Share News

విస్మరణల ‘యువవీరులు’!

ABN , Publish Date - Apr 01 , 2025 | 02:20 AM

నరేష్ జాటోత్ వ్యాసం ‘స్వాతంత్ర్య సమరంలో యువవీరులు’ (మార్చి 23)లో కొన్ని పొరపాట్లు, కొన్ని విస్మరణలు ఉన్నాయి. భగత్ సింగ్ పుట్టిన ఊరు, ఉరి తీయబడిన ఊరు కూడా పొరపాటుగా పేర్కొన్నారు. ‘ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న...

విస్మరణల ‘యువవీరులు’!

నరేష్ జాటోత్ వ్యాసం ‘స్వాతంత్ర్య సమరంలో యువవీరులు’ (మార్చి 23)లో కొన్ని పొరపాట్లు, కొన్ని విస్మరణలు ఉన్నాయి. భగత్ సింగ్ పుట్టిన ఊరు, ఉరి తీయబడిన ఊరు కూడా పొరపాటుగా పేర్కొన్నారు. ‘ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ హుస్సేనివాలా ప్రావిన్స్ జైలులో ఆ వీరులను ఉరికంబానికి బలిచ్చారు’ అని రాశారు. హుస్సేనివాలా ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నది. మన ఫిరోజ్‌పూర్‌కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో సట్లైజ్ నదికి పడమటగా ఆ ఊరు ఉంటుంది. 1849లో లాహోరు రాజధానిగా ఏర్పడిన పంజాబ్ ప్రావిన్స్‌లో ఒక చిన్న గ్రామం. లాహోరుకు దక్షిణ దిక్కున 20 కిలోమీటర్ల లోపు ఉంటుంది. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లను ఉరితీసింది లాహోర్ సెంట్రల్ జైల్లోనే. ఉరితీత అనంతరం వారి భౌతిక కాయాలను ఆ రాత్రి పూటే హుస్సేనీవాలా సట్లైజ్ నది ఒడ్డుకు తెచ్చి మొక్కుబడిగా కర్మకాండలు నిర్వహించి, త్వరగా కాలిపోవటానికని ముక్కలుగా చేసి, కిరసనాయిల్ పోసి దహనం చేశారు. ఇప్పటికీ వారి విగ్రహాలు, సమాధులు అక్కడే ఉన్నాయి. బట్టుకేశ్వరదత్తు, భగత్ సింగ్ తల్లి విద్యావతి సమాధులు కూడా అక్కడ ఉన్నాయి. (నేను 1998లో హుస్సేనివాలా వెళ్లి అమరవీరుల సమాధులు దర్శించి వచ్చాను)


భగత్ సింగ్ జన్మించిన ఊరు పేరు ‘బంగ’. అది ఆనాడు లాయల్‌పూర్ జిల్లాలో ఉండేది. విభజన అనంతరం దానికి ఫైసలాబాద్ అని పేరు మారింది. అది లాహోరు నుండి రావల్పిండి వేపు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వ్యాస రచయిత పేర్కొన్నట్లు ఆయన పుట్టింది లాహోర్‌లో కాదు, ‘బంగ’లో. ఉరి తీయబడింది హుస్సేనీ వాలాలో కాదు, లాహోర్‌లో!

ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేయటానికి భగత్‌సింగ్‌కు తోడుగా వచ్చినది బటుకేశ్వర దత్తు. వ్యాసరచయిత పేర్కొన్నట్లు రాజ్‌గురు, సుఖదేవ్‌లు కాదు. అలాగే వారికి ఉరిశిక్ష పడింది లాలా లజపతిరాయ్ హత్య కేసులో. వ్యాస రచయిత పేర్కొన్నట్లు బాంబులు వేసిన కేసులో కాదు. సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ‘స్కాట్స్ అనుకుని మరో ఎస్‌ఐ సాండర్స్‌ను హత్య చేశారు’ అని ఆ వ్యాసంలో రాశారు. స్కాట్ లాహోర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయితే సాండర్స్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎస్సై లాంటి చిన్న పోస్టులలో తెల్లవారు ఉండేవారు కాదు. 1986లో మేము వెలువరించిన ‘నా నెత్తురు వృధా కాదు’ పుస్తకంలో భగత్ సింగ్ నిరాహారదీక్ష చేసినది 114 రోజులు అని పేర్కొన్నాం. దానిపై కొందరు ప్రశ్నించటంతో నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను భగత్‌సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగన్మోహన్ సింగ్‌కు ఫోను చేసి మాట్లాడాను. ఆయన స్పష్టంగా 114 రోజులు అని చెప్పారు. ఈ వ్యాస రచయిత 64 రోజులు అని రాశారు.


భగత్ సింగ్, బట్టుకేశ్వర దత్తులు సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించుకున్న రెండు క్రూర నిర్బంధ చట్టాలకు నిరసనగా. అందులో ఒకటి (ట్రేడ్ డిస్ప్యూట్ బిల్) పారిశ్రామిక వివాదాల చట్టం. ఇది కార్మికుల కనీస హక్కులకు వ్యతిరేకంగా తీసుకువచ్చినది. రెండవది (పబ్లిక్ సేఫ్టీ బిల్) పౌర భద్రతా చట్టం. ఇది ప్రజలకు ఉండే సహజమైన పౌర స్వేచ్ఛలను చట్టబద్ధంగా అణచివేయడానికి సంకల్పించినది. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ముఖ్యుల సమావేశంలో సెంట్రల్ అసెంబ్లీలో బాంబుల దాడి గురించి సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. భగత్ సింగ్ అసెంబ్లీ హాలులో బాంబులు వేయటంలో పాల్గొనాలని మొదటి రోజు నిర్ణయంలో లేదు. సుఖదేవ్ దానిపై తిరిగి గట్టిగా చర్చించిన పిదప భగత్ సింగ్ పేరు ఖరారు అయింది. అప్పటికే కార్మిక నాయకులను, ముఖ్యంగా కమ్యూనిస్టు నాయకులను కాన్పూరు, మీరట్‌ కుట్ర కేసుల పేరుతో బ్రిటిష్ ప్రభుత్వం జైళ్లలో నిర్బంధించి కార్మిక ఉద్యమాన్ని అణచివేస్తున్న నేపథ్యంలో ఈ బాబుల దాడిని చూడాలి. వారు వెదజల్లిన ‘చెవిటి వారికి వినబడేటట్టు చేయాలంటే పెద్ద శబ్దాలు అవసరమవుతాయి’ అనే వాక్యంతో ప్రారంభమయే కరపత్రంలో పైన పేర్కొన్న చట్టాలను, కార్మిక నాయకుల అరెస్టుల గురించి ప్రస్తావించి ఉన్నారు. కరపత్రం చివర ‘విప్లవం వర్ధిల్లాలి!’ అనే నినాదం మాత్రమే ఉండినప్పటికీ, వారిరువురూ కార్మిక వర్గం వర్ధిల్లాలి! బ్రిటిష్ సామ్రాజ్యవాదం నశించాలి!! విప్లవం వర్ధిల్లాలి!!! అనే నినాదాలను తమ నోటి ద్వారా సెంట్రల్ అసెంబ్లీ గేలరీ నుండి వినిపించారు. అంతేకాకుండా ‘అందరికీ స్వేచ్ఛ నొసగే, ఒక మనిషిని మరొక మనిషి దోచుకునే అవకాశాన్ని అసాధ్యం చేయగల మహా విప్లవాల బలిపీఠంపై వ్యక్తుల త్యాగాలు అనివార్యం!’ అనేది ఆ కరపత్రంలోని చివరి వాక్యం. అసెంబ్లీలో బాంబుదాడుల కేసుపై ఢిల్లీ సెషన్స్ కోర్టులో 6 జూన్ 1929 నాడు, 13 జనవరి 1930న లాహోర్ హైకోర్టులో భగత్ సింగ్ చేసిన వాదనలు చాలా ముఖ్యమైనవి. ఆయన మాటల్లోనే... ‘విప్లవం నుంచి మేము ఆశించే ప్రయోజనం ఏమిటంటే ఎటువంటి ప్రమాదాలు లేని శ్రామిక వర్గ నియంత్రత్వానికి పట్టంగట్టే సామాజిక వ్యవస్థను స్థాపించటం! అప్పుడు పెట్టుబడిదారీ విధానపు బాధల నుంచి యుద్ధం వల్ల సంభవించే వినాశనాల నుంచి కష్టాల కడగళ్ల నుంచి విశ్వ సమాజాన్ని రక్షించుకోవచ్చు. ఇది మా ఆదర్శం. ఈ తాత్వికత నుంచి ప్రేరణ పొంది మేము దృఢమైన హెచ్చరిక చేశాం.’ భగత్ సింగ్ చేసిన లాహోర్ హైకోర్టు ప్రకటనను న్యాయ శాస్త్ర విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉంది. అలాగే, మార్చి 23 కేవలం ‘షహీద్ దివస్’గా మాత్రమే కాక లౌకికవాద సాంస్కృతిక ప్రతీకగా దేశమంతా చెప్పుకునే రోజుగా ఉండాలి.


నరేష్ తన వ్యాసంలో...‘తన కొడుకును కేసు నుంచి బయటపడేయడానికి భగత్‌సింగ్ తండ్రి చాలా ప్రయత్నించారు. అయితే తండ్రి ప్రయత్నాలను వారించిన భగత్‌ సింగ్‌ దానివల్ల ప్రయోజనం ఉండదని ఖండితంగా చెప్పాడు. మమ్మల్ని విడిచిపెట్టే ఉద్దేశం బ్రిటిష్ ప్రభుత్వానికి లేదు కాబట్టి దీనిపై దొంగ సాక్ష్యాలను సృష్టించి విచారణను వేగంగా పూర్తిచేయడానికి ఏర్పాటు చేస్తుందంటూ తెల్లదొరల అంతరంగాన్ని ముందే పసిగట్టి తండ్రికి తెలియజేశారు భగత్‌సింగ్.’ అని ఉంది. వాస్తవానికి భగత్ సింగ్ తండ్రికి రాసిన ఉత్తరంలో ‘సిద్ధాంతాలను బలిపెట్టే అంత విలువైనది కాదు నా జీవితం!’ ‘ఈ కేసులో ప్రతి పనీ ఒక (నిర్దుష్టమైన) ఎత్తుగడను అనుసరించి నడుచుకుంటూ వస్తున్నాం. నా ప్రతి పనీ ఆ ఎత్తుగడను అనుసరించి మా సిద్ధాంతాలకు మా కార్యక్రమాలకు అనుగుణంగా సాగాలి’ అంటాడు భగత్ సింగ్. తండ్రి చేసిన ప్రయత్నాన్ని భగత్ సింగ్ తీవ్రంగా అభిశంసించాడు. ‘మీకు బదులు మరొకరు ఎవరైనా ఇలా చేసి ఉంటే అతడిని నేను దేశద్రోహి కన్నా తక్కువగా భావించేవాడిని కాదు. అయితే మీపై ఇలాంటి పదప్రయోగం చేయలేను.’ అని భగత్ సింగ్ తన సిద్ధాంతాలకు ఏ మాత్రం భంగం కలగని రీతిలో ప్రవర్తించాడు.


తాము సాండర్స్‌ను హత్య చేయలేదని భగత్ సింగ్ బృందం కోర్టులో ఎప్పుడూ వాదించలేదు. బ్రిటీష్ రాజ్యపు బూటకపు విచారణ తంతును బహిర్గతం చేయడానికి భగత్ సింగ్ ప్రయత్నించాడే తప్ప వారి ముందు ఏ రూపంలోనూ లొంగడానికి పూనుకోలేదు. భగత్ సింగ్ తన తండ్రికి రాసిన ఉత్తరాన్ని, సావర్కర్‌ బ్రిటిష్ వారికి రాసి ఇచ్చిన లొంగుబాటు పత్రాలతో పోల్చి చూడడం కద్దు. తాను ఉరికంబం ఎక్కబోయే చివరి క్షణాలలో కూడా ‘లెనిన్ గురించి క్లారా జెట్కిన్ జ్ఞాపకాలు’ పుస్తకాన్ని చదువుతూ యువతరానికి లెనిన్‌ను అనుసరించమని భగత్ సింగ్ ఒక సందేశం అందించాడన్నది గమనించదగ్గ విషయం.

వ్యాస రచయిత నరేష్, భగత్ సింగ్ గురించిన వాస్తవాలు చెబుతున్నట్లే రాస్తూ కీలకమైన అంశాలను పాఠకుల దృష్టికి రానీయకుండా చేయడం వెనక అవగాహన సమస్యలు మాత్రమే ఉండి, దురుద్దేశాలు లేకుండా ఉంటే మంచిదే!

దివికుమార్

భగత్‌సింగ్‌పై ‘ఉరికంబం సాక్షిగా...’ పుస్తక రచయిత

ఈ వార్తలు కూడా చదవండి

Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా.. రావాల్సిందే అన్న పోలీసులు

Lokesh On Visakhapatnam: ఏపీ ఐకానిక్ క్యాపిటల్‌గా విశాఖ

Kethireddy: ప్రైవేట్ జెట్ నడిపిన కేతిరెడ్డి.. వీడియో వైరల్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 02:20 AM