Share News

PM Modi: ఆధునిక 'అక్షయ వటవృక్షం' ఆర్ఎస్ఎస్: ప్రధాని మోదీ

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:03 PM

దేశనిర్మాణం, సమాజ సేవ, సంస్కృతీ పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ వలంటీర్లు విశిష్ట సేవలందిస్తున్నారని మోదీ అన్నారు. నాగపూర్‌లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు ప్రధాని ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.

PM Modi: ఆధునిక 'అక్షయ వటవృక్షం' ఆర్ఎస్ఎస్: ప్రధాని మోదీ

నాగపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (RSS)ను భారతీయ సజీవ సంస్కృతికి చిహ్నమైన ఆధునిక ''అక్షయ వటవృక్షం''గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. దేశానికి ఆర్ఎస్ఎస్ వలంటీర్లు చేస్తున్న నిస్వర్థ సేవలను కొనియాడారు. దేశనిర్మాణం, సమాజ సేవ, సంస్కృతీ పరిరక్షణలో విశిష్ట సేవలందిస్తున్నారని అన్నారు. నాగపూర్‌లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు ప్రధాని ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.

Kamakhya Express Derail: పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్


ఆర్ఎస్ఎస్ విశిష్టతను ప్రధాని వివరిస్తూ... ''వందేళ్ల క్రితం నాటిన సిద్ధాంతాల విత్తనాలు ఈ నాడు వటవక్షంలా ప్రపంచ ముందున్నాయి. సిద్ధాంతాలు పతాకస్థాయికి చేరుకోగా, లక్షలు, కోట్ల మంది స్వయం సేవకులు ఈ వటవృక్షానికి కొమ్మలు. ఇది మామూలు వటవృక్షం కాదు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన ఆధునిక వటవృక్షం'' అని అన్నారు.


గుడి పడ్వా (మరాఠీ నూతన సంవత్సర పండుగ) సందర్భంగా ప్రజలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ''వరుస పండుగల సీజన్ ఇది. గుడి పడ్వా, ఉగాది, నవ్రేహ్ (కశ్మీరీ హిందూ నూతన సంవత్సరం) పండుగలను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. ఇదే ఏడాది ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరం కూడా వచ్చింది. స్మృతి మందిర్‌కు నివాళులర్పించే మహదవకాశం నాకు వచ్చింది. ఇటీవలే మనం 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకొన్నాం. వచ్చే నెలలో బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవం ఉంది. నవరాత్రి, ఇతర పండుగల సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తు్న్నాను'' అని ప్రధాని అన్నారు.


పేదలకు ఉత్తమమైన వైద్యసేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని ప్రధాని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్యసేవలు అందుతున్నాయని, దేశప్రజలందరికీ మెరుగైన వైద్యసేవలు అందించడం తమ ప్రాధాన్యతా క్రమాల్లో ఒకటని తెలిపారు. వేలాది జన్ ఔషది కేంద్రాల ద్వారా దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు చౌకగా మందులు లభిస్తున్నాయని అన్నారు. ఇందువల్ల వేలకోట్లలో ప్రజల సొమ్ము ఆదా అవుతోందని చెప్పారు. గత పదేళ్లలో లక్షలాది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను గ్రామాల్లో నిర్మించామని, అక్కడ ప్రాథమిక చికిత్స లభిస్తోందని వివరించారు. మెడికల్ కాలేజీలను రెట్టింపు చేయడంతో పాటు దేశంలో ఆపరేషనల్ 'ఎయిమ్స్‌'ను మూడురెట్లు పెంచామని చెప్పారు. నిపుణులైన వైద్యలను ప్రజలకు అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని అన్నారు.


మాధవ్ నేత్రాలయ భవంతికి శంకుస్థాపన

మాధవ్ నేత్రాలయ ఐ ఇన్‌స్టిట్టూ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో కొత్తగా ఎక్స్‌టెన్షన్ బిల్డింగ్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తదితరులు పాల్గొన్నారు. నాగపూర్‌లోని సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్‌ను 2014లో దివంగత ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ అలియాస్ గురూజీ స్మృత్యర్థం నిర్మించారు. కొత్త ప్రాజెక్టుతో 250 పడకల ఆసుపత్రిగా, 14 ఔట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్స్, 14 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు చవకగా అందుబాటులోకి రానున్నాయి.


ఇవి కూడా చదవండి..

Nodia Porn Racket: లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. వెలుగులోకి పోర్న్ రాకెట్

Yatnal: కాంగ్రెస్‌, జేడీఎస్‏లో చేరేది లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా

For National News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:06 PM