Supreme Court Decision: ఫిరాయింపులపై గత తీర్పులను ఎలా మార్చగలం
ABN , Publish Date - Mar 26 , 2025 | 06:15 AM
సుప్రీంకోర్టు తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై స్పీకర్ కార్యాలయం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించింది. ఫిరాయింపు కేసుల్లో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇది అవసరమని పేర్కొంది.

ఎప్పటిలోగా తేల్చాలన్నదానిపై రాజ్యాంగ ధర్మాసనాలు స్పష్టంగా చెప్పలేదు
వాటిని కాదని ఎలా ముందుకు వెళ్లగలం?
సభాపతికి ఆదేశాలివ్వొచ్చా.. అనే దానిపైనే వాదనలు
పార్టీ ఫిరాయించిన వ్యక్తి ఎక్కడ పోటీ చేశారనేది స్పీకర్ చూసుకుంటారు
కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదన్న సుప్రీంకోర్టు
ఎమ్మెల్యేల అనర్హత కేసులో మరోసారి కీలక వ్యాఖ్యలు
ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా?
స్పీకర్ కార్యాలయం ఎందుకు తాత్సారం చేస్తోంది?
నోటీసులిచ్చేందుకు ఇంకెంత సమయం కావాలి?
ఆలస్యం చేసే వ్యూహాలు అనుసరించవద్దు: ధర్మాసనం
పిటిషనర్ల తరఫు వాదనలు పూర్తి
ఏప్రిల్ 2న స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట ప్రభుత్వం వాదనలు వింటామన్న సర్వోన్నత న్యాయస్థానం
రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది. ఒకవేళ అది జరగడం లేదని భావిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది. అలాంటి సందర్భంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు.
- జస్టిస్ బీఆర్ గవాయ్
న్యూఢిల్లీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని, క్వశ్చన్ ఆఫ్ లా వరకే పరిశీలిస్తున్నామని పేర్కొంది. స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చా? లేదా? అనే అంశంపైనే వాదనలు వింటున్నామని చెప్పింది. అంతేకాకుండా.. ఇలాంటి వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని, ఫిరాయింపులపై ఎప్పటిలోగా తేల్చాలన్న అంశంపై గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదని తెలిపింది. అలాంటప్పుడు ఆ తీర్పులను కాదని ఎలా ముందుకెళ్లగలమని, ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది. ఇక ఫిరాయించిన వ్యక్తి లోక్‌సభ, అసెంబ్లీ, జిల్లా పరిషత్‌కు పోటీ చేశారా? అనేది తాము పట్టించుకోబోమని, ఆ అంశాన్ని స్పీకర్ చూసుకుంటారని తెలిపింది. అదే సమయంలో.. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి స్పీకర్ కార్యాలయం ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రశ్నించింది. ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దని వ్యాఖ్యానించింది. బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ జనవరి 15న సుప్రీంకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.
కాగా, ఈ అంశంలో గత విచారణ సందర్భంగా ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయమంటే ఎంత? అంటూ అసహనం వ్యక్తం చేసింది. మార్చి 22లోపు సమాధానం చెప్పాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, రాష్ట ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. అయితే అసెంబ్లీ స్పీకర్, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని, కేవలం ఎమ్మెల్యే హోదాలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని తెలిపారు. కాగా, మంగళవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జి మాసి్‌సలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. తొలుత.. అసెంబ్లీ కార్యదర్శి తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశామని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం, కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, మోహిత్‌రావు, స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వి, ముకుల్ రోహత్గీ హాజరయ్యారు.
హైకోర్టు ఆదేశించినా నోటీసులివ్వలేదు..
ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. గతేడాది మార్చి, ఏప్రిల్‌లో పార్టీ ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అనంతరం జూన్‌లో రిట్ పిటిషన్ వేశామన్నారు. గతేడాది సెప్టెంబరులో నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్‌ను నిర్ణయించాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. అయిన్పటికీ ఈ ఏడాది జనవరి వరకు నోటీసులు జారీ చేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్‌ఎ్‌సలో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. దానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసినా స్పీకర్ ఆయనకు నోటీసులు ఇవ్వలేదని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే ఆయనను పదవిలో కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ నియమాలకు విరుద్ధమని వాదించారు. అలాగే, కడియం శ్రీహరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. స్పీకర్ సమయంపై సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్రసింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులిస్తే ముగ్గురూ ఒకేలా సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. పైగా.. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తున్నామని స్పీకర్ అంటున్నారని, కానీ.. ఆ కాపీలు తమకు ఇవ్వడం లేదన్నారు. స్పీకర్ అధికారాలు సైతం న్యాయసమీక్ష పరిధిలోనే ఉంటాయని, ఫిరాయింపుల అంశంలో స్పీకర్ నిర్ణయంపై నిర్దిష్టమైన గడువు విధించాలని కోరారు.
ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా?
పిటిషనర్ వాదనలపై జస్టిస్ బీఆర్ గవాయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలం అంటే పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? అని వ్యాఖ్యానించారు. ‘‘ఫిరాయింపులపై స్పీకర్ కార్యాలయానికి మొదటి ఫిర్యాదు అంది ఎంతకాలం అవుతోంది? సుమారు సంవత్సరం అయినట్లు కనిపిస్తోంది. అంటే.. ఫిరాయింపులకు వార్షికోత్సవం అయినట్టే ఉంది. ఈ పిటిషన్లను నిర్ణయించడానికి స్పీకర్ కార్యాలయం ఎందుకు తాత్సారం చేస్తోంది? నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంత సమయం కావాలి? ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి స్పీకర్ కార్యాలయానికి ఇంకెంత సమయం పడుతుంది? ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దు. స్పీకర్ దృష్టిలో రీజనబుల్ టైం అంటే గడువు ముగిసే వరకా?’’ అంటూ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. స్పీకర్ క్వాషీ జ్యుడీషియరీ అధికారాలతో ఉన్నారని, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను కూడా పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు. ఒకవేళ అది జరగడం లేదని భావిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించడానికి రాజ్యాంగం అవకాశం కల్పించిందని తెలిపారు. అలాంటి సందర్భంలో రాజ్యాంగ పరిరక్షకులుగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Stock Market Update: స్వల్ప లాభాల్లో గట్టెక్కిన నిఫ్టీ, సెన్సెక్స్ రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ