Indian Mythology: ఏ లోకంలో ఎవరుంటారు?
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:54 AM
పురాణ గ్రంథాల ప్రకారం... అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలను ‘అధోలోకాలు’ అంటారు. ఈ లోకాలలో విలాసవంతమైన పట్టణాలను, భవనాలను దానవరాజు, మహా శిల్పి అయిన మయుడు నిర్మించాడు.

తెలుసుకుందాం
పురాణ గ్రంథాల ప్రకారం... అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలను ‘అధోలోకాలు’ అంటారు. ఈ లోకాలలో విలాసవంతమైన పట్టణాలను, భవనాలను దానవరాజు, మహా శిల్పి అయిన మయుడు నిర్మించాడు. వీటిలో భూమి తెల్లగా, నల్లగా, ఎర్రగా, పసుపు పచ్చగా... ఇలా అనేక రంగుల్లో ఉంటుంది.
అతలం
అతల లోకంలో మయుడి కుమారుడు బలాసురుడు ఉంటాడు. అతను ఎదుటివారి మీద మాయలను ప్రయోగించి వినోదిస్తూ ఉంటాడు. అతనికి 96 రకాల మాయలు తెలుసు.
వితలం
వితల లోకానికి హాటకేశ్వరుడనే పేరున్న శివుడు అధిపతి. అక్కడ భవానీదేవితో కలిసి ఉంటాడు. ఈ లోకంలో హాటకీ అనే నది ఉంది. ఆ జలంతో బంగారం తయారవుతుంది.
సుతలం
వితలలోకం కింద ఉన్నది సుతల లోకం. బలి చక్రవర్తి అక్కడే ఉంటాడు. శ్రీ మహావిష్ణువు... త్రివిక్రమరూపం ధరించి, ముల్లోకాలను తన పాదాలతో ఆక్రమించాడు. బలి చక్రవర్తిని భూమి కిందికి పంపినప్పుడు... అతనికి సుతలలోకంలో ఇంద్రత్వాన్ని ఆ శ్రీహరి అనుగ్రహించాడు.
తలాతలం
ఈ లోకానికి మయుడు ప్రభువు. రాక్షసుల పట్టణాలను నిర్మించినది అతనే. శివుడు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు... మహావిష్ణువును మయుడు శరణు కోరాడు. ఆయన మయుణ్ణి కరుణించి తలాతలానికి రాజును చేశాడు.
మహాతలం
తలాతలానికి దిగువన ఉండే మహాతలంలో... కద్రువ సంతానమైన సర్పరాజులు ఉంటాయి. ఒక్కొక్కదానికి అనేక పడగలు ఉంటాయి. నారాయణుడి వాహనమైన గరుత్మంతుడంటే భయంతో అనుక్షణం కలవరపడుతూ జీవిస్తాయి.
రసాతలం
మహాతలానికి కింద ఉండే రసాతలం... దైత్యులు, దానవులు అయిన నివాతకవచులు, కాలకేయులకు నిలయం. వారికి దేవతలతో సరిపడదు. కానీ శ్రీహరికి లొంగి ఉంటారు.
పాతాళం
అన్నిటికన్నా దిగువన ఉండేది పాతాళ లోకం. శంఖుడు, మహాశంఖుడు, ధనుంజయుడు మొదలైన మహానాగులు అక్కడ ఉంటాయి. వాటిలో కొన్నిటికి అయిదు, మరికొన్నిటికి పది, ఇంకొన్నిటికి వంద తలలు ఉంటాయి. వాటి పడగలమీద మణులు మెరుస్తూ ఉంటాయి. వాటి మెరుపులు పాతాళంలోని చీకట్లను తొలగిస్తూ ఉంటాయి. పాతాళ లోకం అడుగున ఆదిశేషుడు ఉంటాడు. అనంతుడు, సంకర్షణుడు అని పేర్లు ఉన్న ఆయన తల మీద ఆవగింజలా ఈ భూమండలం ఉంది.
- ప్రయాగ రామకృష్ణ