భూం.. ఫట్
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:30 AM
మొగల్తూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. అక్కడ పనిచేసే అధికారులపై తరచూ వేటు పడుతోంది. తీర ప్రాంతంలో అసైన్డ్ భూములు అధికంగా ఉండడంతో అక్రమ రిజిస్ర్టేషన్‌లు జరుగుతు న్నాయి. ఒకరి భూమిని మరొకరి పేరిట రిజిస్ర్టేషన్ చేసేస్తున్నారు.

అక్రమాలకు అడ్డా.. మొగల్తూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం
నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్లు
ఎటువంటి వివాదాస్పద భూమికైనా ఇక్కడ గ్రీన్‌సిగ్నల్
నేతల అండదండలతో సీఆర్‌జడ్ భూములనూ వదల్లేదు
ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ఇక్కడకు క్యూ
ఇప్పటికి ముగ్గురు సబ్ రిజిస్ర్టార్లు సస్పెన్షన్.. అయినా మారని తీరు
నిషేధిత, ప్రభుత్వ పోరంబోకు స్థలాలకు రిజిస్ర్టేషన్లు చేసేశారని లేఖర్ల సంఘం ఆరోపణ
మూడు వేల రిజిస్ర్టేషన్లపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలని డిమాండ్
(భీమవరం–ఆంధ్రజ్యోతి):
మొగల్తూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. అక్కడ పనిచేసే అధికారులపై తరచూ వేటు పడుతోంది. తీర ప్రాంతంలో అసైన్డ్ భూములు అధికంగా ఉండడంతో అక్రమ రిజిస్ర్టేషన్‌లు జరుగుతు న్నాయి. ఒకరి భూమిని మరొకరి పేరిట రిజిస్ర్టేషన్ చేసేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ రిజిస్ర్టేషన్ జరగపోయినా సరే మొగల్తూరు వచ్చేస్తున్నారు. రిజిస్ర్టేషన్లలో ఆన్‌లైన్ విధానం అమలు ఉండడంతో అంతా ఈ కార్యాలయంపైనే ఆధారపడుతున్నారు. ఇక్కడకు వస్తే రిజిస్ర్టేషన్‌లు సులువుగా అవుతాయని అంతా భావిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇది నిజం కూడా..! ఈ అక్రమాలపై ఉన్నతాధికా రులకు ఫిర్యాదులు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే ముగ్గురు సబ్ రిజిస్ర్టార్‌లు వరుసగా సస్పెండయ్యారు. గత ప్రభు త్వంలోనే మొగల్తూరులో వందలాది రిజిస్ర్టేషన్‌లు అక్రమంగా జరిగాయి. అందుకు తగ్గట్టుగానే విచారణలో నిజమని తేలింది. సంబంధిత సబ్ రిజిస్ర్టార్‌లను సస్పెండ్ చేస్తూ వస్తున్నారు. అయినా అక్కడ అక్రమాలను అరికట్టలేకపోతున్నారు.
మూడు జిల్లాల రిజిస్ర్టేషన్లు ఇక్కడే
జూ మొగల్తూరు మండలం తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలకు అనువుగా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై పెద్దగా దృష్టి ఉండదు. దీంతో నిబంధనలు అడ్డొచ్చే రిజిస్ర్టేషన్‌లకు ఇది అడ్డాగా మారింది. వైసీపీ హయాంలో లెక్కలేనన్ని భూములను అడ్డంగా రిజిస్ర్టేషన్ చేశారు. నిషేధిత బాబితాలోని భూములను రిజిస్ర్టేషన్ చేసేశారు. మండలంలో ఈనామ్ భూములు, భూమి లేని నిరుపేదలకు ఇచ్చే స్థలాలు, పోరంబోకు, సీఆర్‌జడ్, గ్రామ కంఠంలో భూములను అక్రమంగా రిజిస్ర్టేషన్ చేసుకోవడానికి సబ్ రిజిస్ర్టార్‌లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
జూ ఇటీవల కృష్ణా జిల్లాలోని ప్రైవేటు భూములు వేరొకరి పేరుతో రిజిస్ర్టేషన్ చేశారంటూ మొగల్తూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం వద్ద అలజడి రేగింది. బాధితులు కార్యాలయం వద్ద ధర్నాలకు దిగారు. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం వద్ద నిరసనలు వ్యక్తం చేయడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైంది. రిజిస్ర్టేషన్‌లకు అవకాశం లేని భూములు మండలంలో దాదాపు ఆరు వేలు ఎకరాలు ఉంటాయి. సదరు భూములను నిబంధనలను పక్కనపెట్టి రిజిస్ర్టేషన్‌లు చేయడం పరిపాటిగా మారింది. సీఆర్‌జడ్ భూములు రిజిస్ర్టేషన్‌లు అయిపోతున్నాయి. గతంలో సబ్ రిజిస్ర్టార్ ఏకంగా 300 రిజిస్ర్టేషన్‌లను చేసేశారు. దీనిపై అధికారులు దర్యాప్తు జరిపి నిజమని తేలడంతో సస్పెండ్ చేశారు. గత ప్రభుత్వంలోనే ఇవన్నీ జరిగిగాయి. అప్పటి అధికార పార్టీ నేతల ఒత్తిడితో రిజిస్ర్టేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి కొనుగోలుదారులు ఇక్కడకే వస్తుంటారు. ఆన్‌లైన్ విధానాన్ని వినియోగించుకుంటున్నారు. గతంలో తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం అందరి దృష్టి ఉండేది. మూడేళ్లుగా ఈ కార్యాలయంలో ఎటువంటి సమస్యలు లేవు. ఇప్పుడు ఆ జాబితాలో మొగల్తూరు కార్యాలయం చేరింది. ఇప్పటి దాకా మూడు వేల రిజిస్ర్టేషన్‌లు అక్రమంగా జరిగాయని అక్కడి లేఖరులే ఆరోపణలు చేశారంటే అవినీతి భాగోతం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మొగల్తూరు వెళ్లాలంటే భయం
సబ్ రిజిస్ర్టార్‌లుగా మొగల్తూరు వెళ్లాలంటే ఇప్పుడు అంతా ఆందోళన చెందుతున్నారు. తాజాగా సస్పెండ్‌కు గురైన సబ్ రిజిస్ర్టార్ డిప్యూటేషన్‌పై ఆదాయపు పన్ను శాఖకు వెళ్లిపో యారు. కొత్తగా సబ్ రిజిస్ర్టార్‌లు ఎవరూ రావడం లేదు. సీనియర్ అసిస్టెంట్లతో కాలం వెళ్లదీస్తున్నారు. మొగల్తూరు వెళితే బలికాక తప్పదంటూ రిజిస్ర్టేషన్ శాఖలో బలమైన ముద్రపడింది. ఏదో ఒక రూపంలో అధికారులను బ్లాక్ మెయిల్ చేసి రిజిస్ర్టేషన్‌లు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. నేతల అండదండలు ఉన్నాయనే ఉద్దేశంతోనే అడ్డగోలుగా రిజిస్ర్టేషన్‌లు చేస్తున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో వరుసగా ముగ్గురు సబ్ రిజిస్ర్టార్‌లు సస్పెండ్ కావడంతో అక్కడ అవినీతి దందా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
సీబీసీఐడీతో విచారణ చేయాలి
మొగల్తూరు : మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్లపై సీబీసీఐడీతో విచారణ చేయించాలని మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధి దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు కొల్లాటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం మొగల్తూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిషేధిత భూములు, ప్రభుత్వ పోరంబోకు స్థలాలు, ప్రభుత్వ ఇంటి స్థలాలు, మార్ట్‌గేజ్‌లు సుమారు మూడు వేల వరకు అక్రమ పద్ధతిలో మొగల్తూరు కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగి ఉండవచ్చని వాటిపై సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పందించి సీబీసీఐడీతో విచారణ నిర్వహిస్తే జరిగిన అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలకు దళారీ పాత్ర పోషించిన కొంత మంది లేఖర్లపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేఖర్ల సంఘ కార్యదర్శి శీలబోయిన సత్యనారాయణ, సభ్యుడు కడలి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.