Health Tips : డిప్రెషన్‌ను జయించేందుకు.. సులువైన మార్గమిదే..
ABN , Publish Date - Jan 07 , 2025 | 01:18 PM
మనసుకు బాధ కలిగినా భావోద్వోగాలు దాచుకుంటూ పోతే డిప్రెషన్ బారిన పడతారు. ఒక్కసారి ఈ సమస్యలో చిక్కుకుంటే బయటపడటం అంత సులభం కాదు. తాజా పరిశోధన ప్రకారం డిప్రెషన్‌ను జయించేందుకు.. సులువైన మార్గమిదే..
మనసుకు బాధ కలిగినా భావోద్వోగాలు అణిచిపెట్టుకోవటం అందరూ చేసేదే. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, భయపట్టే సంఘటనలు, ఇతరులతో పంచుకోలేని ఇబ్బందులు..ఇలా ఏదైనా కావచ్చు. ఇవన్నీ అలానే దాచుకుంటూ పోతే డిప్రెషన్ బారిన పడతారు. ఒక్కసారి ఈ సమస్యలో చిక్కుకుంటే బయటపడటం అంత సులభం కాదు. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించే ముఖ్య కారణాల్లో ఒకటి డిప్రెషన్. మనసులో మొలకెత్తే ఈ సమస్య తర్వాత శరీరంలోని అణువణువునూ ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దీని వల్ల మానసికంగా కుంగుబాటుకు గురయ్యి అనారోగ్యం పాలవుతున్నారు. నలుగురిలో కలవలేక, బయటపడలేక లోలోపలే కుమిలిపోతూ సమస్యను తీవ్రం చేసుకుంటున్నారు. తాజా పరిశోధన ప్రకారం కొన్ని రకాల పండ్లు, కూరగాయలు రోజువారీ ఆహారంలో భాగం డిప్రెషన్ సమస్య నుంచి బయటపడవచ్చని రుజువైంది. మానసిక రుగ్మతలతో బాధపడేవారికి ఇది ఉపశమనం కలిగించే వార్తే.
డిప్రెషన్‌ను ఓడించాలంటే ముందుగా విచారాలన్ని పక్కనపెట్టి తినే ఆహారాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకోండి. అప్పుడు మానసిక ప్రశాంతత పొందేందుకు రిహాబిలిటేషన్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పనుండదు. ఎందుకంటే, ఆహారంలో తగిన మొత్తంలో పండ్లు, కూరగాయలను చేర్చుకునే వ్యక్తుల్లో డిప్రెషన్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. బ్రిటన్‌లో నిర్వహించిన పరిశోధనలో 18 - 60 సంవత్సరాల వయస్సు గల 5,000 మందికి పై అధ్యయనం చేసి ఈ విషయం కనుగొన్నారు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, పండ్లు, కూరగాయలలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు ఒత్తిడిని తగ్గించడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మనస్సును ప్రశాంతంగా చేసి డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తాయి.
ఏ పండ్లు తినాలి?
అరటిపండు: ఇందులో ఉండే ట్రిప్టోఫాన్, విటమిన్ బి-6 మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
బ్లూబెర్రీ: యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పండు ఒత్తిడిని తగ్గిస్తుంది.
నారింజ, కాలానుగుణంగా లభించే పండ్లు: విటమిన్ సి ఉన్న పండ్లు మనస్సును ప్రశాంతపరచడంలో ముందుంటాయి.
కూరగాయలు:
పాలకూర: ఐరన్, ఫోలేట్ సమృద్ధిగా ఉండే ఈ ఆకుకూర మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బ్రకోలీ: ఒత్తిడిని తగ్గించే సల్ఫోరాఫేన్ అనే మూలకం ఇందులో ఉంటుంది.
క్యారెట్: ఇందులోని బీటా కెరోటిన్ మెదడుకు విశ్రాంతినిస్తుంది.
డైట్‌లో మార్పుతో డిప్రెషన్‌కు చికిత్స:
మెడిసిన్, థెరపీతో పాటు డైట్‌పై కూడా శ్రద్ధ వహిస్తే డిప్రెషన్‌తో పోరాడటం సులభం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించి పండ్లు, కూరగాయలు అధికంగా ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో సెరోటోనిన్ స్థాయి పెరుగుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇవి శరీరంతో పాటు మనసునూ ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లయితే, ఈ రోజు నుంచే మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను చేర్చుకోండి. సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించండి.