Selling Gold incur Losses: పాత బంగారు నగలను అమ్మేస్తున్నారా? ఎంత నష్టపోతున్నారో తెలిస్తే..
ABN , Publish Date - Mar 23 , 2025 | 08:08 AM
బంగారం నగలు అమ్మితే నష్టాలే మిగులుతాయని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు ధరల కంటే తక్కువకే అమ్మాల్సి వస్తుందని, ఇది చివరకు నష్టాన్నే మిగులుస్తుందని అంటున్నారు. ఇదెలాగంటే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దీంతో, డబ్బు అవసరం ఉన్న వారు బంగారం అమ్మేందుకు ఇదే మంచి సమయం అని భావిస్తున్నారు. అయితే, పాత నగలను అమ్మేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అంతిమంగా బంగార నగలు అమ్మితే వినియోగదారులకు వచ్చేది నష్టమే అని అంటున్నారు. కొనుగోలు ధర కంటే రీసేల్ ధర తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
సాధారణంగా బంగారు నగలు కొనుగోలు చేసినప్పుడు పసిడి విలువతో పాటు అనేక ఇతర చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు బంగారం మార్కెట్ రేటుతో పాటు నగల తయారీ చార్జీలు, జీఎస్టీ చెల్లించాలి. ఇక బంగారు నగలను అమ్మే సమయంలో కూడా జువెలర్లు ఈ చార్జీలను మినహాయించుకుని మిగతా డబ్బును ఇస్తారు.
Also Read: భారత్‌తో పోలిస్తే దుబాయ్ బంగారం ధర ఎందుకు తక్కువంటే..
నగల తయారీ చార్జీలను జువెలర్స్ ఎవరూ తిరిగి ఇవ్వరు.15 నుంచి 20 శాతం మేర చార్జిలను మినహాయించుకుంటారు. అంటే..రూ. 1,28,000 విలువైన నగ అమ్మితే అందులో తయారీ చార్జీ కింద జువెలర్స్ సుమారు రూ.19,200 కస్టమర్లకు తిరిగి చెల్లించరు. ఇక తన లాభాలను పట్టుకునేందుకు మార్కెట్ కట్ పేరిట వాస్త ధర కంటే 4 నుంచి 5 శాతం తక్కువ మొత్తాన్ని కస్టమర్లకు చెల్లిస్తారు. దీంతో.. సుమారు రూ.6400 వరకూ కస్టమర్లు కోల్పోవాల్సి వస్తుంది. ఇక నగలపై చెల్లించే జీఎస్టీని కూడా వ్యాపారులు మినహాయించుకుంటారు. ఈ లెక్కన పాత నగలు అమ్మినప్పుడు మరో రూ.3840 నష్టపోవాల్సి వస్తుంది. స్థూలంగా చెప్పాలంటే రూ.128,000 విలువైన బంగార నగ అమ్మిన సందర్భంగా వ్యాపారులు.. తయారీ చార్జీలు, మార్కెట్ కట్, జీఎస్టీ మొత్తాలను మినహాయించుకుని కేవలం రూ98,560 మాత్రమే చెల్లిస్తారు.
Also Read: ఈ సంవత్సరం బంగారం ధర లక్ష మార్కు దాటుతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే
ఈ నష్టాలు లేకుండా ఉండాలంటే వినియోగదారులు గోల్డ్ కాయిన్స్ లేదా బార్స్‌ను కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని అమ్మినప్పుడు తయారీ చార్జీల పేరిట ఎటువంటి మినహాయింపులు ఉండని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ వ్యాపార సంస్థలు వంద శాతం మొత్తాన్ని తిరిగిస్తాయని అంటున్నారు. ఇవి వద్దనుకుంటే బంగారం ఆధారిత డిజిటల్ పెట్టుబడి సాధాలను కూడా ఎంచుకోవచ్చు.