Share News

Global Capability Center: హైదరాబాద్‌లో వాన్‌గార్డ్‌ జీసీసీ

ABN , Publish Date - Apr 01 , 2025 | 04:20 AM

వాన్‌గార్డ్‌ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (GCC) ఏర్పాటు చేయనుంది. ఇది కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్‌, మొబైల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ టెక్నాలజీల్లో నిపుణుల కోసం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.

Global Capability Center: హైదరాబాద్‌లో వాన్‌గార్డ్‌ జీసీసీ

ఈ సంవత్సరం చివరికల్లా ప్రారంభం

నాలుగేళ్లలో 2,300 ఉద్యోగాల కల్పన

సీఎం రేవంత్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న పెట్టుబడుల నిర్వహణ సంస్థల్లో ఒకటైన వాన్‌గార్డ్‌.. హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను(జీసీసీ) ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఆ కంపెనీ ప్రతినిధులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చర్చల అనంతరం.. ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్‌లో జీసీసీని ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. వచ్చే నాలుగేళ్లలో దాంట్లో 2,300 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇన్నోవేషన్‌ హబ్‌గా పని చేసే ఈ కేంద్రంలో.. కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్‌, మొబైల్‌ ఇంజనీరింగ్‌ రంగాలకు చెందిన ఇంజనీర్లను సత్వరమే నియమించుకోవాలని యోచిస్తోంది. కాగా.. సీఎంను కలిసిన వాన్‌గార్డ్‌ ప్రతినిధుల బృందంలో ఆ సంస్థ సీఈవో సలీం రాంజీ, ఐటీ డివిజన్‌ సీఐవో, ఎండీ నితిన్‌ టాండన్‌, చీఫ్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ జాన్‌ కౌచర్‌, జీసీసీ-వాన్‌గార్డ్‌ ఇండియా హెడ్‌ వెంకటేశ్‌ నటరాజన్‌ ఉన్నారు. హైదరాబాద్‌లో వైవిధ్యమైన ప్రతిభ అందుబాటులో ఉందని.. ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం కూడా ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సహాయసహకారాలు కూడా బాగున్నాయని సలీం రాంజీ ప్రశంసించారు.

hy.gif

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ను తమకు అనువైన చోటుగా ఎంచుకున్నామన్నారు. జీసీసీ ఏర్పాటు ద్వారా.. తమ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలను అందించడంతో పాటు ఏఐ, మొబైల్‌, క్లౌడ్‌ టెక్నాలజీలో ప్రతిభావంతులైన ఇంజనీర్లకు అవకాశాలు కల్పించే అవకాశం రావడం తమకు సంతోషంగా ఉందన్నారు.


ఆనందంగా ఉంది: రేవంత్‌రెడ్డి

వాన్‌గార్డ్‌ సంస్థ హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచ జీసీసీ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు. జీసీసీ ఏర్పాటుకు.. ప్రభుత్వం తరపున తగిన సహకారాన్ని అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 04:20 AM