Share News

Rural Infrastructure Growth: పల్లెల్లో పనుల సందడి

ABN , Publish Date - Apr 01 , 2025 | 04:13 AM

కూటమి ప్రభుత్వం కేవలం 10 నెలల్లోనే గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు పల్లె పాలనకు కొత్త ఊపందిస్తున్నాయి

Rural Infrastructure Growth: పల్లెల్లో పనుల సందడి

  • అభివృద్ధి దిశగా గ్రామాల పరుగు

  • గ్రామాలకు వీడిన ఐదేళ్ల గ్రహణం

  • పది నెలల్లోనే మారిన ముఖచిత్రం

  • ఉపాధిలో రూ.10 వేల కోట్ల వ్యయం

  • గ్రామాల్లో 26 వేల మినీ గోకులాలు

  • 4 వేల కి.మీ. సిమెంట్‌ రోడ్ల నిర్మాణం

  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో వినూత్న మార్పులు తెచ్చిన ప్రభుత్వం

  • 2028 నాటికి మొత్తం 90 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ కొళాయి నీరు

  • కేరళ ఆదర్శంగా పవన్‌ ప్రణాళికలు

పల్లెల్లో ప్రగతి హరివిల్లులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో పడకేసిన పల్లె పాలన.. కూటమి హయాంలో పరుగులు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పది నెలల కాలంలోనే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి దిశగా నడిపిస్తోంది. జగన్‌ సర్కార్‌ ఐదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనుల కంటే మిన్నగా ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు పలు అభివృద్ధి పనులు చేపట్టి గ్రామీణ ప్రాంతాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నాయి. ఓవైపు పంచాయతీరాజ్‌, మరో వైపు గ్రామీణాభివృద్ధిశాఖలో అధికారులకు టార్గెట్లు పెట్టి గ్రామాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఐదేళ్లుగా అభివృద్ధి పనులు లేక వెలవెలబోయిన పల్లెసీమలకు మళ్లీ కళ వస్తోంది. సీసీ రోడ్లు, మినీ గోకులాలు, తాగునీటి కొళాయిలు, ఇతర పనులతో గ్రామాల్లో సందడి నెలకొంది. 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ఒకప్పుడు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలో చేపట్టిన పనులు గత జగన్‌ పాలనలో నిర్వీర్యమయ్యాయి. ఇప్పుడు ఆ గ్రహణం వీడింది. సీఎం చంద్రబాబు చొరవ, స్వయంగా గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీసుకుంటున్న చర్యలతో పరిస్థితి మారుతోంది. ఐదేళ్లలో వైసీపీ సర్కార్‌ 884 కిలో మీటర్ల సిమెంట్‌రోడ్లను నిర్మిస్తే, ప్రస్తుత ప్రభుత్వం పది నెలల్లో ఐదు రెట్లు ఎక్కువగా, అంటే 4 వేల కిలో మీటర్ల మేరకు సిమెంట్‌ రోడ్లు నిర్మించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా బలోపేతం చేసింది.


రూ.10వేల కోట్ల ఉపాధి నిధులు ఖర్చుచేసి తిరిగి గ్రామీణులకు ‘ఉపాధి’ని సుస్థిరం చేసింది. ఉపాధి పథకం అమలులో ఒకప్పుడు ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండగా, గత వైసీపీ హయాంలో అట్టడుగుకు చేరింది. అయితే, కూటమి ప్రభుత్వం తిరిగి 1వ స్థానాన్ని తిరిగి సాధించేందుకు అహర్నిశలూ కృషి చేసింది. గ్రామీణ పేదలకు ఆర్థికంగా అండదండలందించి మినీ గోకులాలను నిర్మించేందుకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చర్యలు తీసుకున్నారు. 10 నెలల్లోనే 26 వేల మినీ గోకులాలను నిర్మించారు. పంచాయతీ పాలనలో కేరళను ఆదర్శంగా తీసుకున్న పవన్‌ పక్కా ప్రణాళికలతో అభివృద్ధిని సాకారం చేస్తున్నారు.

ఆర్‌జీఎస్ఏలో రెండో స్థానం

గ్రామ పాలనను గాడిలో పెట్టేందుకు ఉపముఖ్యమంత్రి నేతృత్వంలోని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు నిరంతరం శ్రమించారు. రాష్ట్రానికి చెందిన కేరళ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణతేజ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాక పంచాయతీరాజ్‌శాఖ రూపు రేఖలను సమూలంగా మార్చారు. తాగునీరు, పారిశుధ్యం, రోడ్ల నిర్మాణాలతో పాటు 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి జీపీడీపీ మార్గదర్శకాల ప్రకారం పనులు జరుగుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులతో 35 వేలకు పైగా పనులు చేపట్టడం విశేషం. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌(ఆర్‌జీఎ్‌సఏ) అమల్లో మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఒకప్పుడు 26వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. పవన్‌ కల్యాణ్‌ చర్యలు, అధికారుల చొరవతో రెండో స్థానానికి చేరుకుంది. రాష్ట్ర వాటా చెల్లించడానికి ఇష్టం లేని జగన్‌ సర్కార్‌ గత ఐదేళ్లలో ఈ పథకం కింద ఒక్క పైసా కూడా నిధులు సాధించలేక పోయింది. ఈ పథకం ద్వారా శిక్షణా కేంద్రాలు, మౌలిక వసతులకు నిధులు రాకుండా ఆగిపోయాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల చొరవ, ఉపముఖ్యమంత్రి సిఫారసులతో తిరిగి ఈ పథకం కింద నిధులు విడుదలయ్యాయి. ఇదిలావుంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 13,218 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు.


పంచాయతీరాజ్‌లో సంస్కరణలు

పవన్‌ కల్యాణ్‌ పంచాయతీరాజ్‌ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉండాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో జడ్పీ సీఈఓ, డీఎల్‌డీఓ, డీపీఓ, పీఆర్‌ ఇంజనీరింగ్‌ ఎస్‌ఈ కార్యాలయాలన్నింటినీ ఒకే కాంపౌండ్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీంతో పాటు పంచాయతీరాజ్‌లోని అన్ని విభాగాల్లోనూ పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేశారు. తొలిసారి ప్రతి ఏటా డీపీసీ ఏర్పాటు చేసి పదోన్నతుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక, ప్రతి ఇంటికీ కొళాయి నీరు ఇవ్వాలన్న సంకల్పంతో కేంద్రం తెచ్చిన ‘జల్‌జీవన్‌ మిషన్‌’ ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంతో కేంద్రం నుంచి కేవలం రూ.2,254 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. పైగా నీటి వనరులు లేని చోట కొళాయిలు ఏర్పాటు చేయడంతో ఆ నిధులు వృథా అయ్యాయి. దీనిపై అధ్యయనం చేసిన పవన్‌ కల్యాణ్‌.. తిరిగి ఈ పథకాన్ని మొదటి నుంచి ప్రారంభించారు. 2028 కల్లా మొత్తం 90 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ కొళాయి నీరు అందించాలని సంకల్పించారు.

ఏఐఐబీ పనులు తిరిగి ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ) రుణం రూ.5 వేల కోట్లతో గత ప్రభుత్వం చేపట్టిన పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన 30 శాతం వాటా ఇవ్వకపోవడం, ఏఐఐబీ విడుదల చేసిన నిధులను సైతం కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ఇతర ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో ఏఐఐబీ కూడా రుణం నిలిపేసింది. కూటమి ప్రభుత్వం ఏఐఐబీ అధికారులతో ఉపముఖ్యమంత్రి చర్చించి వారిని ఒప్పించారు. ఈ ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టారు. గిరిజన ప్రాంతాల్లో ప్రిమిటివ్‌ ట్రైబల్‌ గ్రూపు ప్రాంతాలకు కనెక్టివిటీ రోడ్లపనులు ప్రారంభించారు.


పల్లె పండుగ!

‘పల్లె పండుగ’ పేరుతో 4 వేల కిలో మీటర్ల మేరకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంట్‌రోడ్ల నిర్మాణం చేపట్టింది. నాణ్యతతో కూడిన సిమెంట్‌ రోడ్లను నిర్మించారు. అదేవిధంగా 20,500 మినీ గోకులాలను నిర్మించి సరికొత్త రికార్డు సృష్టించారు. పశుగ్రాసం కోసం ఉపాధి నిధులను వ్యయం చేయడంలో ప్రభుత్వం ముందుంది. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 736 ఎకరాల్లో మాత్రమే పశుగ్రాసం అభివృద్ధి చేస్తే, పది నెలల్లో ప్రస్తుత ప్రభుత్వం 3 వేల ఎకరాల్లో పశుగ్రాసం అభివృద్ధి చేసింది. అదేవిధంగా కోటిన్నరకు పైగా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేయడం గమనార్హం.

స్వర్ణ పంచాయతీ పోర్టల్‌

గతంలో పంచాయతీల్లో పన్నుల వసూళ్ల వ్యవహారం వివాదంగా మారి పారదర్శకత లోపించింది. వసూలు చేసిన పన్నులు పంచాయతీల అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించిన దాఖలాల్లేవు. దీనిని గమనించిన ప్రభుత్వం గ్రామాల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియను ఆన్‌లైన్‌ చేస్తూ.. ‘స్వర్ణ పంచాయతీ పోర్టల్‌’ను ప్రారంభించింది. పంచాయతీల పన్నుల వసూళ్లలో కూడా గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. గత ఏడాది రూ.618 కోట్లు పన్నులు వసూలు కాగా, ఈ పది నెలల్లో రూ.819 కోట్లు వసూలు చేశారు.

Updated Date - Apr 01 , 2025 | 04:16 AM