Bangladesh PM China visit: చైనా–బంగ్లా చెలిమి
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:36 AM
స్వదేశంలో నిరసనల మధ్య బంగ్లాదేశ్ ప్రధాని చైనాకు చెందిన జి జిన్‌పింగ్‌ను కలిశారు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. భేటీ దిగ్విజయంగా జరిగిందని, స్నేహం, సహకారం, ఇచ్చిపుచ్చుకోవడాల గురించి దేశాధినేతలు ఇద్దరూ మాట్లాడుకున్నారని, రెండుదేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందాలు, పలురంగాల్లో అరడజనుకు పైగా అవగాహనలు కుదిరాయని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బంగ్లాదేశ్ పేర్కొంది. పెట్టుబడులు, చైనా ఇండస్ట్రియల్ ఎకనామిక్ జోన్, మోంగ్లాపోర్టు అభివృద్ధి, తీస్తా నదీజలాల ప్రాజెక్టు నిర్వహణ తదితర అంశాలమీద నిర్ణయాలు జరిగాయని, ఏకచైనా సూత్రాన్ని, దాని సార్వభౌమత్వ, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ హక్కులను బంగ్లాదేశ్ సమర్థించిందని ఆ ప్రకటన పేర్కొంది. మీ దేశంలో మా వాళ్ళతో పెట్టుబడులు పెట్టించే బాధ్యతనాది అని చైనా అధ్యక్షుడు హామీ ఇచ్చారని, యూనస్ ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారని బంగ్లాదేశ్ ఆ ప్రకటనలో చెప్పుకుంది. నాలుగురోజుల చైనా పర్యటనకు యూనస్ మార్చి 26న బయలుదేరిననాడే బంగ్లాదేశ్ 53వ స్వాతంత్ర్య దినోత్సవం. భారత్ నైతిక, సైనిక సహకారంతో బంగ్లాదేశ్ విముక్తి జరిగిన రోజునే యూనస్ తన చైనా పర్యటనకు ఎంచుకోవడం, చైనా పంపిన ప్రత్యేక విమానంలో అన్ని రంగాలకు చెందిన సలహాదారులను, అధికారులను వెంటబెట్టుకొనిపోవడం వెనుక భారతదేశానికి స్పష్టమైన సందేశం ఉన్నదని విశ్లేషకుల అనుమానం. తొలిగా భారతదేశంలోనే పర్యటిద్దామని యూనస్ అనుకున్నారని, కానీ, సానుకూలమైన ఆహ్వానం లభించలేదని ఆయన ప్రెస్ సెక్రటరీ ఈ మధ్య ఓ వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో జరిగిన తిరుగుబాటులో షేక్ హసీనా తన ప్రధాని పదవికోల్పోయి, భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నప్పటినుంచీ భారత్–బంగ్లా సంబంధాలు అగాధాన్ని అంటాయి. హిందూ మైనారిటీలమీద దాడులు, ఊచకోతలు యధేచ్ఛగా సాగిపోతున్నాయంటూ మన ప్రభుత్వం విమర్శలు చేయడం, మరోపక్క యూనస్ ప్రభుత్వాన్ని హసీనా ఇక్కడనుంచి తీవ్రంగా విమర్శిస్తూండటం అగాధాన్ని మరింత పెంచింది. మతఛాందసులను నియంత్రించలేకపోగా, ఆ దాడులు మతపరమైనవి కావనీ, అంతాసవ్యంగా ఉన్నదనీ యూనస్ చేసిన సమర్థింపులు డొల్లవని అనతికాలంలోనే తేలిపోయింది.
మొన్న డిసెంబరులో మన విదేశాంగశాఖ కార్యదర్శి మిస్రీ ఆ దేశాన్ని సందర్శించినప్పుడు కూడా ఈ నేరాల విషయంలో మన ఆందోళనను కుండబద్దలుకొట్టి వచ్చారు. ఈ నేపథ్యంలో, మార్చి 26 విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్రపతి, ప్రధాని బంగ్లాదేశ్ నేతకు ప్రత్యేక సందేశాలు పంపడం, బంగ్లాదేశ్ ఆవిర్భావంలో భారత్ పాత్రను గుర్తుచేస్తూ యూనస్‌కు మోదీ లేఖ రాయడం బాగుంది. బంగ్లాదేశ్‌లో షేక్ ముజబూర్ రహ్మాన్ జ్ఞాపకాలను, వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు, ఆ విముక్తిపోరాటాన్ని సైతం ప్రజల మస్తిష్కాలనుంచి తుడిచివేసేందుకు విశేష ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో వాటి ప్రస్తావనలు అక్కడి వారికి నచ్చకపోవచ్చునేమో. దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది 1971లోనా, 2024 ప్రజాపోరాటంతోనా అంటూ బిఎన్‌పి, జమాత్ వంటివి నిర్దిష్టమైన ఎజెండాతో, చరిత్రను చెరిపివేసే లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయి. విముక్తి పోరాటం గురించి మాట్లాడుతున్న వారిని దేశద్రోహులుగా అభివర్ణిస్తున్నాయి. మరోపక్క, తమది లౌకికవాద, తటస్థదేశంగా ఉండాలన్న సదాశయంతో విద్యార్థి నేతలు గత నెలలో ఆరంభించిన పార్టీ మతఛాందసులను తట్టుకొని నిలిచి, ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేయగలదో చూడాలి. శాంతి, స్థిరత్వం, ప్రజాశ్రేయస్సు, ఉమ్మడి ప్రయోజనాలకోసం కలసి నడుద్దామని యూనస్‌కు రాసిన లేఖలో మోదీ ప్రతిపాదించడం ప్రశంసనీయమైనది. సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్‌ను ఆదుకొనే పేరిట చైనా మరింత ఉధృతంగా, మరిన్ని రంగాల్లోకి ప్రవేశించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. రుణాలకు వడ్డీలు తగ్గించడం, కొత్త ప్రాజెక్టులకు మద్దతు, మరిన్ని అప్పులు సహా పలు ప్రతిపాదనలను చైనా పర్యటనలో యూనస్ చేశారట. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం, బిఆర్‌ఐ దిశగా రెండుదేశాలూ అడుగులు వేస్తూ, బంగ్లాదేశ్–పాకిస్థాన్–చైనా వేగంగా ఒక్కటవుతున్న వాతావరణం మనకు ఇబ్బంది కలిగించేదే.