Spiritual Guru: దేశ విముక్తి నుంచి ఆత్మ స్వాతంత్య్రం వైపు...
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:19 AM
మానవులు అంతర్గత శాంతి పొందనంతవరకూ ప్రపంచ శాంతి పొందడం సాధ్యం కాదు. అంతర్గత శాంతిని పొందడానికి ఆత్మసాక్షాత్కారం ఒక్కటే మార్గం’’ అని చాటి చెప్పిన ఆధ్యాత్మిక గురువు శ్రీమాతాజీ నిర్మలాదేవి.

సహజయోగ
‘‘మానవులు అంతర్గత శాంతి పొందనంతవరకూ ప్రపంచ శాంతి పొందడం సాధ్యం కాదు. అంతర్గత శాంతిని పొందడానికి ఆత్మసాక్షాత్కారం ఒక్కటే మార్గం’’ అని చాటి చెప్పిన ఆధ్యాత్మిక గురువు శ్రీమాతాజీ నిర్మలాదేవి. శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక సమస్యలకు పరిష్కారంగా సహజ యోగాన్ని మానవాళికి అందించారు. నేడు ఆమె జయంతి.
ఏది ఆదర్శమో బోధించడమే కాదు, ఆదర్శంగా ఎలా ఉండాలో ఆచరించి చూపిన శ్రీమాతాజీ నిర్మలాదేవి... మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో... 1923లో... మార్చి 21న జన్మించారు. చిరునవ్వులొలుకుతూ, ప్రకాశవంతంగా ఉన్న ఆ శిశువును చూసిన ఆమె అమ్మమ్మ తను ‘నిష్కళంక’ (ఏ మచ్చా లేనిది) అని సంబరపడ్డారు. నిర్మలా దేవి తండ్రి ప్రసాదరావ్ సాల్వే అప్పట్లో నాగపూర్‌లో ప్రసిద్ధి చెందిన క్రిమినల్ లాయర్. పధ్నాలుగు భాషల్లో పండితుడు. దివ్య ‘ఖుర్‌ఆన్’ గ్రంథాన్ని మరాఠీ భాషలోకి అనువదించారు. భారత రాజ్యాంగ కమిటీలో సభ్యుడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. మొదటి పార్లమెంట్‌లో సభ్యునిగా ఉన్నారు. ఆమె తల్లి కార్నెలియా సాల్వే మన దేశంలో గణిత శాస్త్రం ఆనర్స్‌లో పట్టభద్రురాలైన తొలి మహిళ. స్వాతంత్య్ర ఉద్యమం కోసం ఆస్తులన్నిటినీ త్యాగం చేసిన ఆ కుటుంబం పూరి గుడిసెలో నివసించాల్సి వచ్చినా, పోరాట మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఉద్యమం సందర్భంగా తల్లితండ్రులు జైలుకు వెళ్ళడంతో... చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలను నిర్మలాదేవి తీసుకున్నారు. ఆమె కూడా బాల్యం నించి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీతో సన్నిహితంగా మెలిగారు. లాహోర్ మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడు... క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆ కాలేజీపై భారత జెండాను నిర్మలాదేవి ఎగురవేశారు. దానితో ఆమెను కాలేజీ నుంచి బహిష్కరించారు. ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించి అరెస్టయ్యారు.
భగవంతుడంటే...
వివాహమై, గృహిణిగా బాధ్యతలు నెరవేర్చిన తరువాత... 1970లో ‘సహజయోగం’ అనే ఆధ్యాత్మిక ఉద్యమాన్ని నిర్మలాదేవి ప్రారంభించారు. ఈసారి మానవుల ఆత్మ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ‘‘భగవంతుడంటే మన లోపల ఉన్న ఆత్మే’’ అని స్పష్టం చేసిన ఆమె... మానవులలో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయడం ద్వారా ఆత్మసాక్షాత్కారం చాలా సులభతరమని నిరూపించారు. ప్రపంచ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో కూడా సహజయోగ సందేశాన్ని వినిపించడం కోసం అలుపెరగకుండా ప్రయాణించారు. అనేకమంది సత్యాన్వేషకులను కలిశారు. లక్షల మందికి స్వస్థత చేకూర్చడంతో పాటు వారిలో ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించారు. నలభై ఏళ్ళ కాలంలో వందకు పైగా దేశాల్లో పర్యటించిన ఆమె... ఒక్క 1990లోనే... 26 దేశాల్లో 200కు పైగా బహిరంగ కార్యక్రమాల్లో ఉపన్యసించడం విశేషం. మానవాళిపట్ల తనకున్న కరుణను వ్యక్తపరచడం కోసం అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్మలాదేవి చేపట్టారు. ముంబాయి, గ్రేటర్ నోయిడాల్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సహజయోగ పరిశోధన, ఆరోగ్య కేంద్రాలు, సంగీతం, కళల అభివృద్ధి కోసం ముంబాయిలో ప్రారంభించిన ‘శ్రీ పి.కె.సాల్వే కళాప్రతిష్టాన్’, నిరాశ్రయులైన మహిళలు పిల్లల కోసం నోయిడాలో స్థాపించిన ‘విశ్వనిర్మల ప్రేమ ఆశ్రమం’, హిమాచల్ ప్రదేశ్‌లోని అంతర్జాతీయ పబ్లిక్ స్కూల్ వీటిలో కొన్ని.
‘మానవరత్నం’
తను చేసిన విశిష్టమైన సేవలకు గుర్తింపుగా వివిధ దేశాల అధ్యక్షుల నుంచి, ప్రముఖుల నుంచి అనేక ప్రశంసా పత్రాలను ఆమె అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా పురస్కారాలు స్వీకరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ‘మానవరత్న’ పురస్కారంతో, యుఎన్‌ఓ ‘యూనిటీ ఇంటర్నేషనల్ పీస్’ అవార్డుతో సత్కరించాయి. రష్యాలో ‘ప్రిసీడియం ఆఫ్ పెట్రోవ్ స్క్యా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్‌అండ్ సైన్సెస్’ లో గౌరవ సభ్యత్వం అందుకున్నారు. ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌తో పాటు ప్రపంచంలో కేవలం 12 మంది ప్రముఖులకు మాత్రమే ఈ గౌరవం లభించింది. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ఆమె జన్మదినమైన మార్చి 21ని ‘శ్రీమాతాజీ నిర్మలాదేవి డే’గా ప్రకటించారు. ఆమె శతజయంతి సందర్భంగా... ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం వంద రూపాయల నాణేన్ని విడుదల చేసింది. నిర్మలాదేవి నేడు భౌతికంగా మన మధ్య లేకపోయినా... ప్రపంచంలో ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వాలు నెలకొనడానికి ఆమె చేసిన ప్రయత్నాలు... సహజయోగ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరి హృదయాలను నిత్యం స్పృశిస్తూనే ఉంటాయి. నిర్మలాదేవి అడుగుజాడలు మహోన్నతమైన ఆమె ఆదర్శాలను గుర్తు చేస్తూనే ఉంటాయి.
Also Read:
ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం
ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే...
అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..
టూత్‌పిక్‌తో దంతాలను శుభ్రం చేస్తే.. ఇంత డేంజరా?