Share News

ఆ రోడ్డు.. అలా వదిలేశారు!

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:39 AM

ఆ రోడ్డు విస్తరణకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. ఆవెంటనే ప్రభుత్వం మారిపోయింది.

ఆ రోడ్డు.. అలా వదిలేశారు!

ఆ రోడ్డు విస్తరణకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. ఆవెంటనే ప్రభుత్వం మారిపోయింది. టీడీపీకి పేరొస్తుందని వైసీపీ రెండేళ్ల వరకు దాని గురించే పట్టించుకోలేదు. 2021 అక్టోబరులో రోడ్డు పనులు చేపట్టారు. తమ హయాంలో పూర్తిచేస్తామని ఆర్భాటాలు పోయారు. అయితే కాంట్రాక్టర్‌ రోడ్డు పనులు సగమే పూర్తిచేశారు. మిగతా సగం రోడ్డు తవ్వేసి అలా వదిలేశారు. దీంతో ఆరోడ్డంతా గుంతలమయమై పోయింది. దీంతో 32 గ్రామపంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మార్కింగ్‌ ఇచ్చి ఇళ్ల యజమానుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వమైనా ఈ రోడ్డును పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
శృంగవరపుకోట, మార్చి 21(ఆంధ్రజ్యోతి)
సోంపురం-అనందపురం రోడ్డు దాదాపు 16 కిలోమీటర్లు ఉంది. దీని విస్తరణకు రూ.39 కోట్లు అంచనా వ్యయంతో 2021 అక్టోబరు 20న గత వైసీపీ ప్రభుత్వం పను లు చేపట్టింది. వెడల్పు చేసేందుకు రోడ్డుకు అనుకుని ఉన్న గ్రామాల ఇళ్లకు మార్కింగ్‌ ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో ఆ ప్రకారం యజమానులు ఖాళీ చేశారు. మరికొన్ని గ్రామాల్లో అధికారులే తొలగించారు. ఇంత వరకు బాగానే ఉంది. కాంట్రాక్టరు రోడ్డు నిర్మాణం సగమే పూర్తి చేశారు. మిగతా సగం తవ్వేసి వదిలేశారు. విస్తరణలో ఎంత స్థలం పోతుందో తెలియక ప్రజలు కొత్త నిర్మాణాలను చేపట్టలేకపోతు న్నారు. దీనికితోడు రోడ్డు గుంతలమయమై పోవడంతో ఆ రోడ్డులో ప్రయాణం చేసేందు కు ప్రజలు నాలుగేళ్లుగా నరకయాతన పడు తున్నారు. వైసీపీ ప్రభుత్వం తవ్వి వదిలేసిన ఈ రోడ్డును.. ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అయినా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నా పట్టించుకోవడం లేదు.
ఈ మండలాల పరిధిలో రోడ్డు..
ఈ రోడ్డులో ఒక కిలోమీటరు లక్కవరపు కోట మండలం సోంపురం కూడలి పరిధి లోను, మరో కిలోమీటరు అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అనందపురం కూడలి పరిధిలో ఉంటుంది. మిగిలిన రోడ్డంతా వేపాడ మండల పరిధిలో ఉంటాయి. ఈ రోడ్డుకు అనుకుని సోంపురం, అరిగిపాలెం, జగ్గయ్యపేట, సీతంపేట, వల్లంపూడి, వేపాడ, భర్తవానిపాలెం, చినగుడిపాల, నీలకంఠ రాజపురం గ్రామాలు ఉన్నాయి. ఈరోడ్డుకు కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో జాకేరు, గుడివాడ, కరకవలస, చామలాపల్లి, దబ్బిరాజుపేట గ్రామాలు ఉన్నాయి. సోంపురం గ్రామాన్ని కలుపుకుని జాకేరు, కరకవలస, చామలాపల్లి, దబ్బిరాజుపేట గ్రామాల నుంచి వల్లంపూడి వరకు ఈ రోడ్డుకు అనుసంధానంగా మరో రోడ్డు కూడా ఉంది. ఈ రోడ్డు పక్కన గ్రామాలు, వీటి శివారు గ్రామాలు మారిక, వెంకయ్యపాలెం, పోతుబందిపాలెం వాసులు ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా సోంపురం-అనందపురం రోడ్డుకు రావాల్సిందే. అలాగే సీతంపేట సమీపం నుంచి ఆతవ గ్రామానికి ఉన్న రెండు కిలోమీటర్ల రోడ్డు నుంచి కూడా సోంపురం-అనందపురం రోడ్డుకే రావాలి. వేపాడ మండల కేంద్రం నుంచి వాయిల్పాడు గ్రామానికి రోడ్డు ఉంది. ఈ రోడ్డుకు అనుకుని విలుపర్తి, దుంగాడ, చామలడవి వంటి చిన్నచిన్న గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు కూడా వేపాడ మండల కేంద్రం వద్ద ఉన్న సోంపురం-అనందపురం రోడ్డు నుంచే ప్రయాణం చేయాలి. బానాది, బల్లంకి గ్రామాల నుంచి ఇదే పరిస్థితి. ఇలా మండలంలోని దాదాపు 32 పంచాయతీలకు చెందిన ప్రజలకు కీలక ఆధారం ఈ రోడ్డు. మండల వ్యవస్థ అవిర్భావం నుంచి ఈ రోడ్డు అభివృద్ధితో పాటు విస్తరణ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.
రెండేళ్ల తర్వాత పనులు..
జిల్లాలో వేపాడ మారుమూల మండలం కావడంతో ఎన్నో ఏళ్లగా ఈ రోడ్డు విస్తరణ కోసం స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ రోడ్డుకు నిధులు కేటాయించింది. రోడ్డుపనులు చేపట్టేలోపు ప్రభుత్వం మారింది. 2019లో వైసీపీ అధికారం చేపట్టింది. పనులు వెంటనే చేపడితే టీడీపీకి పేరొస్తుందని భావించి కొద్దిరోజులు ఈ రోడ్డు పనులను మూలన పెట్టింది. రెండేళ్ల తర్వాత పనులు చేపట్టినా సగంలోనే వదిలేసింది. ఆతర్వాత మొదలుపెట్టి ఎన్నో ఏళ్లుగా జరగని రోడ్డు అభివృద్ధి తాము చేపడుతున్నామని గత వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు గొప్పలు చెప్పుకున్నారు. దీంతో వేపాడ, శృంగవరపుకోట, లక్కవరపుకోట, అనకాపల్లి జిల్లా కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ప్రజల ఆనందాన్ని వైసీపీ ప్రభుత్వం అవిరి చేసింది. సీతంపేట గ్రామానికి ఇరువైపులా కిలోమీటరు పైబడి విస్తరణకు కాంట్రాక్టర్‌ రోడ్డు తవ్వేసి వదిలేశారు. రాతిపిక్కను పరిచినా వర్షాలకు లేచిపోయి రోడ్డు గుంతలుగా మారింది. దబ్బిరాజుపేట గ్రామానికి వేళ్లే లింకు రోడ్డు వద్ద, వల్లంపూడి కల్లాల వద్ద ఉన్న బస్సుషెల్డర్‌ సమీపంలో అయితే భారీ గుంతలు పడ్డాయి. బరువుతో వచ్చే వాహనాలు ఎక్కడ బోల్తాడతాయోనని డ్రైవర్లు భయపడుతున్నారు. వేపాడ-వల్లపూడి జంటగ్రామాల మధ్య కూడా ఇలాంటి గోతులే ఉన్నాయి. జగ్గయ్యపేట దాటిన తరువాత వేపాడ వేళ్లే రోడ్డులో మలుపు వద్ద గుంతలు మరింత ప్రమాదంగా మారాయి. భర్తవానిపాలెం సమీపంలోను ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రహదారి మీదుగా ప్రయాణం చేయాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.
ఫ రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామాల్లో నివాసాలను ఇంకా తొలగించాల్సి ఉంది. వేపాడ-వల్లంపూడి గ్రామాల్లో సగం తొలగించి వదిలేశారు. నివాసాల్లో రోడ్డుకు అవసరమయ్యే భాగాన్ని తొలగించేందుకు కొన్ని గ్రామాల్లో మార్కింగ్‌ కూడా ఇచ్చారు. మార్కింగ్‌ వరకు తొలగిస్తే మిగిలిన స్థలంలో కొత్త ఇళ్లు కట్టుకోవచ్చని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు విస్తరణ పనులు అపేయడంతో స్థలమెంత పోతుందో తెలియక వారంతా అయోమయంలో పడ్డారు. వారంతా ప్రస్తుత ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. అధికారం చేపట్టి 8నెలలు గడిచాయి. గిరిజన గ్రామాలకు కూడా ప్రభుత్వం రోడ్లు వేయిస్తోంది. ఈ నేపథ్యంలో సగంలో అగిపోయిన సోంపురం-అనందపురం రోడ్డును కూడా పూర్తి చేస్తారని భావిస్తున్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:39 AM