Share News

Trump Tariff War: మినహాయింపుల్లేవ్‌

ABN , Publish Date - Apr 02 , 2025 | 03:58 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. భారత్, జపాన్, కెనడా, ఈయూ వంటి దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ఆయన పేర్కొన్నారు

Trump Tariff War: మినహాయింపుల్లేవ్‌

ప్రతీకార సుంకాలకు వేళయింది.. అన్ని దేశాలపైనా విధిస్తాం

అధ్యక్షుడు ట్రంప్‌ దీనిపై నేడు ఒక ప్రకటన చేస్తారు

మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ 100 శాతం సుంకాలు

కెనడా, జపాన్‌, ఈయూ దేశాలూ భారీగా విధిస్తున్నాయ్‌

తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ

నా వ్యూహం సరైనదే.. సుంకాన్ని ఈయూ 2.5% తగ్గించింది

భారత్‌ కూడా సిద్ధమైంది.. మరిన్ని దేశాలూ అదే దారిలో: ట్రంప్‌

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 1: తమ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్న అన్ని దేశాలపైనా ప్రతీకార సుంకాల విధింపునకు సమయం ఆసన్నమైందని.. ఈ విషయంలో తగ్గేదే లేదని, ఏ దేశానికీ మినహాయింపులు ఇచ్చే ప్రసక్తే లేదని అమెరికా తేల్చిచెప్పింది. ‘‘అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ 100 శాతం, పాల ఉత్పత్తులపై ఈయూ దేశాలు 50 శాతం, బియ్యంపై జపాన్‌ 700 శాతం, వెన్న, చీజ్‌పై కెనడా 300 శాతం చొప్పున సుంకాలను విధిస్తున్నాయి’’ అంటూ కొన్ని దేశాల పేర్లు చెప్పి మరీ వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కారొలిన్‌ లెవిట్‌ అత్యంత తీవ్రమైన పదజాలంతో ధ్వజమెత్తారు. ఇవే కాక ఇంకా చాలా దేశాలు తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం ద్వారా అనుచిత వాణిజ్య విధానాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అధిక సుంకాల కారణంగా ఆయా మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తుల దిగుమతి అసాధ్యంగా మారిందని.. దీనివల్ల కొన్ని దశాబ్దాలుగా ఎంతో మంది అమెరికన్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో.. ఇకపై ఆయా దేశాలపై రంగాల ఆధారిత సుంకాలు విధిస్తామని ఆమె తేల్చిచెప్పారు.


gfgd.jpg

‘‘దురదృష్టవశాత్తూ ఈ దేశాలన్నీ చాలాకాలంగా మా దేశాన్ని దోచుకుంటున్నాయి. ట్రంప్‌ విధించే కొత్త సుంకాలు అమెరికా వాణిజ్య బంధాల్లో చరిత్రాత్మక మార్పు తెస్తాయి.’’ అని కారొలిన్‌ పేర్కొన్నారు. ప్రతీకార సుంకాల అమలు నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు అధ్యక్షుడు (ట్రంప్‌) స్పష్టం చేశారని.. దీనిపై బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తారని ఆమె వెల్లడించారు. అయితే, ఈ తరహా దూకుడు విధానం అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ట్రంప్‌ విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీకార సుంకాలకు సంబంధించి ‘విమోచన దినం’ పేరిట తాను విధించిన డెడ్‌లైన్‌ (ఏప్రిల్‌ 2) సమీపిస్తుండడంతో.. భారతదేశం కొన్ని సుంకాలను గణనీయంగా తగ్గించేందుకు సిద్ధమైందని ట్రంప్‌ మంగళవారం పేర్కొన్నారు. తాను విధించే ప్రతీకార సుంకాలు.. అమెరికా మిత్రపక్షాలను చైనాకు దగ్గర చేసే అవకాశం ఉందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. తాను అనుసరిస్తున్న వ్యూహంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని.. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లపై సుంకాన్ని 2.5 శాతం మేర తగ్గిస్తూ యూరోపియన్‌ యూనియన్‌ ఇటీవలే తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో నడవబోతున్నాయని ట్రంప్‌ అన్నారు.


fdg.jpg

ట్రేడ్‌ బారియర్స్‌ నివేదిక..

ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులను నిరుత్సాహపరిచేలా పలు దేశాలు అనుసరిస్తున్న పన్ను, పన్నేతర విధానాలు, విధిస్తున్న నియమనిబంధనల జాబితాతో కూడిన 397 పేజీల నివేదికను ట్రంప్‌ సర్కారు విడుదల చేసింది. ‘2025 నేషనల్‌ ట్రేడ్‌ ఎస్టిమేట్‌ రిపోర్ట్‌ ఆన్‌ ఫారిన్‌ ట్రేడ్‌ బారియర్స్‌’ పేరిట రూపొందించిన ఈ నివేదిక ప్రకారం..అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ ఉంది. కొన్నిరకాల మద్యాలు, వాల్‌నట్స్‌ తదితరాలపై భారత్‌ 100-150ు సుంకాలు విధిస్తున్నట్టు అందులో వెల్లడించారు. అర్జెంటీనా, మెక్సికో, తదితర దేశాలు విధిస్తున్న విలువ ఆధారిత పన్నులు అమెరికా దిగుమతులకు భారంగా మారాయని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

Donald Trump: భారత ఉత్పత్తులకు అమెరికాలో వాత..చుక్క, ముక్కపై ట్రంప్ ఫోకస్..

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..


New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక


Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..

Updated Date - Apr 02 , 2025 | 03:58 AM