కొత్తరుచి దాని పేరు విశ్వావసు ప్రజాస్వామ్య ఉగాది
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:43 AM
ఉదయం ఏదో ఫోన్ రింగ్ అవుతుంది బంధువుకి ఒంట్లో బాగాలేదని సారాంశం హాస్పిటల్‌కి వెళ్లేసరికి అశ్రునివాళి వాట్సాప్‌లో దూరపు చుట్టాల పెళ్లి సందడికి తప్పక రమ్మని ఒక షార్ట్ వీడియో అన్న కొడుకు విదేశాల్లో పైచదువులకు...

కొత్తరుచి
తొలగిన మంచుతెరల్లోంచి మామిడాకుల గుబురుల్లో దాగిన ఓ పాత కోకిల మళ్లీ రాగాల్ని అందుకొంటోంది రాగం పాతదే గొంతు కొత్తగా వినబడుతోంది వగరు చేదుల ఆరు రుచుల సమ్మేళనం కొన్నేళ్లపాటు గొంతులో గరళమై దిగుతుంటే అలసిపోయిన కోయిల ఇప్పుడు చైత్రాన్ని కొత్త చిగుళ్ల తోరణాలతో స్వాగతిస్తోంది ఒక్కో ఇంటి తలుపును తడుతున్న వసంతం రేపటి భరోసాను పంచిపెడుతోంది బహుశా ఈ ఉగాది కొత్త రుచిని పందారం చేస్తున్నట్లుంది అడవులైన పొలాలు కాలువలై పారుతున్న నీళ్లు సరికొత్త దృశ్యాలుగా ఆవిష్కారమవుతున్నాయి ఈ ఉగాది మాట తప్పని చేతల్ని వాగ్దానం చేస్తోంది
బండ్ల మాధవరావు
దాని పేరు విశ్వావసు
ఉదయం ఏదో ఫోన్ రింగ్ అవుతుంది బంధువుకి ఒంట్లో బాగాలేదని సారాంశం హాస్పిటల్‌కి వెళ్లేసరికి అశ్రునివాళి వాట్సాప్‌లో దూరపు చుట్టాల పెళ్లి సందడికి తప్పక రమ్మని ఒక షార్ట్ వీడియో అన్న కొడుకు విదేశాల్లో పైచదువులకు ఏర్‌పోర్ట్‌లో ఫ్యామిలీ సెండ్‌ఆఫ్ ఫోటోలు సైకిల్ మీద కాలేజీకి కలిసి వచ్చిన శీనుగాడు ఇంటికొచ్చి కూతురికి మద్రాస్ ఐఐటీలో సీటు వచ్చిందని సంబరపడ్డాడు ముందే తెలుసుకున్నాడో ఏమో పట్టుబట్టి ఇంటికి తీసుకెళ్లి నా కష్టం కాస్తయినా తుడవాలని నవ్వులతో హత్తుకున్నాడు అంతే కదా జీవితం– నాలుగు నవ్వులు మూడు ఏడుపులు ఒక దిగులు అర మోతాదులో కోపం మరో అర మోతాదు భయం చిటికెడు ఉల్లాసం చిటికెడు ఉత్సాహం అచ్చం ఉగాదిలా అయితే ఈసారికి దాని పేరు విశ్వావసు!
బంగార్రాజు కంఠ
ప్రజాస్వామ్య ఉగాది
ఆకుపచ్చని కళన్ అలరారు ప్రతి చెట్టు కమ్ర భారత పతాకగ వెలుంగ అనఘ పంచాంగంబె అతిగౌరవార్హమౌ స్తవ్య రాజ్యాంగ గ్రంథంబె కాగ చిత్రముల్ ఋతువుల శిష్ట క్రమములెల్ల ఘనపాలనా విభాగాలు కాగ వికసిత భారత ప్రకట సంస్కృత సభల్ కేంద్ర శాసనసభా కేళి కాగ అళి పిక శుకమనోహర రూప చేష్టలే సరస పౌరాళి సంబరము కాగ ‘విశ్వ’మున కెల్ల ‘వసువౌ’చు శాశ్వతముగ భవ్యదివ్యంబు దారిదీపంబెయైన ప్రతి ఉగాది ప్రజాస్వామ్య ప్రభుతగాదె! సారపర్వయశశ్రీకి స్వాగతంబు
రామడుగు వేంకటేశ్వరశర్మ
పర్వగీతం
ఆమని రాసే కమ్మని కవిత అనంత కాలపు వసంత వేడుక మామిడికాయల మేలిమి మెటఫర్ వేపపూలను శృతి చేసే తేనెపలుకుల పాట సుర్రుమనే నాలుకపై సడిచేసే పచ్చడి కారం కొత్తికుండ బెల్లం ముక్కల్లో తీయతీయగా పలికే ప్రాస కోయిల పాటల కొసమెరుపుల్లో కొత్త చింతపండు కొసరు వలపు చిటికెడు ఉప్పు ఉతరేకించే రుచి వ్యాకరణపు జిహ్వభాష చిగురుటాశల అమరకోశం ఆరు రుచుల ఆమ్రేడితం ఉగాది.. ఏరువాకల భారతం మన తెలుగువారి పర్వగీతం!
కంచరాన భుజంగరావు
రెండు పండుగలు
రెండు మతాలు రెండు నేత్రాలై మానవత్వానికి ‘చూపు’నిస్తున్నాయి..! రెండు పండుగలు గుండె స్పందనలై ఏకత్వానికి ‘బ్రతుకు’నిస్తున్నాయి..! మామిడి తోరణాలు అత్తరు పరిమళాల మధ్య షీర్ ఖుర్మా పాయసాలు షడ్రుచుల భావనలు ఆవిష్కృతమవుతున్నాయి..! ఖర్జూర పండ్లు కోయిల రాగాల మధ్య పంచాంగ శ్రవణాలు నమాజులు మన విశ్వాసపు గీతాలై వినిపిస్తున్నాయి..! ఉపవాసాలు ఉగాది పచ్చడిల మధ్య మత సామరస్యపు ప్రతిబింబాలు కవుల కవితా గానాలు మనదేశ ఆదర్శాలై నడుస్తున్నాయి..! మనలోని ఐక్యత మనందరి సమగ్రత మేరా భారత్ మహాన్ అంటూ నింగిలోని మేఘాల మధ్య పిడుగుల గర్జనగా మన దేశం ప్రతిధ్వనిస్తుంది..!
ఫిజిక్స్ అరుణ్‌కుమార్
ఉగాది తల్లీ వందనం!
మామిడి కొమ్మ మీద కలమంత్ర పరాయణుడైన కోకిల స్వామి నీకు వందనమ్ము విశ్వసుందర పరమ పవిత్రమూర్తియైన విశ్వావసు నామ వత్సరంబునకు ఎదురువోయి స్వాగతంబిమ్ము గీతికా ప్రసవమొసగి! అరవదేడుల కాలచక్రభ్రమణమున మరల వచ్చెను విశ్వావసు నవోదయమై తెలుగు ప్రజలకు పర్వదినమై షడ్రసోపేత రుచులను పంచగ వచ్చెనమ్మా! నవ ఉగాది విశ్వావసువై! తెచ్చునేమో ప్రజల జీవితమున క్రొత్త మార్పులు! వచ్చునేమో! అభ్యుదయ పరంపరలు! జాతి జనుల జీవితమ్మున స్నేహ వాత్సల్య ప్రేమ మధురిమలు వెల్లివిరియగ వచ్చెనమ్మా! నవ ఉగాది! తెచ్చెనమ్మా క్రొత్త శోభలు! నవ ఉగాది! ఆయురారోగ్య సంభరితమై హృదయములానంద భరితము కాగ అక్షరాక్షతల తోడ దీవించును గాక! విశ్వావసు! వందనమమ్మా వందనమ్ము ఉగాది తల్లీ! విశ్వావసుకు వందనమ్ము!
ఆచార్య కె. యాదగిరి
ఈ వార్తలు కూడా చదవండి
AP News: కొలిక్కి రాని కొలికపూడి ఇష్యూ.. తిరువూరులో ఉత్కంఠ..
Good News To Youth: ఉద్యోగాల పండగ.. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం గుడ్‌న్యూస్
CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...
For More AP News and Telugu News