నీటి తీరువా వసూళ్లకు ఆన్‌లైన్ గండం
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:32 AM
రెవెన్యూ వ్యవస్థలో గ్రామ స్థాయిలో వీఆర్వో, ఇతర సిబ్బంది పోటీపడి నీటి తీరువా (భూమి శిస్తు) వసూలు చేసేవారు.

భూమి శిస్తు రూ.22.13 కోట్లు
వసూలైంది కేవలం రూ.2.44 కోట్లు
కాల్వల మరమ్మతులకు కష్టకాలం
వసూళ్లకు రెవెన్యూ శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో సమస్య
(ఏలూరు– ఆంధ్రజ్యోతి)
రెవెన్యూ వ్యవస్థలో గ్రామ స్థాయిలో వీఆర్వో, ఇతర సిబ్బంది పోటీపడి నీటి తీరువా (భూమి శిస్తు) వసూలు చేసేవారు. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి వైసీపీ ప్రభుత్వం నీటి తీరువా వసూళ్లను ఆన్‌లైన్ ద్వారా వసూలు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడంతో వసూళ్లు కుంటుపడ్డాయి. రైతులు తీరిక లేకపోవడం, అడిగే వారు ఎవరుంటారరనే ధీమాతో బకాయి లు చెల్లించ లేదు. గతంలో పంట చేతికి రాగా నే రైతులంతా భూమి శిస్తు చెల్లించేవారు. ఏలూరు జిల్లాలో 1432 ఫసలీ కాలానికి రూ.22.13కోట్లు నీటి తీరువా వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం రూ. 2.44 కోట్లు వసూలైంది. కనీసం 10 శాతం కూడా వసూలు కాలేదు. నీటి తీరువా కింద చేపల చెరువుకు ఎకరాకు రూ. 500, వరి చేలకు ఎకరా రూ.200 మేర రైతులు చెల్లించేవారు. మూడేళ్ల నుంచి బకాయిలు పేరుకుపోతున్నాయి. వసూలైన మొత్తంలో 70 శాతం సాగునీటి కాల్వ మరమ్మ తులకు నీటి సంఘాల ద్వారానే చేయించేవారు. శిస్తు వసూలు కాకపోవడంతో పనులు చేపట్ట డం లేదు. ప్రస్తుతం శిస్తు చెల్లించిన, చెల్లించని వారి వివరాలు కూడా తెలియని దుస్థితి నెల కొంది. ఆన్‌లైన్ విధానం రైతుకు వెసులుబాటు అయినా చెల్లింపులు లేవు. గ్రామ సచివాలయ వ్యవస్థలో డిజిటల్ అసిస్టెంట్లే వీటి వ్యవహారా లను చూస్తున్నారు. రైతు ఆధార్ కార్డును చూపించి పొలం ఉండే ప్రాంతం నుంచి లేదా వేరే ఊళ్లో నివసించినా అక్కడ నుంచి ఆన్‌లైన్ లో శిస్తు బకాయిలు కట్టడానికి అవకాశం కల్పించినా ఆ విధంగా జరగడం లేదు.
జమాబందీ నాటికే బకాయిలన్నీ వసూలయ్యేవి..
జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షణలో ఆర్డీవోలు, తహసీల్దార్లు రైతుల నుంచి ఫసలీ కింద ఏటేటా రెవెన్యూ శిస్తు వసూళ్లను చేపట్టే వారు. దీనికి జమాబందీ ద్వారా మండల స్థాయిలో జిల్లా అధికారులు వెళ్లి ఆకస్మికంగా తనిఖీలు చేసి పుస్తకాల్లో నమోదైన దానికి ఆయా మొత్తాలు సరిగ్గా ఉన్నాయో? లేదో కూడా తనిఖీలు చేసేవారు. మూడేళ్ల నుంచి ఈ విధానానికి స్వస్తి పలికారు. ప్రభుత్వం నీటి తీరువా వసూళ్లపై రెవెన్యూ శాఖ ద్వారా చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. భూమి శిస్తు బకాయిల చెల్లింపు వ్యవహారం లో జమ అయిన మొత్తం కాల్వలు, ఇతర పనులకు నిర్వహణకు ఉపయోగించకుండా మురిగిపోతున్నాయి. దీనిపై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించాల్సి ఉంది.