Share News

జనగణనకు జై కొడదాం!

ABN , Publish Date - Apr 01 , 2025 | 02:26 AM

మన దేశంలో దశాబ్దానికి ఒకసారి జనగణన జరగడం సర్వసాధారణం. పరిపాలనా సౌలభ్యం, ఆర్థికాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వనరుల సమ పంపిణీ, దేశాభివృద్ధికి ప్రణాళిక రచించడం తదితర అంశాల దృష్ట్యా జనగణన ఎంతో ప్రాధాన్యం...

జనగణనకు జై కొడదాం!

మన దేశంలో దశాబ్దానికి ఒకసారి జనగణన జరగడం సర్వసాధారణం. పరిపాలనా సౌలభ్యం, ఆర్థికాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వనరుల సమ పంపిణీ, దేశాభివృద్ధికి ప్రణాళిక రచించడం తదితర అంశాల దృష్ట్యా జనగణన ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది. మన దేశంలో 2011లో చివరిసారిగా జనగణన జరిగింది. ఆ తర్వాత 2021లో జరగాల్సిన జనాభా లెక్కల ప్రక్రియ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తున్నది. దేశంలో పరిస్థితులు చక్కబడటంతో ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది మొదట్లో కచ్చితంగా జనగణన ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే, దేశ జనాభా లెక్కలపై ఒక స్పష్టత వస్తేనే డీ లిమిటేషన్‌తో పాటు మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు మార్గం సుగమం అవుతుంది. అయితే ఇప్పటికీ జనగణనపై ఎలాంటి ప్రకటన చేయలేదంటే కేంద్ర ప్రభుత్వానికే ఈ అంశంపై స్పష్టత లేదని మనకు అర్థమవుతున్నది.


దేశంలో జనగణనతో పాటు డీ లిమిటేషన్ ప్రక్రియలకు ఎంతో చరిత్ర ఉన్నది. ప్రతి పదేండ్లకోసారి జనగణన జరిగినట్టే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు నాలుగుసార్లు డీ లిమిటేషన్ ప్రక్రియ జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశంలో ఆసేతు హిమాచలం వరకు అన్ని ప్రాంతాలకు సమన్యాయం, సమ ప్రాతినిధ్యం కల్పించేందుకు, సమతుల్యత పాటించేందుకుగాను డీ లిమిటేషన్ ప్రక్రియను అమలుచేశారు. స్వాతంత్ర్యానంతరం 1951లో మొదటిసారి జనగణన ప్రక్రియ చేపట్టారు. ఆ మరుసటి ఏడాది 1952లో జస్టిస్ చంద్రశేఖర అయ్యర్ నేతృత్వంలో మొట్టమొదటి డీ లిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ సిఫారసుల ఆధారంగా 1952లో మొదటిసారిగా నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1961 జనాభా లెక్కల ఆధారంగా 1962లో రెండోసారి నియోజకవర్గాల పునర్విభజన చేశారు. ఈసారి 494 నియోజకవర్గాలను 522కు పెంచారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా పెంచారు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి ఏపీ ఏర్పడినాక జరిగిన మొదటి డీ లిమిటేషన్ ప్రక్రియ ఇదే కావడం గమనార్హం, అనంతరం 1971 జనగణన ఆధారంగా 1976లో మూడోసారి నియోజకవర్గాల పునర్విభజన చేశారు. జస్టిస్ జేఎల్ కపూర్ నేతృత్వంలోనే డీ లిమినేషన్ కమిషన్ సిఫారసు ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 522 నుంచి 543కు పెంచారు. అంతేకాదు, 2001 వరకు లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను యథాతథంగా ఉంచాలని 42వ రాజ్యాంగ సవరణ చేశారు. అప్పటికే 1971 జనగణన ఆధారంగా ఉత్తర, దక్షిణ రాష్ట్రాలలో జనాభా వ్యత్యాసాన్ని గ్రహించిన నాటి కేంద్ర ప్రభుత్వం కొన్నేండ్ల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని 42వ రాజ్యాంగ సవరణ చేసింది. పాతికేండ్ల తర్వాత 2001 జనాభా లెక్కల ఆధారంగా డీ లిమిటేషన్ చేపట్టారు. జస్టిస్ కుల్దీప్ సింగ్ కమిషన్ సిఫారసుల మేరకు లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను యథాతథంగానే ఉంచారు. దాంతోపాటు 2026 తర్వాత జరిగే మొదటి జనగణన ఆధారంగా మాత్రమే డీ లిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని 84వ రాజ్యాంగ సవరణ చేశారు.


ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనగణన చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుండటంతో సరికొత్త వివాదం రాజుకున్నది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీ లిమిటేషన్ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తుండటంతో దక్షిణాదిన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజా జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచితే దక్షిణాదికి భారీ నష్టం జరుగుతుందన్నది నూటికి నూరుపాళ్లు నిజం. జనాభా నియంత్రణను పాటించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు అమలు చేశాయి. గత రెండు దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయం సాధించగా, ఉత్తరాదిలో భారీగా జనాభా పెరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో నియోజకవర్గాల సంఖ్య చాలా తక్కువగా, ఉత్తరాదిలో భారీగా పెరిగే ఆస్కారం ఉన్నది. ఇదే జరిగితే జనాభా నియంత్రణను పాటిస్తూ, అభివృద్ధిలో దూసుకువెళ్తున్న దక్షిణాదికి అన్యాయం జరిగినట్టవుతుంది. పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గుతుంది. దక్షిణాది అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. తద్వారా ఢిల్లీలో మన వాణి వినిపించే అవకాశం లేకుండా పోతుంది. అందుకే, 1971 జనగణన ఆధారంగా ప్రస్తుతం కొనసాగుతున్న నిష్పత్తి ప్రకారమే ఆయా రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని వాదనలు వినిపిస్తున్నాయి.


దేశంలో ఇప్పటికీ 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే లోక్‌సభ నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. 2026 తర్వాత జరిగే జనగణన వరకు దీని పొడిగించారు. వాస్తవానికి 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం, 2026 తర్వాత జరిగే మొదటి జనగణన ఆధారంగా డీ లిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి. ఇప్పుడు జరుగబోయేది 2021 జనాభా లెక్కలు. అంటే రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు వీల్లేదు. అందుకు రాజ్యాంగం అనుమతించదు.

2026 తర్వాత జరుగబోయే జనగణన అంటే 2031 లెక్కల ప్రకారం పునర్విభజన జరగాల్సి ఉన్నది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగాల్సి ఉన్నది. అందుకు ముందుగా జనగణన జరగాలి. జనాభా లెక్కలు తీస్తేనే డీ లిమిటేషన్ అయినా, మహిళా రిజర్వేషన్లు అయినా అమలుకు ఆస్కారం ఉంటుంది. అందువల్ల రాజకీయ పార్టీలు, మేధావులు, ఆలోచనాపరులు తొలుత జనగణన జరపాలని డిమాండ్ చేయాలి. అలా చేస్తేనే రాజ్యాంగ సవరణ చేసి 2031కు ముందే డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను సులభంగా అమలు చేసుకోవచ్చు. ఇదంతా జరగాలంటే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 2025లో జనగణన మొదలుపెట్టి 2026లో ప్రకటించాల్సిందే. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం.

బోయినపల్లి వినోద్‌కుమార్

న్యాయవాది, పార్లమెంట్ మాజీ సభ్యులు

ఈ వార్తలు కూడా చదవండి

Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా.. రావాల్సిందే అన్న పోలీసులు

Lokesh On Visakhapatnam: ఏపీ ఐకానిక్ క్యాపిటల్‌గా విశాఖ

Kethireddy: ప్రైవేట్ జెట్ నడిపిన కేతిరెడ్డి.. వీడియో వైరల్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 02:26 AM