Democracy in Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజాస్వామ్యం కథ ముగిసింది: తాలిబాన్లు
ABN , Publish Date - Mar 30 , 2025 | 09:42 PM
తమ దేశంలో ప్రజాస్వామ్యం కథ ముగిసిందని తాలిబాన్ల అధినేత అఖుంజాదా తాజాగా పేర్కొన్నారు. తమకు పాశ్చాత్య దేశాల చట్టాలు అవసరం లేదని తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజాస్వామ్యం స్థానంలో షరియా చట్టం అమలవుతోందని తాలిబాన్ అధినేత హిబతుల్లా అఖున్‌జాదా ఆదివారం పేర్కొన్నారు. ఫలితంగా తమకు పాశ్చాత్య చట్టాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. కాందహార్‌లో 50 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆయన ఈ విషయాలను వెల్లడించారు. తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఈ వీడియోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
Also Read: ఉప్పు నీటిలో కరిగే ప్లాస్టిక్ తయారీ
‘‘పాశ్చాత్య ప్రపంచంలో పుట్టిన చట్టాలు మాకు అవసరం లేదు. మా చట్టాలను మేము రూపొందించుకుంటాము. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజాస్వామ్యం కథ ముగిసింది. షరియా అమల్లో ఉంది’’ అని అఖుంజాదా పేర్కొన్నారు. తాలిబన్లకు, ఆఫ్ఘన్ ప్రజలకు మధ్య అంతరం సృష్టించేందుకు ప్రజాస్వామ్యవాదులు ప్రయత్ని్స్తున్నారని కూడా ఆరోపించారు. పాశ్చాత్యదేశాలన్నీ ముస్లింలకు వ్యతిరేకంగా ఏకమవుతున్నాయని మండిపడ్డారు.
తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం కఠిన షరియా చట్టం అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ చట్టాల ప్రకారం, ఆప్ఘాన్ బాలికలు చదువు, ఉద్యోగాలకు దూరమయ్యారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో కూడా తిరగకుండా నిషేధం విధించారు. ఈ చట్టాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, దౌత్యపరంగా ఆఫ్ఘనిస్థాన్ ఒంటరిగా మారింది. అయితే, చైనా, యూఏఈ లాంటి దేశాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని తాలిబాన్లు చెబుతున్నారు.
Also Read: 500 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష
తాలిబాన్ల ప్రభుత్వానికి ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేకపోయినప్పటికీ అంతర్గతంగా నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాలిబాన్ల అధికారం మొత్తం అఖుంజాదా చేతుల్లో కేంద్రీకృతం కావడంపై కొందరు నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. విస్తృత చర్చల ద్వారానే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Latest and International News