలకు సరిపడతాయని పెదవి విరుపు
- ధ్వంసమైన రహదారులు
- పన్ను సక్రమంగా చెల్లించని పరిశ్రమలు
బొబ్బిలి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలిలోని ఏపీ ఐఐసీ గ్రోత్‌సెంటర్‌లో మౌలిక వసతుల కల్పన కోసం ఎట్టకేలకు రూ.2కోట్లు మంజూరయ్యాయి. అధికారులు రూ.5 కోట్లుకు పైగా నిధుల కోసం ప్రతిపాదనలు పంపితే రూ.2కోట్లు మాత్రమే మంజూరు చేయడంపై పరిశ్రమల నిర్వాహకులు, ట్రాన్స్‌పోర్టు వాహనదారులు పెదవి విరుస్తున్నారు. ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఐఐసీ పరిపాలనా కార్యాలయంతో పాటు గ్రోత్‌సెంటర్‌లోని రోడ్లన్నీ పూర్తిగా ఛిద్రమయ్యాయి. దీంతో భారీ బరువులతో రాకపోకలు సాగించే వాహనాలు రహదారులపై కూరుకుపోతున్నాయి. రోడ్లఅభివృద్ధితో పాటు ఇతర పనుల కోసం రూ.5 కోట్లకు పైగా నిధులు కావాలని అధికారులు గత మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపించారు. అయితే, రూపాయి కూడా మంజూరు కాలేదు. ఇప్పుడు రూ.రెండు కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులతో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమేనా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోపక్క వేగావతి నది నుంచి నీటిని పరిశ్రమలకు సరఫరా చేసే వ్యవస్థకు సంబంధించి ఎటువంటి పారదర్శకతను పాటించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పరిశ్రమల నిర్వాహకులు కూడా ఆస్తిపన్నును సక్రమంగా చెల్లించడం లేదు.
కానరాని ప్రగతి
బొబ్బిలి ప్రాంతానికి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటర్ పారిశ్రామిక మణిహారం అవుతుందని అందరూ భావించారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా గ్రోత్‌సెంటర్‌లో ప్రగతి కానరావడం లేదు. బొబ్బిలి పూర్తి మెట్ట ప్రాంతం. వర్షాలు కురిస్తేనే పంటలు పండుతాయి. లేదంటే కరువు కోరలు చాస్తుంది. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం గ్రోత్‌సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం అడిగిందే తడవుగా ఏకంగా 1,140 ఎకరాల భూములను రైతులు కారుచౌకగా కట్టబెట్టారు. బొబ్బిలి పట్టణానికి ఆనుకొని ఉన్న మెట్టవలస, గున్నతోటవలస, గొర్లెసీతారాంపురం, నారాయణప్పవలస, కాశిందొరవలస, ఎం.బూర్జివలస, పనుకువలస గ్రామాలకు చెందిన రైతుల నుంచి సేకరించిన భూముల్లో గ్రోత్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటీ రాలేదు. ఫెర్రోఎల్లాయిస్, హెరిటేజ్ వంటి నాలుగైదు పరిశ్రమలు తప్పితే మిగిలిన యూనిట్లు ఏవీ రాలేదు. 150 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో బీకే స్టీల్స్, మోయర్స్ వంటి భారీ పరిశ్రమలు వస్తాయని చాలా ఏళ్లు ఎంతో ఆశగా ఎదురు చూశారు. రకరకాల సాంకేతిక కారణాలతో ఆ రెండూ పూర్తిగా రాలేదు. సర్వీసు యూనిట్లు వంటివి, చిన్నపాటి పరిశ్రమలు తప్ప పెద్దగా ఉపాధిని కల్పించే పరిశ్రమలు ఏవీ రాలేదు. బాగా నడిచిన కొన్ని ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు బ్యాంకు రుణాలు, ఇతరత్రా మేనేజ్‌మెంట్ సమస్యల కారణంగా మూతపడ్డాయి.
ధ్వంసమైన రోడ్లు
కొట్టక్కిలో ఎంఎస్‌ఎంఈ పార్కు..
నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం కొట్టక్కిలో ఈ పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఏపీఐఐసీకి 187 ఎకరాల భూములు ఉన్నాయి. తొలుత తెర్లాం మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములను అధికారులు పరిశీలించారు.
మాకు ప్రయోజనం లేదు
గ్రోత్‌సెంటర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. ఈ విషయమై అనేక దపాలు ప్రభుత్వ పెద్దలకు అనేక వేదికలపై మొరపెట్టుకున్నాం. స్థానికులకు ఉపాధి కల్పించకుండా బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి మనుషులను తీసుకొచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. అధికారులు మాకు న్యాయం చేయాలి.
-పువ్వల మాధవరావు, సర్పంచ్, మెట్టవలస
రూ.2 కోట్లతో పనులు చేస్తాం
గ్రోత్‌సెంటర్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.2కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులు ఎంతవరకు సరిపడితే అంతవరకు పనులు చేస్తాం. గ్రోత్‌సెంటర్‌లోని సుమారు 150 అసెస్‌మెంట్ల నుంచి రూ.కోటి ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. పరిశ్రమల నిర్వాహకులు సక్రమంగా చెల్లించడం లేదు. ఇంతవరకు రూ.20 లక్షలు మాత్రమే వసూలైంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో స్థలాల సేకరణ జరుగుతోంది. బొబ్బిలికి సంబంధించి కొట్టక్కిలో 187 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాం. కొత్తపరిశ్రమల ఏర్పాటుకు చాలా మంది సంప్రదింపులు జరుపుతున్నారు.
-మురళీమోహన్ డీజెడ్‌ఎం, ఏపీఐఐసీ
గాడిలో పెడతాం
గ్రోత్ సెంటర్‌లో పరిశ్రమలు పెడితే ఏవేవో సమస్యలు వస్తాయని కొంతమంది రియల్టర్లు కుట్రపూరితంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. వారి స్వార్థం కోసం ఈ తరహా ప్రచారానికి పూనుకుంటున్నారు. దీనిని తిప్పి కొడతాం. గ్రోత్‌సెంటర్‌ను ప్రక్షాళన చేస్తాం. భారీ పరిశ్రమలు త్వరలో రానున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగులు దీనిపై ఆశాజనకంగా ఉన్నారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా భరోసా ఇచ్చారు. గ్రోత్ సెంటర్‌ను పూర్తిస్ధాయిలో గాడిలో పెడతామని మంత్రి చెప్పారు.
-బేబీనాయన, ఎమ్మెల్యే, బొబ్బిలి