Share News

నినాదాలపై నిషేధమా?

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:53 AM

వందేమాతర ఉద్యమ కాలం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు తెలుగు నేల మీద ఏ ఉద్యమం జరిగినా ఆ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. ఓయూ లేనిదే తెలంగాణ ఉద్యమమే లేదు...

నినాదాలపై నిషేధమా?

వందేమాతర ఉద్యమ కాలం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు తెలుగు నేల మీద ఏ ఉద్యమం జరిగినా ఆ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. ఓయూ లేనిదే తెలంగాణ ఉద్యమమే లేదు. తెలంగాణ ఉద్యమానికి తొలి నిప్పుకణం అంటుకుంది ఇక్కడే. 107 ఏళ్ల మహోన్నత చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ దేశంలోనే మూడో పురాతన విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందింది. జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లోనూ ఉత్తమంగా నిలుస్తోంది. ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయం వంటి విలువలను ఇక్కడి విద్యార్థులు అలవరచుకున్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి, దేశానికి నాయకత్వాన్ని అందించిన ఘనత ఓయూది. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది తర్వాతికాలంలో మేధావులుగా, శాస్త్రవేత్తలుగా, న్యాయవాదులుగా, రచయితలుగా, ఉద్యమకారులుగా ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేశారు. విద్యార్థులు చదువుకోవడమే కాదు సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించే ధైర్యాన్ని వారికి ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ విశ్వవిద్యాలయం తరం తర్వాత తరానికి సామాజిక స్పృహను, న్యాయమైన గొంతును అందించింది. భారత రాజ్యాంగం కల్పించిన భావప్రకటన (ఆర్టికల్ 19(1)(A)) స్వేచ్ఛ పరిధి మేరకు దేశంలో ఎక్కడైనా నిరసనలు తెలియజేసే హక్కు పౌరులకు ఉంది.


అందుకు ఉస్మానియా యూనివర్సిటీ అతీతమేమీ కాదు. క్యాంపస్‌లో నిరసనలు, ధర్నాలను నిషేధించిన మాత్రాన విద్యార్థులు మౌనంగా ఉంటారనుకుంటే పొరపాటే. నాడైనా.. నేడైనా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది ధిక్కార స్వరమే. ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణే తన ఏడో హామీగా చెప్పి, అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ హామీని మరిచి ఉద్యమాల ఉస్మానియా గొంతు నొక్కడం ఏ విలువలకు నిదర్శనమో సమాధానం చెప్పాలి. క్యాంపస్‌లో, వరండాల్లో, చాంబర్లలో నిరసన తెలిపే హక్కును నిషేధించిన పాలకులు.. తరగతి గదిలో గురువులను ప్రశ్నలడిగితే కూడా నేరమే అనే ఉత్తర్వులు రావడమే ఇక మిగిలి ఉంది. ఈ పరిస్థితి రాకముందే విద్యార్థులు మేల్కొనాలి.

రాజేష్ నాయక్. జి

బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి (ఓయూ)

ఇవి కూడా చదవండి:

తృటిలో తప్పిన ప్రమాదం

Revanth Reddy: డిన్నర్‌కి పిలిచి AK47తో లేపేశాడు.. కేటీఆర్‌పై సీఎం సెటైర్లు..

Bhuma Akhila Priya: సాక్షి ఆఫీసు వద్ద భూమా అఖిలప్రియ ధర్నా

Updated Date - Mar 28 , 2025 | 01:54 AM