జాతీయ విద్యలో త్రిభాషా సూత్రం తిరకాసు
ABN , Publish Date - Apr 01 , 2025 | 02:30 AM
త్రిభాషా సూత్రం ఇప్పుడు మళ్లీ ప్రధాన సమస్యగా ముందుకు వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పి.ఎమ్.శ్రీ ఒప్పందంపై సంతకం పెట్టకపోవడం, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి...

త్రిభాషా సూత్రం ఇప్పుడు మళ్లీ ప్రధాన సమస్యగా ముందుకు వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పి.ఎమ్.శ్రీ ఒప్పందంపై సంతకం పెట్టకపోవడం, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి నిరాకరించడం, అసలు ‘జాతీయ విద్యావిధానం–2020’ని తిరస్కరించడంతో కేంద్రం తమిళనాడుకు ఇవ్వవలసిన విద్యారంగ నిధులు రెండువేల కోట్ల రూపాయిలు నిలిపివేసింది. దీంతో ఇది పెద్ద చర్చగా మారింది. కేంద్రం ఒక విద్యా విధానాన్ని రూపొందించి, దానిని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు జరపాలని నిర్బంధించడం, అమలు చేయకపోతే నిధులు ఆపివేస్తామనడం అన్యాయమైన విషయం. ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. రాజ్యాంగకర్తలు విద్యను రాష్ట్ర జాబితాలో పెట్టారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చింది. తిరిగి విద్యను రాష్ట్ర జాబితాకు మార్చాలనే డిమాండు ముందుకు వస్తున్న తరుణంలో కేంద్ర విద్యావిధానాన్ని ప్రతి రాష్ట్రం విధిగా అమలు జరపాలని నిర్బంధం చేయడం ప్రస్తుత చర్చకు కారణం అయింది.
కేంద్ర ప్రభుత్వం జూలై 29, 2020న ‘జాతీయ విద్యా విధానం–2020’ (ఎన్.ఇ.పి–2020) పేరున ఒక విధాన పత్రాన్ని ప్రకటించింది. దీనిని ఏ దశలో కూడా పార్లమెంటులో చర్చకు పెట్టలేదు. అటువంటప్పుడు వివిధ రాష్ట్రాల చట్టసభల్లో చర్చకు పెట్టడం అనే సమస్యే తలెత్తదు. దీనిని జాతీయ విద్యా విధానం అనడం కంటే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం అనడం సబబుగా ఉంటుంది. ఈ విద్యా విధానంలో చాలా సమస్యలున్నాయి. ఎ) ఇది విద్యా వ్యాపారాన్ని రద్దు చేయలేదు సరికదా, ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు నిరాకరిస్తూ, ప్రతి విశ్వవిద్యాలయం తనకు అవసరమైన నిధులను తానే సమకూర్చుకోవాలని చెప్తుంది. ఇది ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫీజుల పెంపుదలకు, పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్య నిరాకరణకు కారణమవుతున్నది. ఈ మధ్య విడుదల అయిన యు.జి.సి ముసాయిదా విధానంలో విశ్వవిద్యాలయాల్లో పదోన్నతులు కోరే అభ్యర్థులు విశ్వవిద్యాలయాలకు నిధులు సమకూర్చే ప్రాజెక్టులను చేపట్టాలని, పదోన్నతి కల్పించడంలో వివిధ రూపాల్లో వారు సమకూర్చగల నిధులు ఒక ప్రధాన అంశంగా ఉంటాయని ప్రతిపాదించిన విషయం విదితమే. బి) ఈ విధానం విద్యారంగ విషయాలపై అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కేంద్రీకరిస్తుంది. పాఠశాల పాఠ్యపుస్తకాలను సొంతంగా రాసుకునే హక్కు కూడా రాష్ట్రాలకు లేదు. వాటిని కేంద్రమే రూపొందిస్తుంది, రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి. ఈ కేంద్ర విద్యా విధానం ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కోర్సులు, చివరికి పరిశోధనలు (నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా) కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. ముందుగా సూచించిన యు.జి.సి సర్క్యులర్ ‘రాష్ట్రాలు స్థాపించి నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయాలకు ఉప కులపతుల నియామకంలో’ రాష్ట్ర ప్రభుత్వాలకు పాత్రలేని విధానాన్ని ప్రతిపాదించింది. అయితే ఈ విషయం కొత్తది కాదు. ఇది ఎన్.ఇ.పి–2020లో ఉంది. సి) ఈ విద్యావిధానం సామాజిక న్యాయానికి పాతర వేసింది. 66 పేజీల విధాన పత్రంలో ‘సామాజిక న్యాయం’ అన్న పదబంధంగాని, రిజర్వేషన్లు అనే పదంగాని కనిపించదు. మరల యు.జి.సి సర్క్యులర్‌లోనే రిజర్వేషన్లు నీరుగార్చడానికి సాక్ష్యాలు కనిపిస్తాయి. యు.జి.సి సర్క్యులర్‌లో ఎస్సీ, ఎస్టీ, నాన్ క్రీమీలేయర్ బీసీ, ఇ.బి.సి, అంగవైకల్యం ఉన్న వారికి నిర్దిష్ట శాతాల్లో రిజర్వేషన్ ఇస్తున్నట్లు పేర్కొనలేదు. 5శాతం మార్కులు వెసులుబాటు మాత్రం ప్రతిపాదించారు. డి) ఈ విద్యా విధానం ‘భారత జ్ఞాన వ్యవస్థ’ పేరుతో కాషాయీకరణకు, చరిత్ర వక్రీకరణకు, కాలం చెల్లిన భావాల వ్యాప్తికి, చివరికి భూత వైద్యానికి ప్రాతిపదికలు ఏర్పాటు చేసింది. ఇ) ఎన్.ఇ.పి–2020 పాలక పార్టీ వ్యక్తులు వారికి ఎటువంటి విద్యా సంబంధమైన అర్హతలు లేకపోయినా ప్రొఫెసర్‌లు కావడానికి దారులు వేసింది. ఈ విషయానికి కూడా మనం జాతీయ విద్యావిధానం పత్రం చదవవలసిన అవసరం లేదు. యు.జి.సి సర్క్యులర్‌లోనే ‘ఎటువంటి విద్యా సంబంధమైన అర్హతలు లేని వారికి’ వారి ‘ఇతర సమర్థతలను’ దృష్టిలో ఉంచుకుని ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’గా విశ్వవిద్యాలయాలు నియమించవచ్చని ప్రతిపాదించారు. విశ్వవిద్యాలయాల్లో పాలక పార్టీ వ్యక్తుల (ప్రస్తుతం బి.జె.పి; ఆర్.ఎస్.ఎస్) చొరబాటుకు ఇది రాజమార్గం. మరి ఇది ఒక్క తమిళనాడు సమస్య ఎలా అవుతుంది. ఈ సమస్యలతో పాటు భాషా విధానం కూడా ప్రధానంగా ఉంది.
భాషా విధానం దీర్ఘకాలంగా మన దేశంలో ఒక సమస్యగా ఉంది. ‘వైవిధ్యంలో ఐక్యత’ అనే భావం ఔన్నత్యం చూడలేకపోవడం, ఏకత్వం ద్వారానే ఐక్యత సాధ్యమవుతుందని అనుకోవడం వల్ల సమస్య వస్తున్నది. దేశ ప్రజలందరూ హిందీ నేర్చుకుంటే దేశ ప్రజల ఐక్యత, ప్రాదేశిక సమగ్రత సాధ్యం అవుతాయనే భావన ఆనాటి కాంగ్రెస్‌లో కూడా ఉన్నది. కమ్యూనిస్టులు ఈ భావనకు గురి కాలేదు కాని, కొన్ని రకాల సోషలిస్టులు కూడా ఈ భావజాలానికి నీరు పోశారు. అనేక చర్చల తరువాత ‘భారత రాజ్యాంగ పరిషత్’ హిందీని అఖిల భారత అధికార భాషగా గుర్తించి, 1965 వరకు ఆంగ్లం కూడా అధికార భాషగా కొనసాగించవచ్చని పేర్కొంది. సహజంగానే 1965లో ఈ సమస్య మళ్లీ ముందుకొచ్చింది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం తీవ్రంగా పెరిగింది. ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా గొంతు కలిపారు. కేంద్రం వెనక్కి తగ్గింది. అధికార భాష అనే సమస్యతో పాటు మరి రెండు సమస్యలున్నాయి ఒకటి బోధనా మాధ్యమం, రెండవది భాషల బోధన. బోధనా మాధ్యమం విషయానికి వస్తే కొఠారీ కమీషన్, ‘1986 నాటి జాతీయ విద్యా విధానం’ మాతృభాషా మాధ్యమాన్నే అత్యున్నత స్థాయి వరకు సిఫారసు చేశాయి. 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులో ఉన్న ‘బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం–2009’ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్నే నిర్దేశిస్తున్నది. ‘జాతీయ విద్యా విధానం 2020’ మాత్రం 5వ తరగతి వరకు మాత్రమే మాతృభాషా మాధ్యమాన్ని సిఫారసు చేసి, ‘వీలయితే 8వ తరగతి వరకు’ అనే మాట చేర్చింది.
కొఠారీ కమిషన్, ఇంకా 1986లో వచ్చిన జాతీయ విద్యావిధానం కూడా త్రిభాషా విధానాన్నే సిఫారసు చేశాయి. కొన్ని ప్రధానమైన, ఆపైన ప్రమాదకరమైన వెసులుబాట్లతో మోడీ 2.0 కాలంలో వచ్చిన ‘జాతీయ విద్యావిధానం–2020’ కూడా త్రిభాషా విధానాన్ని ప్రతిపాదించింది. ఈ త్రిభాషా విధానంలో మాతృభాష కాని ఆంగ్లం కాని తప్పనిసరి కాదు! తాము తమిళ్, ఆంగ్లం విద్యార్థులకందిస్తామని, మూడవ భాష (హిందీ, సంస్కృతం, ఇంకా దేనినీ) తప్పనిసరి చేయమని తమిళనాడు తెగేసి చెప్పింది. ఎన్.ఇ.పి–2020లో కనీసం రెండు దేశీయ భాషలు నేర్చుకోవాలని ఉంది గాని, అందులో ఒకటి వాడుకలో లేని సంస్కృతం కూడా కావచ్చు. సంస్కృతాన్ని ప్రోత్సహించడానికే ఇటువంటి విధానాన్ని తీసుకువచ్చారు. విశ్వవిద్యాలయ స్థాయిలో సంస్కృత సాహిత్యాన్ని పరిశోధించడానికి కొద్ది మంది ఆసక్తి ఉన్న విద్యార్థులు సంస్కృతం నేర్చుకోవడం వేరు, బాలబాలికందరికీ సంస్కృతాన్ని ఒక సబ్జెక్ట్ చేయడం వేరు.
ఈ పాలసీ కింద ఇప్పటికే అవకాశవాద విధానాలనవలంబిస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పేమీ ఉండదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, హిందీ (మూడు భాషలు, అందులో కనీసం రెండు దేశీయ భాషలు) అందిస్తున్నారు. ఇది ‘ఎన్.ఇ.పి–2020’ మూసలోనే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు బోధించరు, ఆంగ్లం, హిందీ, సంస్కృతం బోధిస్తారు. సంస్కృతం ‘స్కోరింగ్ సబ్జెక్టు’!
కొత్త ‘జాతీయ విద్యా విధానం’లో విద్యార్థులకు మాతృభాషను తప్పనిసరిగా అందించాలనే సిఫారసు లేనందున మార్కెట్ శక్తులకు ఇబ్బంది లేదు. కొత్త విద్యా విధానంలో ఆంగ్లం కూడా తప్పనిసరి కాదు, కాబట్టి గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ప్రధానంగా పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో, కాలక్రమంలో, విద్యార్థులకు ఆంగ్ల భాషా బోధనను పూర్తిగా తిరస్కరించి గుజరాతీతో పాటు హిందీ, సంస్కృతాలను వారిపై రుద్దవచ్చు. సంఘ్‌పరివార్ అజెండా ముందుకు తీసుకువెళ్ళవచ్చు. భోజ్‌పురి, మగధి, మైథిలి వంటి సుమారు 25 భాషలను మింగివేసి విస్తరించిన హిందీ అనేక రాష్ట్రాల్లో ప్రజల మాతృభాషగా చలామణి అవుతున్నది. ఆ రాష్ట్రాలు ‘ఎన్.ఇ.పి–2020’ వరకు ద్విభాషా విధానాన్నే అమలు చేశాయి. కొత్త త్రిభాషా విధానం కింద సంస్కృతం బోధన ప్రారంభించారు.
‘ఎన్.ఇ.పి–2020’ చట్టం కాదు, దానిని రాష్ట్రాలు అమలు చేయవలసిన అవసరం లేదు. దీనిని అమలు చేయమని తమిళనాడును కాని మరొక రాష్ట్రాన్ని కాని బలవంతం పెట్టే అధికారం కేంద్రానికి లేదు. హిందీని, సంస్కృతాన్ని బలవంతంగా రుద్దకూడదు. కేంద్ర ప్రభుత్వం మాట అలా ఉంచి... వైవిధ్యాన్ని ఆమోదిస్తేనే, గౌరవిస్తేనే ఐక్యత బలపడుతుందని హిందీ బెల్ట్ ప్రజలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ హిందీని, సంస్కృతాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించడం ద్వారా దేశ ప్రజల ఐక్యతకు, ప్రాదేశిక సమగ్రతకు నష్టం కలిగిస్తున్నది.
డి. రమేష్ పట్నాయక్
కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ
ఈ వార్తలు కూడా చదవండి
Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా.. రావాల్సిందే అన్న పోలీసులు
Lokesh On Visakhapatnam: ఏపీ ఐకానిక్ క్యాపిటల్‌గా విశాఖ
Kethireddy: ప్రైవేట్ జెట్ నడిపిన కేతిరెడ్డి.. వీడియో వైరల్
Read Latest AP News And Telugu News