Share News

Donald Trump : ట్రంప్‌ విస్తరణ కాంక్ష!

ABN , Publish Date - Jan 09 , 2025 | 05:42 AM

అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ భూవిస్తరణ కాంక్షతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా పేర్కొంటూ ఆ దేశంపై తమ జెండా ఎగురుతున్న మ్యాపుల ఫొటోలను షేర్‌ చేయడం, డెన్మార్క్‌ స్వయం

Donald Trump : ట్రంప్‌ విస్తరణ కాంక్ష!
Donald Trump

  • కెనడా, గ్రీన్‌ల్యాండ్‌, పనామా కాలువను అమెరికాలో విలీనం చేసుకుంటామని ప్రకటన

  • మెక్సికోపైనా తెంపరితనం..

  • మండిపడ్డ ఫ్రాన్స్‌, పనామా

  • కెనడా ఎన్నటికీ విలీనం కాదు: ట్రూడో

వాషింగ్టన్‌, జనవరి 8: అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ భూవిస్తరణ కాంక్షతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా పేర్కొంటూ ఆ దేశంపై తమ జెండా ఎగురుతున్న మ్యాపుల ఫొటోలను షేర్‌ చేయడం, డెన్మార్క్‌ స్వయం ప్రతిపత్తి ప్రదేశమైన గ్రీన్‌ల్యాండ్‌, పనామా కాలువను విలీనం చేసుకుంటామని పేర్కొనడం, గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోను ‘గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా’గా మారుస్తానని చెబుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఆయా దేశాలు తీవ్రస్థాయిలో మండిపడగా.. అగ్రరాజ్యాల మధ్య చిచ్చు మొదలవుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. ఎన్నడూ తలపడని అగ్రదేశాల మధ్య ఇప్పుడు మాటల ఉద్రిక్తత మొదలవుతోందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. నాటోలో భాగస్వామ్య దేశాలే.. ట్రంప్‌ వ్యాఖ్యలపై మండిపడడం పరిస్థితుల్లో తీవ్రతకు నిదర్శనమని చెబుతున్నారు. ట్రంప్‌ మంగళవారం తన మారి-ఎ-లాగో ఎస్టేట్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కెనడా, మెక్సికో, గ్రీన్‌ల్యాండ్‌(డెన్మార్క్‌), పనామాలపై మాట్లాడారు. సైనిక శక్తిని ఉపయోగించి విలీనం చేస్తారా? అని విలేకరులు అడగ్గా.. ‘‘లేదు..! ఆర్థిక శక్తిని వాడుతాను’’ అని స్పష్టం చేస్తూనే.. పనామా కాలువ, గ్రీన్‌ల్యాండ్‌ విలీనంపై సైనిక, ఆర్థిక శక్తిని వినియోగించనని హామీ ఇవ్వలేనన్నారు. పనామా కాలువను సైనిక అవసరాల కోసం అమెరికా నిర్మించినట్లు వ్యాఖ్యానించారు.

కెనడాపై మరింత కఠినంగా..

ట్రంప్‌ గతంలో కెనడాతో ఎలాంటి సత్సంబంధాలను కొనసాగించలేదు. 2016 ఎన్నికల సమయంలోనే.. కెనడా-అమెరికా మధ్య గోడ కడతా అని ప్రకటించారు. ఇప్పుడు ఆ దేశంపై ఆర్థిక యుద్ధాన్ని ఇప్పటికే ప్రారంభించారు. కెనడా నుంచి జరిగే దిగుమతులపై 25ు టారిఫ్‌ విధిస్తానన్నారు. నిజానికి కెనడాకు అమెరికా అతిపెద్ద వినియోగదారు. అమెరికాకు సహజవాయువులు, ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌ను కెనడా ఎగుమతి చేస్తుంది. వీటిపై 25ు టారిఫ్‌ విధించడం కెనడాకు శరాఘాతంలాంటిదేనని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే.. ట్రంప్‌ విలీనంపై కీలక వ్యాఖ్యల ఉధృతిని పెంచారు. ‘‘కెనడాలో మెజారిటీ ప్రజలకు అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండడమే ఇష్టం. అమెరికాలో విలీనమైతే.. సుంకాలు, పన్నులు ఉండవు. పైగా.. నిరంతరం చుట్టూ కాచుక్కూర్చునే రష్యా, చైనా నుంచి అమెరికా మాత్రమే రక్షణ కల్పించగలదు’’ అన్నారు. అమెరికాలో కెనడా విలీనమైనట్లుగా ఓ మ్యాప్‌ను ఆయన తన పోస్టుకు జత చేశారు. ఇటీవల ట్రూడోను కలిసిన ట్రంప్‌.. ‘‘కెనడా గవర్నర్‌తో భేటీ అయ్యాను’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..! తాజాగా విలేకరుల సమావేశంలో.. కెనడాను విలీనం చేసుకుంటామని పునరుద్ఘాటించారు.ఈ వ్యాఖ్యలపై ట్రూడో తీవ్రంగా స్పందించారు. అమెరికాలో కెనడా విలీనమయ్యే ప్రసక్తే లేదని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఐరోపా జోలికొస్తే సహించేది లేదు: ఫ్రాన్స్‌

ట్రంప్‌ తాజా వ్యాఖ్యలతో ఐరోపా సమాఖ్య అప్రమత్తమైంది. తమ జోలికి ఎవరొచ్చినా సహించబోమని ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జీ-నోయల్‌ బారో తేల్చిచెప్పారు. ఫ్రాన్స్‌ ఇంటర్‌ రేడియో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐరోపా దేశాల సరిహద్దుల సార్వభౌమత్వాన్ని ఎవరు ఉల్లంఘించినా.. ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తూ.. ‘‘మాది బలమైన ఖండం. డెన్మార్క్‌లో 600 ఏళ్ల నుంచి భాగమైన గ్రీన్‌ల్యాండ్‌ను.. పనామా కాలువను అమెరికా ఆక్రమించుకొంటుందంటే నేను విశ్వసించను’’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై పనామా విదేశాంగ మంత్రి జావిర్‌ మార్టినేజ్‌ స్పందించారు. పనామా కాల్వను తమ దేశం మాత్రమే నియంత్రించగలదని.. భవిష్యత్‌లో కూడా అదే కొనసాగుతుందని స్పష్టంచేశారు. గ్రీన్‌ల్యాండ్‌ ప్రధాని మెటే ప్రెడెరిక్సన్‌ మాట్లాడుతూ.. అమెరికా-గ్రీన్‌ల్యాండ్‌ మధ్య ఆర్థిక యుద్ధాలు తగదని హితవు పలికారు. కాగా.. ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ ప్రస్తుతం గ్రీన్‌ల్యాండ్‌ పర్యటనలో ఉండటం గమనార్హం..!

హమా్‌సకు ట్రంప్‌ వార్నింగ్‌

ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరుపైనా ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించేలోపు.. హమాస్‌ తన చెరలో ఉన్న బందీ లను విడుదల చేయాలని తేల్చిచెప్పారు. లేనిపక్షంలో హమా్‌సకు నరకం చూపిస్తామని, చరిత్రలో ఎన్న డూ చూడని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

ప్రపంచయుద్ధానికి సంకేతమా?

ట్రంప్‌ వ్యాఖ్యలు, ఆయా దేశాల ప్రతిస్పందనలతో అమెరికా-ఐరోపా మధ్య దూరం పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే.. మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదాలు లేకపోలేదని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రష్యా నుంచి వలస వచ్చిన గోంబర్గ్‌ అనే యూదు జాతీయుడు ‘ఔట్‌లైన్‌ ఆఫ్‌ పోస్ట్‌వార్‌ న్యూ వరల్డ్‌ మ్యాప్‌’ పేరుతో 1942 ఫిబ్రవరి 25న ఓ పటాన్ని చిత్రీకరించారు. తర్వాతి కాలంలో ఇది పాపులర్‌ కావడం విశేషం..! ఈ మ్యాప్‌లో కెనెడా, మెక్సికో, గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాలో ఓ భాగంగా పేర్కొన్నారు. తాజాగా ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలు ఈ మ్యాప్‌నకు అనుగుణంగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.


గ్రీన్‌ల్యాండ్‌ ఎందుకు?

డెన్మార్క్‌లో స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికాకు చెందిన భారీ అంతరిక్ష కేంద్రం(తులె ఎయిర్‌బేస్‌) ఉంది. గ్రీన్‌ల్యాండ్‌ మీదుగానే ఉత్తర అమెరికా నుంచి ఐరోపాకు వెళ్లడం దగ్గరిదారిగా చెబుతారు. ఈ ద్వీపంలో అత్యధిక స్థాయిలో ఖనిజ సంపద, చమురు నిల్వలున్నాయి. గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా కన్నేయడం ఇది మొదటిసారి కాదు. 1860ల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ కూడా గ్రీన్‌ల్యాండ్‌పై పేచీపెట్టారు. ట్రంప్‌ కూడా 2019లో గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు అమ్మేయాలంటూ ఆఫరిచ్చారు. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో కూడా భారీ ఎత్తున పెట్రోలియం నిక్షేపాలున్నాయి. పెట్రోలియం వనరులున్న జలభాగాల్లో ఇది ప్రపంచంలోనే 9వ అతి పెద్దది.

Updated Date - Jan 09 , 2025 | 08:07 AM