Share News

Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు

ABN , Publish Date - Apr 06 , 2025 | 07:05 AM

ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనంగా, మనిషి ఇలా బ్రతకాలి, అని ఒక ఆదర్శవంత మైన జీవితాన్ని గడిపి, మానవ జన్మకున్న విశిష్ఠతను ఆవిష్కరించిన రామాయణ నాయకుడు, ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి. రామాయణం అనే మాటలోని ‘అయనం’ అంటే నడక అని అర్థం. రామాయణం అంటే ‘రాముని నడక’ అని అర్థం. అంటే ఆయన జీవించిన విధానం. పరిపూర్ణంగా మానవుడు ఎలా జీవించాలో అలా జీవించి చూపాడు శ్రీరాముడు.

Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు
Sri Rama Navami

ఆదర్శమూర్తి, మర్యాదపురుషోత్తముడు, జనంమెచ్చిన నాయకుడు... ఇలా ఎన్నో విధాల శ్రీరాముడిని కీర్తిస్తూ ఆరాధిస్తూంటారంతా. ఆయన మనలాంటి మనిషే కదా? మనలానే కష్టసుఖాలనుభవించాడు కదా? మరైతే దేవుడిగా పూజలందుకోవడమేమిటి? అనే సందేహాలు కొందరికి కలగటం పరిపాటే. శ్రీరామచంద్రుడి జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే, మనిషిగా పుట్టి దేవుడిగా ఎలా ఎదగొచ్చో సులువుగానే బోధపడుతుంది.

శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం

ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి

‘శ్రీరాముడు తండ్రికి ప్రీతిపాత్రుడు, ఏకపత్నీ వ్రతుడు, తన వంశానికి స్థిర కీర్తి తెచ్చిపెట్టిన వాడు, అధర్మాన్ని అనుసరించే రాక్షసులను సంహరించిన ధర్మ రక్షకుడు. అంతేకాదు.. అందంగా మరీమరీ చూడాలనిపించేలా దివ్యమైన ఆకారంతో ప్రకాశించేవాడు. అందుకే ఆ స్వామికి మొక్కుతున్నాను’ అన్నదీ శ్లోకభావం. ఇలా ఏ ఇంటి బిడ్డ ఉన్నా రామయ్యలానే మంచి పేరు తెచ్చుకోవచ్చు.

Also Read..: ‘కంచ’ దాటిన వ్యాఖ్యలు


స్వామి జీవనయానమే అది...

ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనంగా, మనిషి ఇలా బ్రతకాలి, అని ఒక ఆదర్శవంత మైన జీవితాన్ని గడిపి, మానవ జన్మకున్న విశిష్ఠతను ఆవిష్కరించిన రామాయణ నాయకుడు, ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి. రామాయణం అనే మాటలోని ‘అయనం’ అంటే నడక అని అర్థం. రామాయణం అంటే ‘రాముని నడక’ అని అర్థం. అంటే ఆయన జీవించిన విధానం. పరిపూర్ణంగా మానవుడు ఎలా జీవించాలో అలా జీవించి చూపాడు శ్రీరాముడు. సాక్షాత్తూ వైకుంఠవాసుడే అయినా ఎక్కడా తాను దేవుడినని కాని, దైవత్వాన్ని ప్రకటించడం కాని చేయలేదు. ఆయన ప్రతి అడుగు సత్యధర్మాల వైపే పడింది. ‘‘రామో విగ్రహవాన్‌ ధర్మః’’ అని ఆ స్వామిని కీర్తించేది కూడా అందుకే. ఆ స్వామి పేరే పరమపావన పుణ్యక్షేత్రం. వాస్తవానికి ‘రామ’ శబ్దంలోనే గొప్పతనం ఉంది. ‘‘ఓం నమో నారాయణాయ’’ అన్న అష్టాక్షరీ మహామంత్రంలోని బీజాక్షరం ‘రా’, ‘‘ఓం నమః శివాయ’’ అన్న పంచాక్షరీ మహామంత్రంలోని బీజాక్షరం ‘మ’ పక్కన చేరి రామనామంగా మారింది. అందుకే ఆ నామానికి అంత శక్తి వచ్చింది. అలాగే ‘రా’ అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకుంటుంది. అప్పుడు మనలోని పాపాలు బయటకు పోతాయి. ‘మ’ అక్షరం పలికే సమయంలో నోరు మూసుకొని బయట ఉన్న పాపాలు లోపలికి రాకుండా ఉంటాయని పెద్దల వివరణ. అలాగే ‘రా’ అన్న అక్షరం భక్తులను సంసార సాగరం నుంచి రక్షిస్తే, ‘మ’ అనే అక్షరం భక్తుల కోరికలను నెరవేరుస్తుందని సాధకుల మాట.


సహస్రనామ తత్తుల్యం...

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

విష్ణుసహస్రనామాలలో పరమశివుడు పార్వ తీదేవితో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసిందే. శ్రీ రామ రామ రామ అని మూడుసార్లు జపిేస్త విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఫలం వస్తుందనేది ఈ శ్లోక భావం. అదెలా సాధ్యం అంటే వర్ణమాలను చూడాల్సి ఉంటుంది. కటపయాది సూత్రం ప్రకారం ‘య’ వర్గంలో ‘రా’ రెండవ అక్షరం కనుక దానిసంఖ్య రెండు కాగా ‘ప’ వర్గంలో ‘మ’ ఐదవ అక్షరం దాని సంఖ్య అయిదు అవుతుంది. దాని ప్రకారం 2x5=10 ఒకసారి రామ అంటే పదిసంఖ్య వస్తుంది. 10x10=100, 100x10=1000 అవు తుంది. అలా విష్ణు సహస్రనామం సమానంగా రామ అని మూడుసార్లు పలికితే ఫలితం వస్తుందన్నది ఆ పరమేశ్వరుడే చెప్పిన మాట.


పదహారు సద్గుణాల పరంధాముడు...

చంద్రుడికి 16 శుభ కళలున్నట్టు...ఆ శ్రీరామ చంద్రమూర్తికి పదహారు సద్గుణాలున్నాయి. ఏమనిషైనా ఈ 16 సద్గుణాలను కలిగిఉంటే... ఉత్తమ పౌరుడిగా కీర్తి గడించవచ్చన్నది రామావతార సందేశం. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణాలు కలిగిన మానవుడు ఎవరు? అని రామాయణ రచనా ప్రారంభ సమయాన నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడిగాడు. అప్పుడు ‘పదహారు గుణాలు కలిగిన పరిపూర్ణ మైన మానవుడు రామచంద్రమూర్తి’ తప్ప మరొకరు లేరని నారదుడు వివరించాడు. మనుష్య జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు. మానవుడిగా పెరిగాడు. మానవుడు పడిన కష్టాలు పడ్డాడు. మానవుడిగానే అవ తారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యంతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శుశ్రూషలతో గురువులను, దానగుణాలతో దీనులను గెలిచాడు. అలాగే, తన పౌరుష పరాక్రమాలతో శత్రువులను గెలిచాడు. అందుకే పరిపూర్ణమైన మానవ అవతారంగా రామావతారం దర్శన మిస్తుంది. ‘ధర్మం తప్పకుండా మనిషిఅనేవాడు ఇలా జీవించాలి’ అని చూపినవాడుశ్రీరాముడు. అలా ఉండటానికి ఆయనకున్న గుణాలు ఇవే. 1. గుణవంతుడు 2. వీర్యవంతుడు 3. ధర్మాత్ముడు 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు 5. సత్యం పలికేవాడు 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు 7. చారిత్రము కలిగినవాడు 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు 9. విద్యా వంతుడు 10. సమర్థుడు 11. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు 12. ధైర్య వంతుడు 13. క్రోధాన్ని జయించినవాడు 14. తేజస్సు కలిగినవాడు 15. ఎదుటి వారిలో మంచిని చూేసవాడు 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలి గినవాడు. ఈ సద్గుణాలున్నవాడు కనుకనే పరిపూర్ణ మానవుడయ్యాడు. త్రేతాయుగం నుంచి నేటిదాకా రాముడే నాయకుడని, రాజ్యమంటే రామ రాజ్యమేనని అందరూ అనేది అందుకే. ఆ ధర్మమూర్తికి వాడవాడనా ఆలయాలు కట్టడం, ఏటేటా కల్యాణాలు జరపటం ధర్మస్ఫూర్తిని పొందటానికే. ధర్మానుసరణతో జీవితాన్ని ధన్యం చేసుకోవటానికే.


ఈ వార్తలు కూడా చదవండి..

తమిళ జాలర్లపై మానవత్వం చూపండి

క్రమబద్ధీకరణ చేద్దామా

For More AP News and Telugu News

Updated Date - Apr 06 , 2025 | 07:05 AM