Share News

JNTU: జేఎన్‌టీయూలో భారీగా బదిలీలు..

ABN , Publish Date - Feb 12 , 2025 | 07:47 AM

జేఎన్‌టీయూ(JNTU)లో పలువురు అధికారులు, ఆచార్యులను బదిలీ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ ఎం.పద్మావతిని బ్యూరో ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌(బిక్స్‌) డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు.

JNTU: జేఎన్‌టీయూలో భారీగా బదిలీలు..

- కీలక స్థానాల్లో జగిత్యాల జేఎన్‌టీయూ ప్రొఫెసర్లు

- ఆపద్ధర్మ పదవుల్లో ముగ్గురు ఆచార్యులను కొనసాగిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)లో పలువురు అధికారులు, ఆచార్యులను బదిలీ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ ఎం.పద్మావతిని బ్యూరో ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌(బిక్స్‌) డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు. ఆ స్థానంలో ఉన్న అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శ్రీలక్ష్మిని క్యాంపస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి బదిలీ చేశారు. జగిత్యాల జేఎన్‌టీయూ కాలేజీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ విజయకుమార్‌ను సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ కాలేజీకి, అక్కడి ఫిజిక్స్‌ విభాగాధిపతి సురేష్‌శ్రీపాదను జగిత్యాలకు బదిలీ చేశారు. జగిత్యాలలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న బేబీశాలినిని డిప్యుటేషన్‌పై సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ కాలేజీకి పంపారు.

ఈ వార్తను కూడా చదవండి: Pushpak Buses: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు పుష్పక్‌ బస్సులు..


జగిత్యాల ప్రొఫెసర్లకు రెడ్‌కార్పెట్‌..

జగిత్యాల జేఎన్‌టీయూ కాలేజీ నుంచి హైదరాబాద్‌ క్యాంప్‌సకు డిప్యుటేషన్ల వరద కొనసాగుతోంది. ఇప్పటికే జగిత్యాల కాలేజీ నుంచి సుమారు 30 మంది ప్రొఫెసర్లు హైదరాబాద్‌ క్యాంప్‌సలో డిప్యుటేషన్‌పై కొనసాగుతుండగా, తాజాగా అదే కాలేజీకి చెందిన మరో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ వసంత్‌ కుమార్‌ హైదరాబాద్‌ కాలేజీకి డిప్యుటేషన్‌పై వచ్చారు. అయితే.. క్యాంప్‌సలో ఉన్న ప్రొఫెసర్ల కంటే జగిత్యాల నుంచి వచ్చిన ప్రొఫెసర్లకు వర్సిటీ ఉన్నతాధికారులు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


క్యాంప్‌సలో విద్యార్థులకు బోధన కోసం కాకుండా.. కీలకమైన స్థానాల్లోపోస్టింగ్‌లు/పదవుల కోసమే జగిత్యాల నుంచి ప్రొఫెసర్లు డిప్యుటేషన్‌పై వస్తుండడాన్ని విద్యార్థి సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. హైదరాబాద్‌ క్యాంపస్‌ కాలేజీకి డిప్యుటేషన్‌పై వస్తున్న జగిత్యాల ప్రొఫెసర్లకు డిప్యుటేషన్‌ ఆర్డర్‌తో పాటు పరీక్షల విభాగంలో కంట్రోలర్‌గానో, డైరెక్టరేట్లలో డైరెక్టర్‌ లేదా డిప్యూటీ డైరెక్టర్‌గానో నేరుగా పోస్టింగ్‌లు ఇస్తుండడంపై యూనివర్సిటీ వర్గాల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పరీక్షల విభాగంలో ఏడుగురు అదనపు కంట్రోలర్లు ఉండగా, ఐదుగురు జగిత్యాల కాలేజీ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ప్రొఫెసర్లే కావడం గమనార్హం.


ఆపద్ధర్మ పదవుల్లో ఆచార్యులు..

యూనివర్సిటీలో కీలకమైన పదవుల్లో ఉన్న ఆచార్యుల పదవీకాలం ముగిసినప్పటికీ.. వారిని ఆయా పదవుల్లోనే ఆపద్ధర్మంగా కొనసాగిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేయడం యూనివర్సిటీ ఉద్యోగులను, అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. క్యాంపస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పదవీకాలం ఈనెల 7తో ముగియగా, తదుపరి అరేంజ్‌మెంట్‌ చేసే వరకు కొనసాగాలని తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిసింది.


మాజీ వైస్‌చాన్స్‌లర్‌ హయాంలో ఏడాది కాలానికి నియమితులైన పరీక్షల విభాగం డైరెక్టర్‌, అకాడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ విషయంలోనూ యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేశారని తెలిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్సిటీ ఉన్నతాధికారులు ఆపద్ధర్మంగా వ్యవహరించడం డైరెక్టర్లలోనూ, కిందిస్థాయి సిబ్బందిలోనూ సందేహాలకు కారణమవుతోంది. సదరు అధికారుల సేవలు వర్సిటీకి అవసరమని భావిస్తే మరో ఏడాది పొడిగించాల్సింది పోయి.. అయోమయంగా ఉత్తర్వులు జారీ చేయడం సమంజసంగా లేదని సిబ్బంది వాపోతున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Congress: మంత్రివర్గ విస్తరణపై కదలిక

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి

ఈవార్తను కూడా చదవండి: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 12 , 2025 | 07:48 AM