Share News

అడిగినంత ఇవ్వాల్సిందే!

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:40 AM

గజపతినగరం మండలానికి చెందిన ఓ బాలుడి పైనుంచి నాటు బండి వెళ్లిపోవడంతో తీవ్ర గాయాల య్యాయి. ఆ బాలుడిని అత్యవసర చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.

అడిగినంత ఇవ్వాల్సిందే!

-గజపతినగరం మండలానికి చెందిన ఓ బాలుడి పైనుంచి నాటు బండి వెళ్లిపోవడంతో తీవ్ర గాయాల య్యాయి. ఆ బాలుడిని అత్యవసర చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించాక కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని, ఇందుకోసం వెంటిలేటర్‌తో కూడిన లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌ ఉండాలని వైద్యులు సూచించారు. నగరంలోని ఓ ప్రైవేట్‌ అంబులెన్స్‌తో మాట్లాడితే మొదట రూ.20 వేలు అడిగారు. అంతచెల్లించలేమని రూ.12 వేలు ఇవ్వగలమని తల్లిదండ్రులు ప్రాధేయపడటంతో రూ.13వేలకు ఒప్పుకున్నారు.

-విజయనగరంలోని కస్పా హైస్కూల్‌ ప్రాంతానికి చెందిన రమేష్‌ కొద్దిరోజుల కిందట కుటుంబ కలహాలకు విసిగి పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు రమేష్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఖర్చు భరించలేక ప్రభుత్వ సర్పజన ఆసుపత్రికి తీసుకువెళ్లాలను కున్నారు. వెంటిలేటర్‌ ఉన్న అంబులెన్స్‌లో తరలించటానికి కిలోమీటరు రూ.5,500 వసూలు చేశారు. అత్యవసరం కావడంతో అడిగినంత ఇచ్చి రోగిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
విజయనగరం, మార్చి 21(ఆంధ్రజ్యోతి)
విజయనగరంలో అంబులెన్స్‌ల దందా ఎక్కువైంది. కొవిడ్‌ సమయంలో కొన్నిరోజులు కట్టడి జరిగింది. ఇప్పుడు వ్యవహారం మొదటికి వచ్చింది. ఆస్పత్రుల మార్చురీలు, వార్డుల వద్దే అంబులెన్స్‌ నిర్వాహకులు కాచుకొని కూర్చుంటున్నారు. వారంతా ఒక్కటైపోయి రోగుల బంధువుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారు. అత్యవసరం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే రోగుల కుటుంబీకులు వారు అడిగినంత ఇచ్చేస్తున్నారు. ఎవరైనా చనిపోయినట్లు తెలిస్తే అందరూ అక్కడ వాలిపోతున్నారు. వారికి ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న స్వీపర్లు, సిబ్బంది సహకారం అందిస్తున్నారు. విజయనగరంలోని ప్రధాన ఆస్పత్రుల వద్ద పదుల సంఖ్యలో ప్రైవేటు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. డ్రైవర్లు వరుస క్రమంలో వెళతారు. అంటే ఒక వాహనం కిరాయికి వెళ్లిన తరువాతే మరో వాహనం తీస్తారు. ఆ సమయంలో ముందున్న డ్రైవర్‌ ఎంత వసూలు చేసుకున్నా.. వెనుక ఉన్న డ్రైవర్‌ తగ్గిస్తామని చెప్పడు. అడిగినంత ఇవ్వాల్సిందే.
రిఫర్‌ చేస్తే కాసులే..
సాధారణంగా అత్యవసర, అనారోగ్య సమయంలో ముందుగా ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తుంటారు. పరిస్థితిని బట్టి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించాలని సూచిస్తుంటారు. కేంద్రాస్పత్రిలో పరిస్థితి విషమిస్తే విశాఖలోని కేజీహెచ్‌తో పాటు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించాలని రిఫర్‌ చేస్తారు. రోగుల అవసరాలను అదనుగా చేసుకుంటున్న అంబులెన్స్‌లు ఇష్టారాజ్యం గా చార్జీలు వసూలు చేస్తున్నారు. విజయనగరంలోని ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించాలంటే రూ.3 వేల నుంచి రూ.5 వేలు తీసుకుంటున్నారు. రోగి పరిస్థితి బట్టి వసూళ్లు పెరుగుతున్నాయి. ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ అవసరమైతే ఇక బాదుడే.
- జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సుమారు 30 వరకూ ఉన్నాయి. అందులో సగానికిపైగా విజయనగరంలోనే ఉన్నాయి. ఇవి పేరుకే పెద్దాస్పత్రులు. దాదాపు అత్యవసర కేసులు విశాఖకు రిఫర్‌ చేస్తుంటారు. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఘోషాస్పత్రి, మరో పది ఆస్పత్రులకు సమీపంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు ఉంటాయి. పిలుపు కోసం డ్రైవర్లు వేచిచూస్తుంటారు. విజయనగరం-విశాఖ మధ్య దూరం 50 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయినా అత్యవసర వైద్యం కోసం రోగిని అంబులెన్స్‌లో తరలించాలంటే రూ.12 వేల నుంచి రూ.15 వేలు తీసుకుంటున్నారు.
నియంత్రణ లేకపోవడం వల్లే..
ప్రభుత్వపరంగా నియంత్రణ లేకపోవడం వల్లే కొందరు అంబులెన్స్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. యాక్సిడెంట్‌, పాముకాటు, సీరియస్‌ కేసులు అయితే డబ్బులు మరింత ఎక్కువగా వసూలు చేస్తున్నారని బాధితులు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా అంబులెన్స్‌ల ఫిట్‌నెస్‌, డ్రైవర్ల లైసెన్స్‌, వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయా? అని కూడా తనిఖీలు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.. ఈ అంశంపై రవాణశాఖ ఉప కమిషనర్‌ వద్ద ప్రస్తావించగా అంబులెన్స్‌ల ధరలకు సంబంధించి తమకు ఎలాంటి మార్గదర్శకాలు లేవని చెప్పారు. వాహనం ఫిట్‌నెస్‌ తదితర అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటామన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:40 AM