Ahmedabad PCR cops sleeping: కూతవేటు దూరంలో హత్య జరుగుతున్నా పోలీసుల నిద్ర.. వీడియో వైరల్
ABN , Publish Date - Mar 26 , 2025 | 09:05 AM
కూతవేటు దూరంలో హత్య జరుగుతున్నా పట్టించుకోకుండా పెట్రోలింగ్ పోలీసులు రోడ్డుపై నిద్రించిన షాకింగ్ ఘటన గుజరాత్‌లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: శాంతిభద్రతలను కాపాడటం, ప్రజల మానప్రాణాలకు రక్షణగా ఉండటం పోలీసుల ప్రథమ కర్తవ్యం. ఇక పెట్రోలింగ్ విధుల్లో ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ కొందరు పోలీసులు ఇవేమీ పట్టించుకోలేదు. కూత వేటు దూరంలో హత్య జరుగుతున్నా తెలీనంత స్థాయిలో రోడ్డు మీదే కునుకు తీశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
సోమవారం రాత్రి నగరంలో ఈ షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు యువకులపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే కుప్పకూలి మరణించగా రెండో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటన చూసి స్థానికులు అప్రమత్తమయ్యారు. అయితే, అక్కడికి కూత వేటు దూరంలోనే ఓ పోలీసు వాహనం కూడా కనిపించింది.
Also Read: ఫిరాయింపులపై గత తీర్పులను ఎలా మార్చగలం.. సుప్రీం కోర్టు ప్రశ్న
అక్కడికి వెళ్లి చూసి స్థానికులు షాకైపోయారు. ఓవైపు హత్య జరుగుతున్నా లెక్కచేయక పోలీసులు తమ వాహనం పక్కన హ్యాపీగా నిద్రించడం చూసి కంగుతిన్నారు. కొందరు ఈ దృశ్యాలను చిత్రీకరించి నెట్టింట పెట్టడంతో కలకలం రేగింది. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వీడియో వైరల్ కావడంతో అహ్మదాబాద్ పోలీసులు కూడా స్పందించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు ప్రారంభించామని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
బాధితులను విజయ్, ప్రియేష్‌గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రాత్రి వారికి మరో ఆరుగురు వ్యక్తులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో జైసింగ్ సోలంకీ అనే వ్యక్తి విజయ్‌ని ఛాతిలో పొడిచాడు. దీంతో, అతడు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. విజయ్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన ప్రియేష్‌కు కూడా త్రీవ గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణానికి పాల్పడ్డ ఆరుగురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఈ ఉదంతం స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది.