Share News

విశ్వావసు.. నవ ఉషస్సు!

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:30 PM

Vishwavasa.. A New Dawn! జిల్లాలో ఉగాది శోభ వెల్లివిరిసింది. అంతటా సందడి వాతావరణం నెలకొంది. విశ్వావసు నామ సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. తెలుగు సంవత్సరాది.. ఉగాది వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.

విశ్వావసు.. నవ ఉషస్సు!
కుటుంబంతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

వైభవంగా ఉగాది

భక్తులతో ఆలయాలు కిటకిట

వాడవాడలా పంచాంగ శ్రవణాలు

అంతటా సందడే సందడి

పార్వతీపురం/ పార్వతీపురం టౌన్‌/ పాలకొండ/ సాలూరు రూరల్‌ మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉగాది శోభ వెల్లివిరిసింది. అంతటా సందడి వాతావరణం నెలకొంది. విశ్వావసు నామ సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. తెలుగు సంవత్సరాది.. ఉగాది వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ సంవత్సరమంతా బాగా జరగాలని ఇష్ట దైవాలను వేడుకున్నారు. ఆదివారం సంప్రదాయ దుస్తులు ధరించి.. ప్రత్యేక పూజలు చేశారు. గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టారు. ఉగాది పచ్చడిని తయారుచేసి పంచిపెట్టారు. ప్రముఖ దేవాలయాలకు క్యూ కట్టారు. వేద పండితులతో వారి పేరుకు తగ్గట్లు ఆదాయ, వ్యయాలు, రాజపూజ్యం, అవమానాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనేకచోట్ల పురోహితులు పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని, ప్రకృతి కరుణించాలని రైతులు కోరుతూ ఏరువాక పనులు ప్రారంభించారు. మరికొందరు సెంటిమెంట్‌గా భావించి కొత్త వస్తువుల కొనుగోలుకు మొగ్గు చూపారు. బంగారం, వెండి వస్తువులు, గృహోపకరణాలు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్లన్నీ కిటకిటలాడాయి. షాపులన్నీ రద్దీగా కనిపించాయి.

ఉగాది వేడుకల్లో మంత్రి

సాలూరు పట్టణంలోని సీతారామ కల్యాణమండపంలో నియోజకవర్గ స్థాయి ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుటుంబంతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పంచాంగశ్రవణాన్ని రుత్వికుడు సతీష్‌శర్మ చదివి వినిపిం చారు. ప్రజలు సామాజిక, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. పంచాంగ శ్రవణం ద్వారా కొత్త ఏడాదిలో ఎదురయ్యే పరిణామాలను విశేష్లించుకుని భవిష్యత్‌ను ఆనందమయంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలన్నారు. అనంతరం మంత్రి దంపతులను అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌, సాలూరు పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశు, ఏఎంసీ చైర్మన్‌ ముఖీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకేంద్రంలో..

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పార్వతీపురం లయన్స్‌ కల్యాణ మండపంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ సంప్రదాయ వస్త్రధారణలో కుటుంబ సభ్యులతో హాజరై వేడుకలను ప్రారంభించారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఆ తర్వాత వేమకోటి నరహరిశాస్ర్తి పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది, విశ్వావసు నామ సంవత్సరం విశేషాలను తెలియజేశారు. మైలారపు సూర్యవెంకట రమణ వేద వచనం చేశారు. కవి సమ్మేళనం నిర్వహించారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న 29 మందికి పురస్కారాలు అందించారు. పలువురు ఆలయ పురోహితులు, కవులను సత్కరించారు. అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డి , జేసీ శోభిక, ఏఎస్పీ అంకిత సురానా, డీఆర్వో కె.హేమలత, డిప్యూటీ కలెక్టర్‌ పి.ధర్మచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- జిల్లాకేంద్ర వాసులు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఉగాదిని జరుపుకున్నారు. పలు ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పట్టణ ప్రధాన రహ దారిలోని వినాయక, పార్వతీదేవి, దుర్గాదేవి, కన్యాకాపరమేశ్వరీ ఆలయాల్లో అభిషే కాలు చేశారు. ప్రధాన రహదారిలో సంపత్‌ వినాయక ఆలయం వద్ద భక్తులు బారులుదీరారు.

- పాలకొండ పట్టణంలో ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఉగాదిని జరుపుకున్నారు. మరోవైపు కోటదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. గాయత్రీదేవి, ఉమారామలింగేశ్వరాలయం, వెంకటేశ్వరస్వామి, షిర్డీసాయి తదితర ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు.

- శంబర పోలమాంబ, తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు.

Updated Date - Mar 30 , 2025 | 11:30 PM