Share News

Land issues: హెల్డోవర్‌ సమస్య పరిష్కారమయ్యేనా?

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:17 AM

Land issues: జిల్లాలోని ఐదు మండలాల్లో హెల్డోవర్‌ భూములు ఉన్నాయి. 479.23 ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారుల గణంకాలను బట్టి తెలుస్తుంది.

Land issues: హెల్డోవర్‌ సమస్య పరిష్కారమయ్యేనా?
లక్కవరపుకోట మండలం దాసుల్లుపాలెం లో ఉన్న హెల్డోవర్‌ భూములు

- భూ యాజమాన్య హక్కులకు నోచుకోని రైతులు

- జిల్లాలో 479 ఎకరాలు గుర్తింపు

- గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం

- శాసన సభలో ప్రస్తావించిన ఎమ్మెల్యే లలితకుమారి

- ప్రభుత్వంపైనే ఆశలు

  • గతంలో ఎన్నడూ లేని విధంగా భూ సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారానికి గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నాం. అయినా ఇంకా కొలిక్కిరావడం లేదు. రెవెన్యూ వ్యవస్థ ఇప్పటికీ కంట్రోల్‌లోకి రాలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని రకాల భూ సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపాలో నెలరోజుల్లోగా అద్యయనం చేసి యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేయండి.

- రెండు రోజుల కిందట జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు

  • శృంగవరపుకోట నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో హెల్డోవర్‌ అని నమోదు చేశారు. దీంతో ఈ భూములపై రైతులకు యాజమాన్య హక్కు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట ఫలాన్ని మాత్రమే పొందగలుగుతున్నారు. సాగులో ఉన్న ఈ భూములకు హక్కులు కల్పించండి.

ఇటీవల జరిగిన శాసన సభ సమావేశాల్లో ప్రస్తావించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి


27kota2.gif

  • ఈ రైతు పేరు శీరంశెట్టి రాము. లక్కవరపుకోట మండలం దాసుల్లుపాలెం గ్రామం. రెండు తరాల నుంచి సాగు చేస్తున్న 30 సెంట్ల భూమికి యాజమాన్య హక్కు కల్పించకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. గత కొన్నేళ్లుగా యాజమాన్య హక్కు కోసం రెవెన్యూ అధికారులతో పాటు గ్రామానికొచ్చిన ప్రతి అధికారి వద్ద ప్రస్తావిస్తున్నాడు. అయినా ఫలితం శూన్యం. ఈ గ్రామంలో దాదాపు 50 మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరందరికీ యాజమాన్య హక్కులు కల్పిస్తామని గత వైసీపీ ప్రభుత్వం నమ్మబలికింది. ఎన్నికల వరకు చుట్టూ తిప్పించుకున్న వైసీపీ నేతలు చివరకు మొండి చేయి చూపారు. దీంతో సమస్య మొదటికి వచ్చింది. భూ సమస్యల పరిష్కారానికి ప్రస్తుత ప్రభుత్వం చొరవ చూపుతుండడంతో హెల్డోవర్‌ భూములకు న్యాయం జరుగుతుందన్న ఆశ రైతుల్లో కనిపిస్తుంది.


శృంగవరపుకోట, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఐదు మండలాల్లో హెల్డోవర్‌ భూములు ఉన్నాయి. 479.23 ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారుల గణంకాలను బట్టి తెలుస్తుంది. శృంగవరపుకోట మండలం కొత్తకోట గ్రామంలో 35 ఎకరాలు, గజపతినగరం మండలం పురిటిపెంటలో 268.16, గుర్ల మండలం నాగళ్లవలసలో 140.30, లక్కవరపుకోట మండలం దాసుల్లుపాలెంలో 31.10, కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామంలో 4.67 ఎకరాల హెల్డోవర్‌ భూములను రైతులు సాగు చేస్తున్నారు. ఈ రైతుల ఎవరికీ భూ యాజమాన్య హక్కులు లేవు. పంట పండించుకోవడం తప్ప రికార్డుల్లో ఎక్కడ వీరి పేర్లు లేవు. తరతరాల నుంచి సాగు చేస్తున్నప్పటికీ కుటుంబంలోని ఎవరి పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. స్వాతంత్య్రం తరువాత జరిగిన భూ సర్వే సమయంలో ఈ గ్రామాలకు చెందిన రెవెన్యూ రికార్డుల్లో అనుభవదారు పేరు వద్ద హెల్డోవర్‌ అని రాసి ఉంది. అప్పట్లో వివరాలను సక్రమంగా చెప్పని భూముల వద్ద డాట్‌లు (చుక్కలు), ఇంటులు వంటి వాటిని పెట్టారు. రాష్ట్రంలో పలు జిల్లాలో చుక్కల భూముల సమస్యలు ఉన్నాయి. ఈ విధంగానే జిల్లాలో హెల్డోవర్‌ అని రాశారు. ఇవి ప్రభుత్వానికి చెందినవి కావని, జిరాయితీ భూములని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ, సాగు చేస్తున్న రైతులకు మాత్రం భూ యాజమాన్య హక్కులను కల్పించలేకపోతున్నారు. 20 ఏళ్లు దాటిన అసైన్డ్‌, చుక్కల భూములకు గత వైసీపీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. దీంతో హెల్డోవర్‌ భూములను సాగు చేస్తున్న రైతులు అప్పటి ప్రజా ప్రతినిధుల దృష్టిలో ఈ సమస్యను పెట్టారు. పరిష్కారం చూపుతామని రైతులకు ఆశ చూపారు. చివరకు పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు. శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని మూడు గ్రామాలకు చెందిన రైతులు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతుండడాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టారు. అలాగే, ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టారు. సమస్య పరిష్కారానికి కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గత డిసెంబరులో భూపరిపాలన శాఖకు లేఖ రాశారు. గ్రామాల వారిగా ఉన్న భూముల వివరాలను పొందుపరిచారు. ప్రభుత్వం కూడా భూ సమస్యల పరిష్కారానికి చొరవచూపుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రధానంగా భూ సమస్యలపై ఎక్కువగా ప్రస్తావించారు. దీంతో హెల్డోవర్‌ భూములకు పరిష్కారం దొరుకుతుందని రైతులు నమ్మకంగా ఉన్నారు. భూ యాజమాన్య హక్కుల కోసం ఎదురు చూస్తున్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:17 AM