రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు మహర్దశ
ABN , Publish Date - Mar 28 , 2025 | 02:02 AM
‘రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి, మౌలిక సదుపాయాలు, పరిశోధన అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించింది. మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు కేంద్ర నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం...

‘రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి, మౌలిక సదుపాయాలు, పరిశోధన అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించింది. మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు కేంద్ర నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ఆచార్యుల ఖాళీలను భర్తీ చేస్తా’మని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించడంతో ఏపీ విశ్వవిద్యాలయాల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా నిరాదరణకు గురైన ఉన్నత విద్యారంగానికి మంచిరోజులు రానున్నాయని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన మరోసారి నొక్కి చెప్పారు. రాష్ట్రంలో సగానికి పైగా విశ్వవిద్యాలయాలకు ఇప్పటికే ఉపకులపతుల్ని నియమించారు. విశ్వవిద్యాలయాల్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చనున్నారు.
ఈ ఆలోచనను విద్యావేత్తలు పూర్తిగా సమర్థిస్తున్నారు. అందుకు తగిన విధంగా కోర్సులను రూపకల్పన చేయనున్నారు. వాటికి తగిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టనున్నారు. పరిశోధనలను, ఆవిష్కరణలను పెంపొందించే దిశగా అడుగులు వేస్తున్నారు. అదనంగా ఉన్నత విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి నాణ్యత హామీ, ఫ్యాకల్టీ, అభివృద్ధి కార్యక్రమాలు, అంతర్జాతీయ ఆకర్షణలు కలిగించే చర్యలు అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను గుర్తించి 2017–18 విద్యాసంవత్సంలో రెండు ప్రకటనలు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించింది. ఈ స్ర్కీనింగ్ పరీక్షే యూజీసీ నిబంధనలకు విరుద్ధమని అభ్యర్థుల నుంచి విద్యావేత్తల వరకు తప్పుపట్టారు. జరిగిన స్ర్కీనింగ్ పరీక్ష ప్రశ్నాపత్రాల్లో దొర్లిన తప్పులు మీద పెద్దయెత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీటితో పాటు రిజర్వేషన్ విధానంలో, రోస్టర్ పాయింట్లలో తప్పులున్నాయని హైకోర్టు పరీక్ష రద్దు చేసింది. తర్వాత జరిగిన పరిణామాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు సర్వోన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకున్నారు. తరువాత ఈ కేసు విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకోకుండా నీరుగార్చింది.
ఆదరాబాదరాగా, తప్పుల తడకగా ప్రకటనలు ఇచ్చి ఖాళీలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల్ని మోసగించింది. ఈ ప్రకటనల మీద కూడా ఉన్నత న్యాయస్థానంలో 10కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రకటనల్లో కూడా చాలా తప్పులున్నాయని ప్రభుత్వమే అంగీకరించి, సవరణలతో కూడిన ప్రకటన, లేదా కొత్త ప్రకటన విడుదల చేస్తామని న్యాయస్థానానికి తెలియజేసింది. ఈ లోగా జరిగిన 2024 సాధారణ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఘోరపరాజయం పొంది కూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తదనంతర విధాన నిర్ణయాల్లో భాగంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటన చేశారు. ఏకసభ్య కమిషన్ నియమించి నివేదిక రాగానే ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. దీంతో వర్సిటీలకు మహర్దశ రానుందని విద్యావంతులు భావిస్తున్నారు. ప్రపంచీకరణ పోటీలో రెండు దశాబ్దాలుగా ఉపాధి అవకాశాలు సన్నగిల్లిన కొన్ని అంశాలను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ కోర్సులకు ఉపాధి అవకాశాలు లేక నిరాదరణకు గురవుతున్న విషయం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. కొంతమంది ఐఐటి, ఎన్‌ఐటి, ఇంకా ఇతర జాతీయ సంస్థలకు చెందిన అకడమీషియన్లతో చర్చించి పరిష్కారాలను కనుగొనే పనిలో నిమగ్నమయింది. ఈ కోర్సులను పారిశ్రామిక రంగంతో అనుసంధానించడంతో అధికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచవచ్చని భావించింది. ఇంటర్న్‌షిప్, నైపుణ్య ఆధారిత అభ్యాసాన్ని ఖచ్చితంగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం బలంగా యోచిస్తోంది. పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి కేంద్రీకరించడం ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతోంది.
దీనిలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను స్థాపించనున్నారు. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు తగిన విధంగా స్టార్టప్ ఇంక్యుబేషన్‌తో అంతర్జాతీయ సామర్థ్యాలను సాధించి స్టడీ ఇన్ ఆంధ్రప్రదేశ్ వంటి కార్యాచరణ చేపట్టనుంది. ఏపీ విశ్వవిద్యాలయాలను జాతీయ ర్యాంకింగ్‌ల్లో నిలబెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఐటిఐ, పాలిటెక్నిక్‌లను తగిన పాఠ్యప్రణాళికలతో పారిశ్రామిక అభివృద్ధిలో భాగం చేయనున్నారు. ఈ నిర్ణయాలన్నీ రాష్ట్ర విశ్వవిద్యాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా ఉన్నాయి. అయితే వీటిని ప్రణాళికగాబద్ధంగా ఆచరణలోకి తీసుకొస్తే వర్సిటీలకు మహర్దశ కలుగుతుంది. అప్పుడే మన విశ్వవిద్యాలయాలు జాతీయ, అంతర్జాతీయంగా ఆశించిన ర్యాంకుల్లో నిలుస్తాయి.
డాక్టర్ జీకేడీ ప్రసాదరావు
ఫ్యాకల్టీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఇవి కూడా చదవండి:
Revanth Reddy: డిన్నర్‌కి పిలిచి AK47తో లేపేశాడు.. కేటీఆర్‌పై సీఎం సెటైర్లు..
Bhuma Akhila Priya: సాక్షి ఆఫీసు వద్ద భూమా అఖిలప్రియ ధర్నా