Share News

Gold Prices : పసిడి రికార్డు పరుగు

ABN , Publish Date - Mar 15 , 2025 | 02:31 AM

బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ తొలిసారిగా 3,000 డాలర్ల మైలురాయిని దాటింది.

Gold Prices : పసిడి రికార్డు పరుగు

అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్లో 3,000 డాలర్లు దాటిన ఔన్స్‌ గోల్డ్‌

దేశీయంగానూ సరికొత్త గరిష్ఠానికి..

న్యూఢిల్లీ: బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ తొలిసారిగా 3,000 డాలర్ల మైలురాయిని దాటింది. శుక్రవారం ఒక దశలో 0.6 శాతం పెరుగుదలతో 3,009.10 డాలర్ల స్థాయిలో ట్రేడైంది. సిల్వర్‌ కూడా ఒక శాతానికి పైగా పెరిగి 34.65 డాలర్లకు ఎగబాకింది. ట్రంప్‌ సుంకాల వడ్డనతో అంతర్జాతీయంగా పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతలతో పాటు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వచ్చే సమీక్షలో ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలు తాజా గోల్డెన్‌ ర్యాలీకి ఆజ్యం పోశాయి. ఎందుకంటే, ఆర్థిక అనిశ్చితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా బంగారానికి పేరుంది. ఇందుకుతోడు, అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు భారీగా దిద్దుబాటుకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈ విలువైన లోహాల్లోకి మళ్లిస్తుండటంతో బంగారం, వెండికి డిమాండ్‌ అనూహ్యంగా పెరిగి గత రెండు వారాలుగా ధరలు వేగంగా ఎగబాకుతున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు సైతం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటూ వస్తుండటం ప్రస్తుత గోల్డ్‌ ర్యాలీకి మరో కారణమని వారన్నారు.


ఏడాది చివరి నాటికి 3,300 డాలర్లకు!?

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఈ ఏడాదిలో ఇప్పటివరకు 14 శాతానికి పైగా పెరిగింది. ట్రంప్‌ సుంకాలతో మున్ముందు ఆర్థిక అనిశ్చితులు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి. ఇందుకుతోడు, అమెరికా మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి జారుకోవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. ఇదే గనక జరిగితే, బంగారం, వెండి ధరలు మరింత ఎగబాకడం ఖాయమని బులియన్‌ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే వారమూ గోల్డ్‌ ర్యాలీ కొనసాగవచ్చని శాక్సో బ్యాంక్‌ కమోడిటీ విభాగ అధిపతి అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్‌ గోల్డ్‌ 3,300 డాలర్లకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. కాగా, అంతర్జాతీయ బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల సంస్థ ఏఎన్‌జెడ్‌ ఈ ఏడాది గోల్డ్‌ టార్గెట్‌ను 3,050 డాలర్లుగా అంచనా వేసింది.


మన దగ్గర రూ.లక్ష దాటుద్దా..?

అంతర్జాతీయ మార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ పసిడి ధరలు సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరాయి. హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.1,200 పెరుగుదలతో దాదాపు రూ.90,000 (రూ.89,780)కు చేరింది. 22 క్యారెట్ల లోహం రూ.82,300 పలికింది. కిలో వెండి రూ.1.12 లక్షలకు ఎగబాకింది. బులియన్‌ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ ఏడాది చివరినాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ 3,300 డాలర్లకు చేరితే, దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం రూ.లక్ష దాటే అవకాశాలున్నాయి.

నగలపై భారీ డిస్కౌంట్లు

పసిడి ధరలు ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి పెరగడంతో స్వర్ణాభరణాలకు గిరాకీ భారీగా తగ్గిందని, కస్టమర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారని చెన్నైకి చెందిన బులియన్‌ వర్తకుడు ఒకరు వెల్లడించారు. దాంతో జువెలర్లు నగలపై భారీ డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తున్నారని, ఈ డిస్కౌంట్లు 8 నెలల క్రితం నాటికి గరిష్ఠ స్థాయికి చేరాయని వారన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 02:31 AM