Shihan Husseini: పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చిన గురువు ఇక లేరు..
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:55 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చిన ట్రైనర్ షిహాన్ హుసైనీ మృతిచెందారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ యూనివర్శిటీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

- నటుడు, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ షిహాన్ హుసైనీ మృతి
చెన్నై: ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ ట్రైనర్, సినీ నటుడు షిహాన్ హుసైనీ (60) మృతి చెందారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆయన మంగళవారం శ్రీరామచంద్ర మెడికల్ యూనివర్శిటీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని బీసెంట్ నగర్‌లో ని ఆయన స్వగృహంలో అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. మార్షల్ ఆర్ట్స్ మాస్టర్‌గా వందలాది మందికి శిక్షణ ఇచ్చిన హుసైనీ... కోలీవుడ్ అగ్రహీరో విజయ్(Vijay), ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pavan Kalyan)కు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చిన గురువు కావడం గమనార్హం.
ఈ వార్తను కూడా చదవండి: IPS: పది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ఒకవైపు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తూనే మరోవైపు సినిమాల్లో నటించారు. అగ్రహీరో విజయ్ నటించిన ‘బద్రి’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆయన... పలువురు హీరోలకు శిక్షణ ఇచ్చారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌కు ఆయన చికిత్స తీసుకున్నారు. ఆయన వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా తమిళనాడు క్రీడాభివృద్ధి సంస్థ నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం వేకువజామున 1.45 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇదిలా వుండగా హుసైనీ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.
అమ్మ వీరభక్తుడిగా...
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) వీర భక్తుడైన ఆయన.. ఆమె మెప్పుపొందాలనే లక్ష్యంతో తన చేతులపై 101 కార్లు ఎక్కించుకుని, ఆ రక్తంతో జయలలిత చిత్రపటాన్ని గీశారు. ఈ విషయం తెలుసుకున్న జయలలిత అతడిని ఇంటికి పిలిపించి.. సున్నితంగా మందలించారు. అదేవిధంగా జయలలిత జైలుకు వెళ్ళిన సమయంలో కూడా ఆమె విడుదలకావాలంటూ తనకు తానుగా శిలువలో వేలాడి ప్రార్థించారు.
అదేవిధంగా జయలలిత విగ్రహం కోసం తన శరీరం నుంచి 24 బాటిళ్ళ రక్తాన్ని సేకరించి భద్రపరిచారు. ఆయనతో పాటు విలువిద్య క్రీడాకారులు కూడా 32 మంది రక్తాన్ని దానం చేశారు. ఈ రకంగా ఎన్నో సాహసాలకు పెట్టింది పేరుగా నిలిచిన హుసైనీ అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించడంపై ఆయన శిష్యులు, కరాటే క్రీడాకారులు, పలురాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తదితరుల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మీ మనసు బాధపడితే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటా..
మిస్ వరల్డ్ పోటీలకు 54 కోట్ల ఖర్చు తప్పుకానప్పుడు ఫార్ములా-ఈ తప్పుకాదు
డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
Read Latest Telangana News and National News