Viral Video: గర్ల్స్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. భయానక దృశ్యాలు..
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:24 PM
హాస్టల్ మంటల్లో కాలిపోతోందని తెలియగానే అమ్మాయిలంతా భయపడిపోయారు. ఏం చేయాలో తెలియలేదు. కొంతమంది బాల్కనీ దగ్గరకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే నిచ్చెన మీదనుంచి కిందకు దిగే ప్రయత్నం చేశారు.

గ్రేటర్ నోయిడాలోని ఓ గర్ల్స్ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కొంతమంది అమ్మాయిలు తమ ప్రాణాలకు తెగించారు. బాల్కనీ నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశారు. పాపం.. ఓ అమ్మాయి కిందకు దిగే ప్రయత్నంలో కిందపడిపోయింది. గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ 3లో అన్న పూర్ణ గర్ల్స్ హాస్టల్ ఉంది. గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో సెకండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో ఏసీ కంప్రెసర్ పేలింది. దీంతో మంటలు చెలరేగాయి.
ప్రమాదం జరిగిన సమయంలో ఆ రూము లాక్ చేసి ఉంది. అందులో ఎవ్వరూ లేరు. కొద్దిసేపటికే మంటలు తీవ్రమయ్యాయి. పొగ మిగిలిన రూముల్ని కూడా కమ్మేసింది. ఇది గమనించిన మిగితా రూముల్లోని అమ్మాయిలు భయపడిపోయారు. ఎటు వెళ్లాలో తెలియలేదు. కొందరు రూము బాల్కనీలోకి వచ్చారు. గట్టిగా కేకలు వేయటం మొదలెట్టారు. ఆ కేకలు విని చుట్టుపక్కల ఉన్న వారంత అక్కడికి వచ్చారు. వారికి సాయం చేయడానికి ఓ నిచ్చెనను వారు ఉన్న రూము బాల్కనీ కింద పెట్టారు. ఓ అమ్మాయి నిచ్చెన ద్వారా కిందకు దిగడానికి ప్రయత్నించింది. బాల్కనీ గ్రిల్ వేలాడుతూ నిచ్చెనపైకి దిగాలనుకుంది.
అయితే, పట్టుతప్పి కిందపడిపోయింది. మరో అమ్మాయి ఎంతో చాకచక్యంగా నిచ్చెన పైకి కాళ్లు పెట్టింది. తర్వాత కిందకు దిగింది. కిందపడ్డ అమ్మాయిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో సంఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ ఆ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. పాపం ఏమైందో’..‘ ఇలాంటి సమయాల్లో భయం కారణంగా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ అమ్మాయి కూడా భయపడ్డం వల్లే కిందకు జారింది’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మయన్మార్, థాయ్‌లాండ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా