Share News

Nabha Natesh: సినిమా.. నా మనసు దోచింది

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:44 AM

తెలుగులో తొలి చిత్రం ‘నన్ను దోచుకుందువటే’తో కుర్రకారు మనసును దోచేశారు నభా నటేష్‌. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘డార్లింగ్స్‌’ తదితర చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రమాదంతో కొంత కాలం సినిమాలకు దూరమైనా.. ఇటీవలే మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాలు ‘స్వయంభూ’, ‘నాగబంధం’లో నటిస్తున్న నభా... ‘నవ్య’తో ముచ్చటించారు.

Nabha Natesh: సినిమా.. నా మనసు దోచింది

తెలుగులో తొలి చిత్రం ‘నన్ను దోచుకుందువటే’తో కుర్రకారు మనసును దోచేశారు నభా నటేష్‌.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘డార్లింగ్స్‌’ తదితర చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రమాదంతో కొంత కాలం సినిమాలకు దూరమైనా.. ఇటీవలే మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాలు ‘స్వయంభూ’, ‘నాగబంధం’లో నటిస్తున్న నభా... ‘నవ్య’తో ముచ్చటించారు.

‘స్వయంభూ’ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

ఇది ఒక పీరియాడిక్‌ చిత్రం. భారీ బడ్జెట్‌తో పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎక్కడా ఆగకుండా వేగంగా సాగిపోయే ఈ సినిమా కథలో చాలా లేయర్స్‌ ఉంటాయి. భరత్‌ కృష్ణమాచారికి ఇది తొలి సినిమా అయినా, ఎక్కడా తడబడలేదు. సినిమా అద్భుతంగా ఉండబోతోంది. నిఖిల్‌ చాలా కష్టపడ్డాడు. యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నాడు. ఇందులో నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌గా కనిపిస్తా. ఇటీవలే విడుదల చేసిన నా లుక్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి.

మీకు ఇంతకుముందే డ్యాన్స్‌ వచ్చా? లేక ఈ చిత్రం కోసమే నేర్చుకున్నారా?

నేను చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్నాను. అది నాకు ఇప్పుడు చాలా హెల్స్‌ అయ్యింది. ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్లలో నాకు అత్యంత ఇష్టమైనది ఇదే. ఇందులో నా నటన ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతుంది.

మీ షూటింగ్‌ పార్ట్‌ అయిపోయిందా? ఇందులో మీకు యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయా?

అవును, పూర్తయ్యింది. సినిమా షూటింగ్‌ కూడా దాదాపు పూర్తైపోయింది. గత ఏడాది జనవరిలో షూటింగ్‌ మొదలైంది. త్వరలోనే విడుదల తేదినీ ప్రకటిస్తారు. ఇందులో నాకు యాక్షన్‌ సీన్స్‌ లేవు.

Untitled-2.jpg

‘నాగబంధం’ గురించి చెప్పండి?

అభిషేక్‌ నామా దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆద్యంతం మలుపులతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని ఇస్తుంది. ఇందులో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాను మలుపు తిప్పే పాత్ర నాది.


వరుస ప్రాజెక్ట్‌లతో హ్యాపీగా సాగిపోతున్న మీ కెరీర్‌ను యాక్సిడెంట్‌ దెబ్బతీసింది. ఆ సమయంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు?

నా జీవితంలో అదో ఊహించని సినిమాటిక్‌ ట్విస్ట్‌. అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఆ యాక్సిడెంట్‌ జరగడం చాలా బాధాకరం. కోలుకోవడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఆ సమయంలో మానసికంగా చాలా లోగా ఫీల్‌ అయ్యేదాన్ని. నేను పూర్తిగా రికవర్‌ కావడంలో కుటుంబ సభ్యుల తోడ్పాటు మరిచిపోలేనిది.

కమ్‌బ్యాక్‌ తర్వాత ఎదుర్కొన్న సవాళ్లేంటి?

నా అభిమానులకు స్ర్కీన్‌పై నేను చూపించే ఎనర్జీ లెవెల్స్‌, చలాకీదనం ఎంతో ఇష్టం. వాటిని తిరిగి నటనలో చూపాలంటే మొదట్లో చాలా కష్టమయ్యేది. మొత్తానికి ఇప్పుడంతా ఓ.కే.

అప్పటిలా వరుస సినిమాలు చేయకుండా కేవలం సెలక్టివ్‌గా చేయడానికి కారణం?

వరుసగా సినిమాలు చేస్తేనే ప్రేక్షకులకు గుర్తుంటాం అనేది అపోహ. మంచి సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తే కచ్చితంగా గుర్తిండిపోతాం. అందుకే సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాను.

సినిమా ఫీల్డ్‌లో పోటీ ఎక్కువ. ముఖ్యంగా హీరోయిన్లకి. మీరు ఆ పోటీని తట్టుకుని ఎలా మీ ప్రత్యేకతను నిలబెట్టుకుంటారు?

ఇదో పోటీ ప్రపంచం. ప్రతీ ఫీల్డ్‌లో పోటీ అనేది చాలా సహజం. నేను దాని గురించి అస్సలు పట్టించుకోను. అదో అవరోధం. ఎవరి ప్రత్యేకత వారిది. మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగడమే మన చేతుల్లో ఉంటుంది.

నటిగా మీకు ఛాలెంజ్‌ విసిరిన సినిమాలు? మీ డ్రీం రోల్‌?


‘డార్లింగ్స్‌’ సినిమాలో పాత్ర. అందులోని పాత్ర కోసం బోలెడు వేరియేషన్స్‌ చూపించాల్సి వచ్చేది. డ్రీం రోల్స్‌ అంటే చాలా ఉన్నాయి. ఓ నటిగా అన్ని రకాల పాత్రలూ చేయాలనుంది.

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారా? దాని వల్ల కొంత ప్రతికూలత కూడా ఉంది. దానిపై మీ అభిప్రాయం?

యాక్టివ్‌గా ఉంటాను. అభిమానులతో టచ్‌లో ఉండడానికి అదో మార్గం. యాక్టింగ్‌ కెరీర్‌కు సహకరించే మార్గాల్లో సోషల్‌మీడియా ఒకటి. ప్రతీ దాంట్లో మంచి, చెడూ ఉంటాయి. అది మనం వాడే కోణాన్ని బట్టి ఉంటుంది. టూమచ్‌గా ఏది చేసినా హానికరమే కదా.

మీ కోస్టార్స్‌ చాలా మంది స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తున్నారు. మీరు కూడా అవి చేయడానికి సిద్ధమేనా?

ఇప్పుడు వస్తున్న సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ కామన్‌ అయిపోయాయి. ఒకవేళ మంచి సినిమాలో అవకాశం వస్తే ఆలోచిస్తాను.

మీ ‘నన్ను దోచుకుందువటే’ సినిమా ఉంది కదా. అలా మీ మనసు దోచినవారు

ఎవరయినా ఉన్నారా?

అవును, ఉన్నారు. సినిమా నా మనసును దోచేసింది. దాంతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్‌, ఫ్రెండ్స్‌, ఫ్యాన్స్‌... వీరంతా నా మనసును గెలిచినవారే.

సినిమాల విషయంలో మీ కుటుంబ సభ్యుల సపోర్ట్‌?

నేను చేసే ప్రతీ సినిమా విషయంలో వారి ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది. నేను చేసే సినిమాల్లో నా నటన గురించి మొదట వారే రివ్యూ ఇస్తారు.

వినాయకరావు


మీకు పెయింటింగ్‌ అంటే ఇష్టం కదా. ఈ మధ్య వాటికి తీరిక దొరికిందా?

నటిగా మారాక అంత టైమ్‌ ఉండేది కాదు. కానీ యాక్సిడెంట్‌ తర్వాత పెయింటింగ్‌ కోసం చాలా టైమ్‌ వెచ్చించా.

అలానే, ట్రావెలింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడూ రెండు నెలలు విరామం తీసుకుని యూరప్‌ అలా తిరిగివస్తుంటాను. అక్కడ కూడా వీలుచూసుకుని పెయింటింగ్స్‌ వేస్తుంటాను.

మీ బ్యూటీ సీక్రెట్‌? ఆరోగ్యం గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు?

ప్రతీ రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేస్తాను. టైమ్‌కు రెస్ట్‌ తీసుకోవడం. మంచి ఆహారం తీసుకుంటాను. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటాను. హైదరాబాద్‌ బిర్యానీ చూస్తే నోరూరిపోతుంది.

రోజూ సినిమాలు చూస్తారా? తెలుగులో మీ ఫేవరెట్‌ హీరోలు ఎవరు?

విడుదలయ్యే సినిమాలన్నీ దాదాపు కవర్‌ చేస్తా. ఒక్కరంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. అందరూ ఇష్టమే.

సినిమాల ఫలితం మిమ్మల్ని ప్రభావితం చేస్తుందా?

హిట్‌, ఫ్లాప్స్‌ను పట్టిందచుకోవడం అనేది చాలా మందికి ఉన్న సమస్యే. హిట్‌ వస్తే హ్యాపీ ఫీలవుతాం. ఫెయిల్యూర్‌ వస్తే దిగాలుపడిపోతాం. కానీ వీటిని అధిగమించి ముందుకు సాగాలి. సినిమా అనేది ఒక్కరి చేతుల్లో ఉండే పని కాదు. 24 క్రాఫ్ట్‌ ్స కలసికట్టుగా పనిచేయాలి, అప్పుడే అనుకున్నవి సాధిస్తాం. నా వరకూ, సినిమాలో నేను చేసిన పాత్రకు ఎన్ని మార్కులు పడ్డాయి. నటిగా ఎంత ఇంప్రూవ్‌ అయ్యాను అనే విషయాలను మాత్రమే పట్టించుకుంటా.


ఇవి కూడా చదవండి..

IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే

IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం.

Updated Date - Mar 23 , 2025 | 04:44 AM

News Hub