Share News

కుమార్తెను కోల్పోయి.. న్యాయం జరగక..

ABN , Publish Date - Mar 15 , 2025 | 04:32 AM

ప్రేమ పేరుతో మోసపోయిన కూతురు ఆత్మహత్య చేసుకుంది...ఈ విషయంలో న్యాయం జరగకపోగా కుటుంబానికి వేధింపులు ఎదురుకావడంతో ఆ తల్లి మనోవేదనకు గురైంది.

కుమార్తెను కోల్పోయి.. న్యాయం జరగక..

  • మనోవేదనతో తల్లి ఆత్మహత్య

  • ప్రియుడు మోసగించాడని ఇటీవలే కూతురు బలవన్మరణం

  • పోలీసులను ఆశ్రయించిన కుటుంబానికి వేధింపులు

  • మనస్తాపంతో లోకం విడిచిన తల్లి

బెంగళూరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరుతో మోసపోయిన కూతురు ఆత్మహత్య చేసుకుంది...ఈ విషయంలో న్యాయం జరగకపోగా కుటుంబానికి వేధింపులు ఎదురుకావడంతో ఆ తల్లి మనోవేదనకు గురైంది. ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. కర్ణాటక రాష్ట్రం మండ్య తాలూకా హెబ్బకవాడి గ్రామానికి చెందిన విజయలక్ష్మి(21), ఇదే ప్రాంతంలోని మారసింగనహళ్లికి చెందిన హరికృష్ణ కొంతకాలం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాక శారీరకంగా దగ్గరయ్యారు. ఆ తరువాత పెళ్లి చేసుకోకుండా హరికృష్ణ ముఖం చాటేశాడు. విజయలక్ష్మి ఒత్తిడి చేయడంతో మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని హెచ్చరించాడు. పెళ్లి అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు.


మానసికంగా కుంగిపోయిన విజయలక్ష్మి గత నెల 21న రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో తమకు న్యాయం చేయాలని మండ్య గ్రామీణ పోలీ్‌సస్టేషన్‌లో విజయలక్ష్మి తండ్రి నంజుండేగౌడ ఫిర్యాదు చేశారు. అయితే హరికృష్ణ తరఫువారు మరో ఫిర్యాదు చేయడంతో నంజుండేగౌడపైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఓవైపు కూతురును కోల్పోయిన తమకు న్యాయం జరగకపోగా..., తమకు, తమకు అండగా నిలిచిన వారికి వేధింపులు మొదలయ్యాయని ఆవేదన చెందిన విజయలక్ష్మి తల్లి లక్ష్మి(45) గురువారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో హరికృష్ణతోపాటు 19మందిపై పోలీసులు శుక్రవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Updated Date - Mar 15 , 2025 | 04:32 AM

News Hub