CBI: రాష్ట్రాల్లోకి నేరుగా సీబీఐ
ABN , Publish Date - Mar 28 , 2025 | 05:32 AM
ఒక రాష్ట్రం అనుమతి లేకుండా సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగుపెట్టరాదనే ప్రస్తుత చట్టం విషయమై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం కోరింది.

జాతీయభద్రతతో ముడిపడిన కేసుల్లో అనుమతి తీసుకోకుండానే దర్యాప్తు
అటువంటి ప్రత్యేక చట్టం తీసుకురండి
పార్లమెంటుకు స్థాయీ సంఘం నివేదిక
న్యూఢిల్లీ, మార్చి 27: ఒక రాష్ట్రం అనుమతి లేకుండా సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగుపెట్టరాదనే ప్రస్తుత చట్టం విషయమై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం కోరింది. జాతీయ భద్రత, సమగ్రతతో ముడిపడిన కేసుల విషయంలో రాష్ట్రాల అనుమతి లేకుండానే సీబీఐ తన దర్యాప్తును జరిపేలా ప్రత్యేకమైన/కొత్త చట్టం తీసుకురావాలని సిఫారసు చేసింది. సీబీఐలో డిప్యుటేషన్‌పై పనిచేయడానికి వస్తున్న అభ్యర్థనల్లో సరైనవి చాలా తక్కువగా ఉండటంపై ఈ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. జాతీయ దర్యాప్తు సంస్థలో డిప్యూటీ సూపరింటెండెంట్, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ల వంటి కీలక పోస్టులను డిప్యుటేషన్‌పై కాకుండా నేరుగా భర్తీ చేయడంపై దృష్టిసారించాలని సూచించింది.
దీనికోసం స్వతంత్ర నియామక వ్యవస్థను నెలకొల్పాలని సూచించింది. ముఖ్యమైన ర్యాంకుల్లోని అధికారులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారాగానీ, సీబీఐ ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించడం ద్వారా గానీ ఎంపిక చేయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాలు, న్యాయ విషయాల స్థాయీ సంఘం తన 45వ నివేదికను గురువారం పార్లమెంటుకు సమర్పించింది. సీబీఐలో సిబ్బంది కొరత అధికంగా ఉందని, చాలా పోస్టులు ఖాళీగా ఉండి, సిబ్బందిపై అదనపు పని భారం పడుతోందని తెలిపింది. ఇది సీబీఐ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.