Drinking Water! తాగునీటి కోసం అల్లాడుతున్నారు!
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:29 PM
Struggling for Drinking Water! సీతంపేట ఐటీడీఏ పరిధిలోని లాడ గిరి శిఖర గ్రామస్థులు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు. వేసవి ఎండలు ముదరడంతో బిందెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు.

రక్షిత నీటి పథకం, బోరు ఏర్పాటు చేసి రెండేళ్లు
విదుత్ కనెక్షన్ ఇవ్వని అధికారులు
గిరిజనులకు తప్పని తిప్పలు
సీతంపేట రూరల్, మార్చి 30(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలోని లాడ గిరి శిఖర గ్రామస్థులు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు. వేసవి ఎండలు ముదరడంతో బిందెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఆ గ్రామం ఉన్నా.. తాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లాడ గ్రామంలో మినీ రక్షిత నీటి పథకంతో పాటు బోరును కూడా ఏర్పాటు చేశారు. అయితే నేటికి సుమారు రెండేళ్లు గడుస్తున్నా.. ఇంతవరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో దాని నుంచి నీరు రావడం లేదు. రక్షిత నీటి పథకం ట్యాంకు దిష్టిబొమ్మలా మారింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏటా వేసవిలో గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ గ్రామంలో ఉన్న పది గిరిజన కుటుంబాలు చందాలు వేసుకుని కొండ దిగువ ప్రాంతంలో నిల్వ ఉండే నీటిని పైప్‌లైన్ ద్వారా గ్రామం వరకు తీసుకొచ్చి దాహార్తిని తీర్చుకుంటున్నారు. అయితే ప్రస్తుత ఎండల నేపథ్యంలో ఆ ఊటనీరు కూడా అడుగంటింది. దీంతో గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఏటా వేసవిలో గ్రామస్థులు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. మినీ రక్షిత నీటి పథకం వినియోగంలోకి తీసుకురావాలని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని లాడ గ్రామస్థులు శంకర్రావు, సుధాకర్, బిడ్డిక అబ్బాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మినీ రక్షిత నీటి పథకాన్ని వినియో గంలోకి తేవాలని వారు కోరుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సత్యంను వివరణ కోరగా.. ‘లాడ గ్రామంలో మినీ రక్షిత నీటి పథకాన్ని పరిశీలిస్తాం. సమస్య ఏమిటో గుర్తిస్తాం. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.’ అని తెలిపారు.