ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్ కొనసాగిస్తాం
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:14 AM
నూజివీడులో ఎంఆర్ అప్పారావు కాలేజి ఫర్ పీజీ స్టడీస్‌ను ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్‌గానే కొనసాగిస్తామని కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కె.రాంజీ అన్నారు.

కృష్ణా యూనివర్సిటీ వీసీ రాంజీ
నూజివీడు టౌన్, మార్చి 19(ఆంధ్రజ్యోతి): నూజివీడులో ఎంఆర్ అప్పారావు కాలేజి ఫర్ పీజీ స్టడీస్‌ను ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్‌గానే కొనసాగిస్తామని కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కె.రాంజీ అన్నారు. ఎంఆర్ అప్పారావు కాలేజి ఫర్ పీజీ స్టడీస్‌ను బుధవారం ఆయన సందర్శించారు. నూజివీడు పరిసర ప్రాంతాలలో విద్యా ప్రదాత, మాజీ మంత్రి, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎంఆర్ అప్పారావు హయాంలోనే సువిశాల ప్రాంగణాన్ని భవనాలతో సహా యూనివర్సిటీకి అందజేశారు. పీజీ సెంటర్‌ను స్టడీ సెంటర్‌గా మార్చి స్పెషల్ ఆఫీసర్ స్థా యి నుంచి ప్రిన్సిపాల్ స్థా యికి తగ్గించిన విషయాన్ని పలవురు వీసీ దృష్టికి తీసుకువెళ్లారు. క్యాంపస్ డాక్టర్ ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్‌గానే కొనసాగుతుందన్నారు. పీజీ సెంటర్‌లో సౌకర్యాలు, నిర్మాణం పూర్తయిన భవనాలను ఆయన పరిశీలించారు. బాలికల వసతి గృహంలోని సౌకర్యాలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. పీజీ సెంటర్ అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు రూపొందించి నివేదిక అందించాలని అధికారులను వీసీ ఆదేశించారు.
కొత్త కోర్సులు తెస్తాం
విద్యార్థుల అభీష్టం మేరకు కొత్త కోర్సులు తీసుకువస్తామని వీసీ తెలిపారు. నూజివీడు పరిసర ప్రాంతాలలో ఉద్యాన పంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, వాటికి సంబంధించిన కోర్సులు విద్యార్ధులు కోరితే తప్పనిసరిగా అందుబాటులోకి తీసుకువస్తామని వీసీ స్పష్టం చేశారు. అయితే కొత్త కోర్సులు తెస్తే కనీసం ఐదేళ్లు కొనసాగాలన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్ సేవలు అభినందనీయం
మొదటి సంవత్సరంలో రెండు నెలల ఇంటర్న్‌షిప్ ఏర్పాటుచేస్తామని వైస్ చాన్సలర్ రాంజీ తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాంలో భాగంగా గ్రామాలను దత్తత తీసుకొని, అక్కడి సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కార దిశగా చర్యలు చేపడతామన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను వీసీ అభినందించారు. కార్యక్రమంలో రెక్టర్ ఎంవీ బసవేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ జె నవీన లావణ్య, లత, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.