Share News

ఫలించిన యార్లగడ్డ కృషి

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:16 AM

కృష్ణాజిల్లా కోఆపరేటివ్‌ సెంట్రల్‌ (కేడీసీసీ) బ్యాంక్‌లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ- సీ కేటగిరీల ఉద్యోగులకు పదోన్నతుల్లో జరిగిన అన్యాయంపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ చూపించారు.

ఫలించిన యార్లగడ్డ కృషి

-కేడీసీసీ బ్యాంక్‌ ఉద్యోగుల పదోన్నతులు పునరుద్ధరణ

- గత జనవరిలో పదోన్నతుల రద్దుపై ఆందోళన చేసిన ఉద్యోగులు

- మచిలీపట్నం వెళ్లి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన గన్నవరం ఎమ్మెల్యే

- ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి

- నేడు చీఫ్‌ మేనేజర్లుగా పదోన్నతులు కల్పించిన కేడీసీసీ బ్యాంక్‌ సీఈవో

- ఎమ్మెల్యే యార్లగడ్డను కలిసి కృత జ్ఞతలు తెలిపిన కేడీసీసీ ఉద్యోగులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

కృష్ణాజిల్లా కోఆపరేటివ్‌ సెంట్రల్‌ (కేడీసీసీ) బ్యాంక్‌లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ- సీ కేటగిరీల ఉద్యోగులకు పదోన్నతుల్లో జరిగిన అన్యాయంపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ చూపించారు. వివరాల్లోకి వెళితే... చీఫ్‌ మేనేజర్లుగా పదోన్నతులు ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే వాటిని రద్దు చేయటంపై గత జనవరిలో మచిలీపట్నంలోని కేడీసీసీ బ్యాంకు ఎదుట పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. బలహీన వర్గాలు, దళిత ఉద్యోగులకు అన్యాయం చేసే విధంగా అధికారులు వ్యవహరించారని నిరసన తెలిపారు. బ్యాంకు ఎదుటే బైఠాయించి దీక్ష చేపట్టిన విషయాన్ని కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలుసుకున్నారు. వెంటనే మచిలీపట్నం వెళ్లి ఆందోళన చేస్తున్న ఉద్యోగులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్లి తప్పకుండా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావుపై నమ్మకంతో ఉద్యోగులు కూడా ఆందోళన విరమించారు. ఆ తర్వాత కేడీసీసీ బ్యాంక్‌ దళిత, బీసీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి యార్లగడ్డ ప్రత్యేకంగా తీసుకు వెళ్లారు. దీంతో ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. దళిత, బీసీ ఉద్యోగులకు ఇచ్చిన పదోన్నతులను రద్దు చేయవద్దని ఆదేశించింది. దీంతో కేడీసీసీ బ్యాంక్‌ సీఈవో వారి పదోన్నతులను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కేడీసీసీ బ్యాంక్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తమ పదోన్నతులకు ముఖ్య కారణమైన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ప్రత్యేకంగా తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కేడీసీసీ బ్యాంకు అభివృద్ధికి దోహదపడాలని, ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవటానికి తాను సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తనను కలిసిన ఉద్యోగులతో యార్లగడ్డ అన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 01:17 AM